‘ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట ఎంపీగా బరిలో నిలవబోతున్నారు…’ ఒక వార్త… ఏ పార్టీ..? ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, తను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు క్లారిటీ లేదు కాబట్టి… తను యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉన్నాడా లేదా కూడా తెలియదు కాబట్టి…
అవునవును, గుర్తొచ్చింది, ఆయన బీజేపీలో చేరాడు కదా అప్పట్లో… కానీ ఏం లాభం.? ఏపీ బీజేపీ తెర మీద ఆ చేరిక తరువాత అసలు కనిపిస్తే కదా… జనంలోకి వస్తే కదా… వార్తల్లో ఉంటే కదా… రాష్ట్రంలో తిరిగితే కదా… జనం సమస్యలపై, ఏపీ రాజకీయాలపై అసలు నోరు విప్పితే కదా… ఇన్నాళ్లలో ఒక్కటంటే ఒక్క సమస్య మీద కూడా తను నోరు తెరిచినట్టు గుర్తు లేదు… మళ్లీ అదే ప్రశ్న… నిజంగా ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాడా..?
నేను జగన్‌ను నిలువరిస్తా, నేనూ సీమ రెడ్డినే అని చెప్పుకున్నాడో, సోనియా ఏం నమ్మిందో గానీ సారు గారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యాడు… జగన్ మరింత బలపడిపోయాడు… సోనియా ఓ ఎత్తుగడగా తెలంగాణ అస్త్రం ప్రయోగించింది, కనిపించకుండా పోయిన కేసీయార్ హఠాత్తుగా తెర మీదకు వచ్చేశాడు… ఈ కిరణ్ కుమార్ రెడ్డేమో నేను రాష్ట్రాన్ని చీలనివ్వను, చివరి బాల్‌కు నా సిక్సర్ చూడండి అంటూ ప్రజలను మభ్యపెడుతూ కాలం గడిపి చివరకు దిగిపోయాడు…
Ads
జనంలో బాగా సమైక్య భావన ఉందనుకుని, కాంగ్రెస్ లో ఉంటే నూకలు చెల్లవని గ్రహించినవాడై… కొత్త పార్టీ పెట్టాడు, చెప్పుల గుర్తు, అభ్యర్థులు దొరకలేదు… చివరకు పరువు పోయింది… తరువాత తెరమరుగు… పూర్తిగా… గతంలో కిరణ్ కుమార్ రెడ్డి అనే లీడర్ ఉండేవాడు అని కూడా జనం గుర్తుచేసుకోనట్టుగా… ఏమైందో ఏమో బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చాడు… ఏపీ బీజేపీకి అన్నీ ఇలాంటి కేరక్టర్లే కావాలి కదా…
సరే, వచ్చాడు, బీజేపీకి ఏం ఒరిగింది..? శూన్యం..! ఇప్పుడిక సారు గారికి రాజంపేట సీటు కావాలి… అబ్బే, బీజేపీ నుంచి ఆ సీటులో పోటీచేస్తే మిగిలేది మన్ను, తనకేం వస్తుంది అంటారా..? నో… టీడీపీ అంటే బీజేపీకి ఇష్టం లేదు, ఐనా నేను బలవంతంగా ఒప్పించాను అంటున్నాడు కదా పవన్ సారు… సో, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఉంటే, బేరం కుదిరే సీట్లలో బీజేపీకి రాజంపేట దక్కితే, ఇంకేం..? అయ్యగారు పోటీ చేసేస్తారు… గెలిచినా గెలుస్తారు…
ఏమవుతుంది..? గెలిస్తే జాతీయ స్థాయిలో బీజేపీ నంబర్ మరొకటి పెరుగుతుంది… అంతకుమించి బీజేపీకి ఒరిగేదేమీ ఉండదు, పక్కా… కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్టవుతుంది… నిజంగానే బీజేపీ రాజంపేట, తిరుపతి, రాజమండ్రి అడుగుతోందట… తిరుపతిని జనసేన వదిలిపెడుతుందానేది డౌటే… కానీ బేరసారాల్లో ఎక్కడో రాజీపడాల్సి ఉంటుందిగా… కొన్నాళ్ల క్రితం చంద్రబాబు వెళ్లి అమిత్ షాతో ఏవో మాట్లాడుకుని వచ్చాడు కదా, ఇప్పుడిక పవన్, చంద్రబాబు కలిసి వెళ్తారట… సరే, ఇదంతా వోకే గానీ… బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరితే, వదిన గారు, మరిది గారు కలిసి ఎన్నికల ప్రచారం చేస్తారన్నమాట… వావ్…
Share this Article