యూథనేసియా… euthanasia… మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెర మీదకు వచ్చింది ఈ పదం… నేపథ్యం ఏమిటంటే..? డచ్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అట్… వయస్సు 93 ఏళ్లు… ఆయన భార్య పేరు యూజినీ… ఆమె వయస్సు కూడా 93 ఏళ్లు… ఇద్దరూ ఇక ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నారు… వెళ్లిపోయారు… ఎలా..?
ఒకరి కళ్లల్లోకి ఒకరు ప్రేమతో చివరిచూపులు చూసుకుంటూ… కళ్లుమూశారు… నిజానికి ప్రపంచంలో ఇలాంటి మెర్సీ కిల్లింగులు కొత్తేమీ కాదు… పలు దేశాల్లో అది చట్టబద్దం… ఆత్మహత్య చేసుకోకుండా, అనుమతించిన రీతిలో, నొప్పి లేకుండా, వైద్యులతోనే ‘చంపేయించుకోవడం’… ఐతే ఇక్కడ ఆ ఇద్దరూ వృద్ధులూ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని, ‘చివరి చూపులు’ చూసుకుంటూ ఈ లోకానికి వీడ్కోలు పలికారనే సీన్ ఊహిాంచుకుంటేనే ఓ ఫీల్… నిజానికి మానవసహజ చాలా ఉద్వేగాల్లో ఈ ఫీల్‌కు సరైన పదం లేదేమో… ఒక్కసారిగా మనసు బరువెక్కే దృశ్యం కదా…
రకరకాల అనారోగ్య సమస్యలు… ఆయనకు ఓసారి బ్రెయిన్ హేమరేజ్… పూర్తిగా కోలుకోలేదు… ఆమెకూ వయస్సుపై బడేకొద్దీ వచ్చే అనారోగ్య సమస్యలు… ఆల్రెడీ 93 ఏళ్లు బతికాం… ఇంకా ఈ అనారోగ్యపు నొప్పులతో బాధపడటం దేనికని అనుకున్నారు… నొప్పిలేని ‘జంటమరణం’ కోరుకున్నారు… కడదాకా కలిసే ఉంటాను, కలిసే వెళ్లిపోదాం అనే పెళ్లినాటి మాట నిలబెట్టుకుంటూ, డెబ్భయి ఏళ్లపాటు ఆమెతోనే నడిచిన ఆయన ఇక ఆమె చేతిని పట్టుకుని, ఆమెను కూడా తనను ఈ లోకం నుంచి దాటించేశాడు… ఎక్కడో ఏదో చెమ్మగిల్లిన భావన…
Ads
చాలాదేశాలు దీనికి అనుమతించవు… అనారోగ్యాలు ఎంత పీడిస్తున్నా, నా అనేవారు ఎవరూ లేకపోయినా, ఉన్నవారు పట్టించుకోకపోయినా, తమ చావును కోరుకుంటున్నా స్వచ్ఛంద ‘న్యాయ మరణానికి’ ఆయా దేశాల చట్టాలు అనుమతించవు… మన దేశమూ అంతే కదా… ఆత్మహత్య అంటే భయం, నొప్పి, వణుకు… నిజానికి చాలామందికి చనిపోవాలని ఉన్నా సరే సరైన మార్గం లేక జీవితాన్ని లాగించేస్తుంటారు నానా బాధలతో… ఇది నిష్ఠుర సత్యం…
సరే, యూథనేసియా విషయానికే వద్దాం… కారుణ్య మరణం అనాలా..? కారుణ్య హత్య అనాలా..? ఇంకేదైనా మంచి పదం సృజించాలా..? డచ్‌లో అనుమతించబడిన నిష్క్రమణే ఇది… అన్నీ సరిచూసుకుని, జీవితపు లెక్కల పుస్తకాల్ని మూసేసుకుని, హాయిగా, స్వేచ్ఛగా, వైద్యుల పర్యవేక్షణలో, నియంత్రణలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం… కోర్టులు అనుమతించాలి… సరైన కారణాల్ని చూపాలి… అవును, మెర్సీ కిల్లింగుకు అర్హులే అనుకుంటేనే కోర్టు అనుమతిస్తుంది…
డేట్ ప్రకారం డాక్టర్లు ‘ప్రాణాంతకమైన ఇంజక్షన్’ ఇస్తారు… సాధారణంగా మత్తును కలిగించే ఇంజక్షన్లనే ఎక్కువ డోస్‌తో ఇవ్వడం వల్ల, మెల్లిమెల్లిగా మన దేహం ఏ నొప్పీ తెలియని స్థితిలోకి… తరువాత ఒక్కొక్క కీలకమైన శరీరభాగం స్పందనను, అంటే జీవక్రియల్ని కోల్పోతాయి… కాసేపటికి వారసులకు దేహాల్ని అప్పగిస్తూ… డెత్ సర్టిఫికెట్ మీద వైద్యులు సంతకాలు చేస్తారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ల పేజీల్ని చింపేస్తారు… ఒక్కసారి ఊహించండి… మన దేశంలో ఈ కిల్లింగులకు అనుమతిస్తే… ఈ మరణాల సంఖ్య ఎలా ఉంటుందో…!! అఫ్ కోర్స్, న్యాయస్థానాలు ఆ మరణవాంఛలో న్యాయం ఉందని భావిస్తేనే సుమా..!! (మన పాత మణిరత్నం దీనిపై ఓ సినిమా తీస్తే..?)
Share this Article