అనుకుంటున్నదే… కార్తీకదీపం సీరియల్‌ను చివరలో నానా బీభత్సం చేసి, కథను నానా మలుపులూ తిప్పి, ప్రధాన పాత్రధారుల్ని చంపేసి, కొత్త జనరేషన్ కథ కొనసాగింపు పేరిట ప్రేక్షకుల్ని, కార్తీకదీపం సీరియల్ ప్రేమికుల్ని నానా హింస పెట్టాడు ఆ దర్శకుడెవరో గానీ…
తరువాత ఇక తమకే చిరాకెత్తి, ప్రేక్షకుల తిరస్కారం ఎక్కువైపోయి, రేటింగుల్లో దిగజారిపోయి, ఇక కుదరదు అనుకునే స్థితిలో అర్థంతరంగానే కార్తీకదీపం సీరియల్ కథకు ముగింపు పలికాడు అప్పట్లో సదరు దర్శకరత్నం… ఒక సీరియల్ ఎలా ఉండి, ఎలా పాపులర్ కావాలో చాటిన ఆ సీరియల్ చివరకు ఒక సీరియల్ ఎలా మారకూడదో చెప్పడానికి ఉదాహరణగా మారిపోయింది…
కానీ ఆ దర్శకుడు వదలడు… కార్తీకదీపం సీరియల్ సాధించిన అత్యుత్తమ రేటింగులు, డబ్బు రుచిమరిగిన సదరు నిర్మాతలు మళ్లీ సీక్వెల్‌కు వస్తారని చాలామంది ఊహిస్తున్నదే… పైగా స్టార్ మాటీవీ సీరియళ్లు కార్తీకదీపం తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్టినవేమీ లేవు… సో, ఆ పాతదాన్నే మళ్లీ తెర మీదకు తీసుకువస్తున్నారు… పేరు కార్తీకదీపంII … ఇది నవ వసంతం ట్యాగ్ లైన్…
Ads
వోకే, అసలే ప్రేక్షకులు సీరియళ్లను వదిలి వెబ్ కంటెంటై వైపు వేగంగా మళ్లుతున్న రోజులివి… పైగా కార్తీకదీపం ఫస్ట్ పార్ట్ కథనే ఎటో ఎటో తీసుకుపోయి ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టారు… మరి ఇప్పుడు కొత్తగా ఎక్కడ మొదలుపెడతారు..? ప్రోమో చూస్తే అదే సౌర్య… కాకపోతే పాత్రధారి వేరు… మా అమ్మే నాకు అన్నీ అంటోంది, నాన్న తెలియదు అంటోంది… సో, పాత కథ మధ్య నుంచి కొత్త కథను ఆరంభిస్తారేమో… కావచ్చు, ఎలాగూ సదరు నిర్మాతలకు టీవీ ప్రేక్షకులు పిచ్చోళ్లని స్థిరాభిప్రాయం కదా…
మళ్లీ అదే ప్రేమి విశ్వనాథ్ దీపగా, అదే పరిటాల నిరుపమ్ కార్తీక్‌గా ఉంటారా..? అన్నింటికీ మించి అదే శోభాశెట్టి మోనితగా ఉంటుందా..? డౌటే..! వాళ్లు లేకపోతే ఆ సీరియల్‌కు ఆ కళ రాదు, ప్రేమి సీరియల్ ప్రేక్షకులపై వేసిన ముద్ర అలాంటిది… (నిజానికి ఆ సీరియల్ మొదట్లో ఆ పాత్ర స్కిన్ టోన్ నలుపు, కథలో ఇదీ ముఖ్యమే, కానీ క్రమేపీ ఫెయిర్ కలర్‌లోకి మార్చేశారు…) ప్రేమి కార్తీకదీపం తరువాత ఇంకేమీ చేయలేదు… అదేదో హీరోయిన్ సెంట్రిక్ సినిమా అన్నారు గానీ అదేమైందో తెలియదు… అసలు ఎక్కడా వార్తల్లోనే లేదామె…
అంతెందుకు..? ఈ కార్తీకదీపం ఒరిజినల్ మలయాళంలోని కరుథముత్తులో కూడా ప్రేమి విశ్వనాథ్‌ను మార్చేసి రేణు సౌందర్‌ను పెట్టారు… సో, కార్తీకదీపం సీరియల్‌ను ఆక్సిజెన్‌లా భావించే ప్రేమీయే సెకండ్ పార్ట్‌కు డౌట్… (అసలు ఫస్ట్ పార్ట్‌లో ఆ పాత్రను హఠాత్తుగా చంపేసి, జనం ఛీత్కరించాక, మళ్లీ బతికించి, ఆ పాత్రను కొనసాగించాలని అడిగితేనే మొదట ఆమె తిరస్కరించింది అంటారు…) సరే, నిరుపమ్ మళ్లీ అడిగితే దొరుకుతాడు… ఆ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లయిపోయారు… (అందుకే సెకండ్ పార్ట్‌లో సౌర్య పాత్ర కృతిక బదులు ఇంకెవరో అమ్మాయి పోషించింది..)
మళ్లీ మోనిత పాత్ర ఉంటుందా..? ఉండకపోతే, సెకండ్ పార్ట్ సోసో అని లెక్కేసుకోవాల్సిందే… శోభాశెట్టి భలే నటించింది ఆ పాత్రలో… మొన్నామధ్య బిగ్‌బాస్ కంటెస్టెంటుగా పాల్గొంది… ప్రస్తుతం ఖాళీ, ప్రయత్నిస్తే తను మళ్లీ దొరుకుతుంది… ఎటొచ్చీ రేటింగుల కోసం ఏమేం పైత్యపు విన్యాసాలు చేయబోతున్నారనేదే అసలు పాయింట్…
ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ వియత్నాం భాషలో ది బ్లాక్ పెరల్ పేరిట, అనురాగర్ ఛోవా పేరిట బెంగాల్‌లో నడుస్తోంది… కాగా హిందీలో కార్తీకపూర్ణిమ, కన్నడంలో ముద్దులక్ష్మి, తమిళంలో భారతి కన్నమ్మ, మరాఠీలో రంగ్ మజా వేగలా, హిందీలో రెండో పార్ట్ ఏ ఝుకీ ఝుకీ సి నజర్ కూడా ఎప్పుడో ముగిశాయి… మలయాళం ఒరిజినల్ కరుథముత్తు కూడా ఎప్పుడో 2019లోనే ముగిసింది… నాలుగు భాగాల 1450 ఎపిసోడ్స్ చివరకు వాళ్లకే విసుగెత్తి ఫుల్ స్టాప్ పెట్టినట్టున్నారు… కానీ తెలుగులో మాత్రం రెండో పార్ట్ పేరిట, ఆ టైటిల్ బ్రాండ్‌ను సొమ్ము చేసుకోవడం కోసం వస్తోంది… వస్తోంది…!!
Share this Article