Gurram Seetaramulu…. జీవన తత్వాన్ని కుదించి చెప్పడంలో మా అమ్మ మాస్టర్. బాలి గాడు, పోలిగాడు కౌలు సేద్యానికి దిగారు. మొదటి రోజు ముళ్ళు, రాళ్లు, తుప్పలు ఉన్న ఆ బీడు సరి చేయడానికి పొద్దున్నే సద్ది కట్టుకుని పొలానికి పోయారు. కాసిన్ని గంజినీళ్ళు తాగి గొడ్డలి ఎత్తారు. కంపలోంచి ఒక కుందేలు ఉరికింది. ‘అరె, దాన్ని పోనీయకురా పోలిగా’ అన్నాడు బాలిగాడు.
అలా కుందేలు కోసం ఎల్లినోడు ఇక రాడాయె, పోలిగాని కోసం బాలిగాడు ఎదురు చూసాడు. రోజులు. నెలలు. మొత్తానికి బాలిగాడు ఒక్కడే ఒంటరిగా పొలం దున్ని, నాటేసి కలుపు దీసి, మందు మాకు వేసి,.. ఏపుగా ఎదిగిన బంగారు వన్నె వడ్ల కంకులను చూసి మురిసాడు బాలిగాడు.
మరుసటి రోజు పొలం కోసి తీరా పడుగు వేసే ముందు పోలిగాడి గొంతు.. అరె, కింద మడిలో ఎందుకు, పైమడిలో వేయండి’ అని అరుస్తున్నాడు. భుజం మీద ముల్లుగర్ర, దాని వెనక ఒక కుందేలు కట్టుకుని పొలంలోకి దిగాడు పోలిగాడు.
Ads
తన వాటా కోసం జబ్బలు చరిచాడు. పంచాయితీలో తెలివిగా కుందేలు కోసం వెళ్ళాను నేను అని వాదించాడు. నువ్వే కదా దాన్ని వదలొద్దురా అన్నది. దాని కోసం తిరుగుతూ, దొరకగానే వచ్చినా, నా వాటా నాకివ్వు అన్నాడు పోలిగాడు.
తెలంగాణ కోసం దిక్కూ మొక్కూ లేని జనం నడిచారు. వాళ్ళ సహచరులు అమరులై ముక్కలైన దేహాలతో మాయం అయ్యారు. లెక్కలు తెలియని వ్యూహాలూ ఎత్తుగడల మధ్య దారీతెన్నూ తెలియని బుద్ధి జీవులు ఉన్నారు. మీటింగ్ లు పెట్టారు. కాసే బోసి, నడికట్టు కట్టి, జబ్బకు తుపాకి, చేతిలో జెండాతో కొందరు. ఈ క్రమంలో పేరు ముందు ఎందుకు వేశారు అని అలిగి నోళ్ళు .
మరికొందరు పేరు లేకున్నా పిలవకున్నా మండే ఎండలో గూడు పదిలంగా కాపాడుకుంటూ, రాజ వీధిలో కాట్ వాక్ చేసే విదూషకులు. వెర్రి వెండితెర వేషాల సంతలో కేజీల లెక్క ఆటను పాటను అమ్ముకున్న వ్యాపారులు, తాబేదార్లు కూడా ఉన్నరు. ఇన్ని నెరవేరని కల్లోల కలల మేఘం తెలంగాణ సాకారం
మొత్తానికి తెలంగణా ఉద్యమానికి యాభై ఐదేళ్ళు. వేల ప్రాణాల సాక. కోటి గొంతుల పెనుకేక. అరవై తొమ్మిదిలో వసంత మేఘ గర్జన వెలుతురు నీకు తెలియదు. ఇడ్లీ సాంబార్ గో బాక్ లో నువ్వు లేవు. ముల్కీ నాన్ ముల్కీ కాలంలో నీ పత్తా లేదు. పెద్దమనుషుల ఒప్పంద కాలంలో నీ పెద్దరిక ఆనవాల్లే లేవు
ఏ హంతకుడు మా బెల్లి లలితను నరికాడో ఆ పాలనలో నువ్వు మంత్రివి. పాటకు ప్రత్యామ్నాయం గద్దర్ లో వెన్నుపూస తూటా నింపిన వాడు ఒకనాడు నీకు నాయకుడు. నీ పార్టీ కోసం గొంతెత్తిన సాంబశివుడి హత్య పాపం ఎవరిదో… మిలియన్ మార్చ్ లో నువ్వు లేవు, సాగర హారం వద్దే వద్దు అన్నవు
ఇన్ని త్యాగాల, రక్త సిక్తమైన చరిత్రకు నేనే ‘పిత’ను అని ఎవరైనా అంటే, నా దృష్టిలో పోలిగాడుతో సమానం, అందుకే అడుగుతున్న నువ్వు నా జాతిపితవు ఎట్లయినవ్..? #తెలంగాణ #జాతిపిత #కెసీఆర్, #బెల్లి
Share this Article