రాజధాని ఫైల్స్ సినిమాకు సంబంధించిన న్యాయవివాదాలు ఎలా ఉన్నా… అసలు సినిమా ఎలా ఉంది..? ఏముంది..? ఆర్జీవీ తీసే పొలిటికల్ సినిమాలాగే ఉంది… చట్టపరమైన చిక్కులు రాకుండా తప్పకుండా డిస్‌క్లెయిమర్ ఇస్తారని తెలిసిందే కదా… ‘ఇదంతా కల్పితం, ఇందులోని పాత్రలు నిజజీవితంలో ఎవరినీ పోలి ఉండవు’ అంటూ… ఇచ్చారు అలాగే…
అంతేనా..? అమరావతి ఐరావతి అవుతుంది… పాత్రల పేర్లను కూడా మార్చారు… కానీ మామూలు ప్రేక్షకుడికి కూడా ఏ పాత్ర ఎవరిని ఉద్దేశించిందో అర్థం అవుతూనే ఉంటుంది… జస్ట్, కోర్టుల కళ్లు కప్పటానికే ఈ పాత్రల పేర్ల మార్పిడి ప్లస్ కల్పితమనే డిస్‌క్లెయిమర్ కూడా… నిజంగానే కోర్టు గనుక వర్తమాన వ్యవహారాలపైనే తీసిన సినిమాగా, ఆయా ఒరిజినల్ వ్యక్తుల మనోభావాలు, ప్రతిష్టలు దెబ్బతింటాయని భావిస్తే మాత్రం కథ వేరే ఉంటుంది…
సరే, ఆ వివాదాన్ని అలా కాసేపు వదిలేస్తే, సినిమా ఎలా ఉంది..? బాగుంది… అమరావతి ఇష్యూ మీద ఈనాడు, ఈటీవీ స్పెషల్ స్టోరీలా… టీవీ5 న్యూస్ ప్రజెంటర్ వ్యాఖ్యానంలా… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాల సమర్పణలా… మహాన్యూస్ బాస్ వ్యాఖ్యల్లాగా… రకరకాలుగా ఉంది… సదరు సినిమా దర్శకుడు రామగోపాలవర్మను ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు… కాస్త ఒరిజినల్ వ్యక్తులను పోలే నటుల్ని పట్టుకున్నాడు… కానీ తను మరిచిపోయింది ఏమిటంటే…? సినిమా వేరు, డాక్యుమెంటరీ వేరు, న్యూస్ స్టోరీ వేరు అని…
Ads
ఊరికే ఓ డాక్యుమెంటరీని జనంలోకి వదిలే బదులు… వరుస న్యూస్ స్టోరీలను గుదిగుచ్చి ప్రేక్షకులపైకి సంధించే బదులు… కొంత క్రియేటివిటీ చూపిస్తే ఈ సినిమా కాస్త తెలుగుదేశం వాళ్లనైనా కనెక్ట్ అయి ఉండేది… రాజధాని ఇష్యూలో భూములిచ్చిన రైతుల బాధను, ఆందోళనను సరిగ్గా ప్రజెంట్ చేసినట్టు ఉండేది, అంతేకాదు… రాజధానుల విషయంలో జగన్ పాలసీ ఫెయిల్యూర్స్ కూడా బలంగా జనంలోకి తీసుకెళ్లినట్టు ఉండేది… కానీ సినిమా సంకల్పం మొత్తానికి అమరావతి ఇష్యూను సెంట్రిక్‌గా తీసుకున్నా సరే, జగన్ శిబిరాన్ని పొలిటికల్‌గా టార్గెట్ చేసినట్టుగా ఉండి, అసలు సమస్యను సరిగ్గా ఫోకస్ చేయలేకపోయింది… వార్తాకథనాల స్థాయిని దాటి కొత్తగా ఏం చెప్పగలిగారు..? ఏమీ లేదు..!
