బూతులు, మహిళా నేతలపై వెగటు విమర్శలు, వ్యక్తిత్వ హననాలు, వెకిలి వెక్కిరింపుల నుంచి చివరకు కుర్చీ మడతపెట్టి తిట్టుకునేదాకా దిగజారింది ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కొట్లాట… సోషల్ మీడియాలో జరిగే యుద్ధానికి ఆకాశమే హద్దు… దానికి మర్యాదలు మన్నూమశానాలు జాన్తానై… మొన్న ఎక్కడో లోకేష్ ఓ కుర్చీని మడతపెట్టి చూపిస్తున్న ఫోటో కనిపించింది… తనకు ఆ కుర్చీ మడతపెట్టడం అనే పదాల్ని ఎందుకు వాడతారో తెలుసా అసలు..? తెలిసీ ఆ వెకిలి ప్రదర్శనకు దిగాడా…?
ఇక కులం టార్గెట్‌గా ఊళ్లల్లో, పట్టణాల్లో పెడుతున్న కేసులకు అంతే లేదు… విలేకరులపై, పత్రిక కార్యాలయాలపై దాడులు… చేతనైతే యాజమాన్యాల భరతం పట్టండి, కటకటాల్లోకి నెట్టండి, కానీ కేవలం ఉద్యోగులు మాత్రమే అయిన జర్నలిస్టులకు జోలికి రావడం దేనికి..? నథింగ్ డూయింగ్… ఎన్నికలయ్యేలోపు ఇంకెన్ని దాడులు ఉంటాయో… ప్రత్యర్థి పార్టీ పగ్గాలు చేపట్టిన సొంత చెల్లెలినే పోలీసులు లిఫ్ట్ చేసి స్టేషన్‌లో పడేశారు…
నిర్మాణాత్మక, వృత్తిపరమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఎట్సెట్రా మీడియా సంస్థలు అయితే అచ్చంగా విషాన్ని ప్రసారం చేస్తున్నాయి… అది ద్వేషం… సాక్షి ఏమైనా శుద్ధపూసా అనడక్కండి… దిగజారిన తెలుగు జర్నలిజంలో దాని పాత్ర కూడా తక్కువేమీ కాదు… మరొక దారుణమూ ఆంధ్రజ్యోతిలో కనిపించింది…
Ads
వైసీపీ దాడిలో ఓ మహిళ ఏకంగా చూపునే కోల్పోయిందనేది వార్త సారాంశం… సరే, పార్టీల కొట్లాటలో ముందుగా క్షతగాత్రులయ్యేది ఇలాంటివాళ్లే కదా… ఏపీ పాలిటిక్స్ ఇంకా దిగజారడానికి లోతులు ఉన్నాయా అంటే… ఎందుకు ఉండవు, రెండు పార్టీలూ కొత్త లోతులు తవ్వుకుని మరీ జారిపోతారనే సమాధానమే వస్తుంది… ఈ ఫోటో చూడండి… టీడీపీ, వైసీపీ రంగులు, పార్టీ గుర్తులతో సహా ప్రచారంలోకి వచ్చిన కండోమ్స్…
కుర్చీలు మడతపెట్టేదాకా వచ్చిన ప్రచారం కండోమ్స్ దాకా వస్తే ఆశ్చర్యం ఏముంది అంటారా..? నిజమే… ముందుగా ఎవరు స్టార్ట్ చేశారో గానీ కండోమ్ ప్రచారం సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు.,. కౌంటర్ తప్పదు కదా, ఎదుటి పార్టీ మరొక వీడియోను ప్రవేశపెట్టింది… ఆయా పార్టీలు ‘క్రియేటివిటీ’ని ప్రదర్శిస్తున్నాయి… బూతు సినిమాల్ని చూపిస్తున్నాయి జనానికి, వెబ్ సీరీసుల్లాగా… (ఈ కండోమ్స్ జస్ట్, ప్రచారం కోసమే సుమండీ…)
కండోమ్స్ మాత్రమేనా వయాగ్రా మాత్రల్ని కూడా పార్టీ గుర్తుతో పంచిపెడతారా అని ఓ పార్టీ వ్యంగ్యాన్ని విసురుతుంది… కండోమ్స్ వాడి బర్త్ కంట్రోల్ చేయండ్రా బాబూ, ఖజానాపై భారం తగ్గుతుంది మరో పార్టీ విసుర్లు… ఈ పెంట యుద్దంపై జాతీయ మీడియా కూడా వార్తలు వేస్తోంది…
నో డౌట్… ఇలాంటి బురద జల్లుకోవడంలో ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు, ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఈ యజ్ఞాల్లోనే తలమునకలుగా శ్రమిస్తూ ఉంటాయి… కానీ మరీ ఇలా కండోమ్స్ దాకా జారిపోవాలా అనేది ప్రశ్న… దురదృష్టవశాత్తూ ‘అప్పుడే ఏమైందీ’ అనే జవాబే వినిపిస్తోంది…!! ఇదా రాజకీయ స్పర్థ..!?
Share this Article