ఒక వార్త… గాంజా శంకర్ అనే సినిమాకు సంబంధించి యాంటీ నార్కొటిక్స్ బ్యూరో హీరోకు, నిర్మాతకు, దర్శకుడికి మరికొందరికి నోటీసులు జారీ చేసింది… కారణం ఏమిటంటే..? సినిమా టైటిల్ సరికాదు, ఫస్ట్ హై పేరిట రిలీజ్ చేసిన ట్రెయిలర్ కూడా యువతను పెడదోవ పట్టించేలా ఉంది, కొన్ని సీన్లు సరైన దిశలో లేవు, మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాలను నియంత్రించే సెక్షన్ల ప్రకారం ఇలా పెడదోవ పట్టించే ప్రసారాలూ సరికావు,.. సో, టైటిల్ మార్చండి, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి.,.. ఇదీ వార్త సారాంశం…
గుడ్… గంజాయి వ్యాప్తి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా పెరుగుతోంది… డ్రగ్స్ కూడా… (గంజాయి ప్రమాదకరమా కాాదా.., విచ్చలవిడిగా ప్రవహించే లిక్కర్ కన్నా తక్కువ ప్రమాదకరమా..? అనే విషయంలో చాలా వాదనలున్నయ్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో గంజాయి నిషిద్ధ మాదకద్రవ్యం కాదు… సరే, అదంతా వేరే సంగతి) మన చట్టాల ప్రకారం గంజాయి మాదకద్రవ్యమే… అమ్మకాలు, సాగు, సరఫరా అన్నీ నేరాలే… దానిపై దృష్టిపెట్టిన పోలీసులు చివరకు సినిమాలు, సీరియళ్లు వంటి క్రియేటివ్ కమ్యూనికేషన్ల మీద కూడా కన్నేయడం, మైక్రో లెవల్‌కు వెళ్లిపోవడం కూడా గుడ్…
యువతను పెడదోవ పట్టించే కంటెంట్, టైటిల్ దాకా పరిశీలించడం కూడా గుడ్… ఐతే ఒక సినిమా టైటిల్‌ను బట్టి అది యువతను పెడదోవ పట్టించేదని ఎలా ఓ కంక్లూజన్‌కు రావడం..? సినిమా టైటిల్ ఆడియెన్స్ అటెన్షన్ కోసం… సినిమా కథ గంజాయితో నష్టాలను ఫోకస్ చేసి ఉన్నారేమో..? ఇప్పుడే ఎలా చెప్పగలం..? ఆ ట్రెయిలర్ చూస్తుంటే ఓ హీరో నానారకాల అవలక్షణాల దుర్గుణవంతుడని కనిపిస్తూనే ఉంది… గంజాయి మాత్రమే కాదు, పొగ, మందు వంటి అన్ని అవలక్షణాల కథానాయకుడు… (అఫ్ కోర్స్, మాస్ అనగానే ఇవన్నీ కలిగి ఉండాలనే బేసిక్ సినిమా ఇండస్ట్రీ టేస్ట్ అభ్యంతరకరం…)
Ads
అసలు సినిమా మొత్తం పూర్తయితే కదా, అందులో దర్శకుడు ఏం చెప్పాడో తేలడానికి..! పైగా సినిమా రిలీజుకు ముందు సెన్సార్ ఇవన్నీ గమనిస్తుంది కూడా… నిజానికి పోలీసులు నేరుగా నిర్మాత, దర్శకుడు, హీరోలకు నోటీసులు ఇవ్వకుండా, సెన్సార్‌కు ఓ లేఖ రాసి, ఈ సినిమాను ఉదహరించి, సర్టిఫికెట్ జారీకి ముందు టైటిల్, కంటెంట్ ఎట్సెట్రా సీరియస్‌గా పరిశీలించాలని చెప్పి ఉంటే సరిపోయేదేమో… (అసలే సెలబ్రిటీల డ్రగ్స్ విషయంలో మన పోలీసులు, ఎక్సయిజు వాళ్లకు చేదు అనుభవాలున్నయ్)
మరో విషయం… హీరోలకు సామాజిక బాధ్యత ఉండాలనే పోలీసుల సూచన అభినందనీయం… ఆచరణీయం కూడా… ఒక హీరో ఏది చేస్తే యువత దాన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తుంది, అందుకని హీరోలు బాధ్యతాయుతంగా ఉండాలనేది గుడ్… ఇక్కడ మరో విషయం… సాయిధరమ్‌తేజ కాస్త డిఫరెంట్… నేషన్, సొసైటీ పట్ల కన్సర్న్ ఉన్నవాడిగా కనిపిస్తాడు… డబ్బు కోసం ఏ పాత్ర పడితే అది టేకప్ చేసే కేరక్టర్ కాదు, ఎట్ లీస్ట్, నాకు తెలిసి..! (ఈవిషయంలో సదరు సినిమా నిర్మాతలకో, హీరోకో నా సమర్థన, మద్దతు కాదు ఇది…)
ఇక్కడ చిన్న సందేహం… ఎర్రచందనం స్మగ్లర్‌ను పుష్ప సినిమాలో హీరోగా చూపించారు… త్వరలో సెకండ్ పార్ట్ కూడా రాబోతోంది, మూడో భాగానికీ సై అంటున్నారట… మరి అది స్మగ్గింగును ఎంకరేజ్ చేసినట్టు కాదా..? నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోల సినిమాలు బోలెడు వచ్చాయి… సో, సెన్సార్ కాస్త ఎక్కువ విచక్షణతో వ్యవహరిస్తేనే ఇలాంటి అంశాల్లో బెటర్…! ఇక్కడ పోలీసుల చర్య తప్పు కాదు, సినిమా వంటి బలమైన మీడియం ఎంత బాధ్యతగా ఉండాలో సూచించడమూ తప్పు కాదు, కాకపోతే ఆలూ లేదు, చూలూ లేదు, అసలు సినిమాయే పూర్తి కాలేదు, అప్పుడే నోటీసుల దాకా ఎందుకు అనేదే ప్రశ్న..!
Share this Article