సేమ్, వ్యూహం సినిమా కూడా ఇంతకు భిన్నంగా ఉండకపోవచ్చు… వర్మ రీసెంట్ ట్రాక్ రికార్డు తెలిసిందే కదా… కాస్త బాగున్నట్టే అనిపించినా సరే యాత్ర-2 కూడా పూర్తిగా ఓ పొలిటికల్ భజన చిత్రం… అందుకే అదీ జనానికి కనెక్ట్ కాలేక చతికిలపడింది… రాజధాని ఫైల్స్‌లో ఒక ఎన్నికల వ్యూహకర్త సలహాలు, సూచనల్ని తుచ తప్పకుండా జగన్ పాటిస్తున్నాడనే పాయింట్ పదే పదే చూపించారు… పేరు ఏదైతేనేం, ప్రశాంత్ కిషోర్ పాత్ర అని అర్థమవుతూనే ఉంటుంది కదా…
అంతేకాదు, సీఎం చుట్టూ ఓ దొంగ లెక్కల ఎంపీ అట… అదెవరో కూడా ఇట్టే అర్థమవుతుంది… సీఎం పాత్రధారి ఎవరో గానీ బాగానే చేశాడు, రూపురేఖలు, బాడీ బాగానే సూటయ్యాయి… ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ జనానికి పంచే డబ్బుల్ని గనుక బ్యాలెట్ బాక్సుల పక్కనే పెట్టే స్పెషల్ బాక్సుల్లో గనుక వేస్తే, అవి 1.7 లక్షల కోట్లు అవుతాయట, వాటితో అమరావతి కట్టేస్తారట… ఇది సినిమాటిక్ అనిపించలేదు… అబ్సర్డ్…
(పదేళ్లయినా రాజధాని నిర్మించుకోలేని ఆంధ్రప్రదేశ్ పార్టీలు, నాయకులు, ప్రభుత్వాల వైఫల్యాన్ని మరింత బలంగా ప్రొజెక్ట్ చేసి ఉంటే నిజంగానే బాగుండేది… వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలు మరికొంతకాలం హైదరాబాదే రాజధానిగా కొనసాగాలని చేసే తాజా పిచ్చి డిమాండ్ తమ ఫెయిల్యూర్‌నే జనానికి చెప్పుకుంటున్నట్టుగా ఉంది… కానీ రాజధాని నిర్మాణ వైఫల్యాన్ని ఫోకస్ చేసి ఉంటే అది చంద్రబాబుకూ వ్యతిరేకం అవుతుంది కాబట్టి కేవలం అమరావతి భూములు, జగన్ ధోరణి, రైతుల ఆందోళన, వైసీపీపై నెగెటివిటీలకు మాత్రమే కథను పరిమితం చేశారు… దాంతో ఇది పొలిటికల్ మోటివేటెడ్ అని దర్శకనిర్మాతలే స్వయంగా చెప్పుకున్నట్టు అయిపోయింది…)
కానీ ఏమాటకామాట… గుడివాడ ఎమ్మెల్యే కేసినో గట్రా వివాదాలు కాస్త చూడబుల్… (కోర్టులో ఈ సీన్లపైనే వ్యాజ్యం ఉన్నట్టుంది)… చివరగా… క్లైమాక్సులో సీఎం పాత్రధారి తన పక్కనే ఉండే ఓ ఎంపీని బాత్రూంలోకి తన్ని, గొడ్డలితో నరికి … మన టీవీలో బాత్రూంలో గుండెపోటు మరణంగా చెప్పించండి అంటాడు… ఇదీ అబ్సర్డ్… కాకపోతే బాబాయ్ హత్యను తనే చేశాడని జనానికి చెప్పే ప్రయత్నం ఇది… హేమిటో… ఈ పొలిటికల్ సినిమాలు, మరీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రాసుకునే పోస్టుల్లా మారిపోతున్నయ్…!!
Share this Article