చాన్నాళ్ల క్రితం… ఆల్ ఇండియా రేడియోకు చెందిన కలకత్తా స్టేషన్ డైరెక్టర్ రెండున్నర అణాల్ని ఖర్చుపెట్టి, ఒక జూలోని ఒక టైగర్‌కు పెద్ద మాంసం ముక్క వేశాడు…
వాళ్ళు ఒక చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తున్నారు, అందుకని టైగర్ గట్టిగా గాండ్రించడానికి ఆ మాంసం అన్నమాట…
నో, అలాంటి ఖర్చు పెట్టడానికి స్టేషన్ డైరెక్టర్‌కు అధికారం లేదని ఆడిట్ అభ్యంతరం వచ్చింది… వెంటనే ఆ డబ్బు తిరిగి చెల్లించేసి, ఇకపై అలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అది సూచించింది…
ప్రోగ్రాముల్ని రికార్డ్ చేసేటప్పుడు, అందులో పాల్గొనే ఆర్టిస్టుల కోసం కొంత అదనపు ఖర్చును పెట్టే అధికారం స్టేషన్ డైరెక్టర్ పోస్టుకు ఉందని ఆయన ఆఫీసు ఆడిట్ వాళ్లకు రిప్లయ్ ఇచ్చింది…
సరే, మంచిది, అసలు ఆర్టిస్టు అంటే ఎవరో ఒకసారి ఆఫీసు మాన్యువల్ చూసుకొండి, అలాగే రేడియోకు సదరు ఆర్టిస్టుకు నడుమ ఒప్పందం ఏమీ లేకుండా డబ్బు ఖర్చుచేయొద్దు కదా… సదరు ఆర్టిస్టు టైగర్‌కూ రేడియోకు నడుమ ఒప్పందం కుదిరి, టైగర్ సంతకం చేసిన కాపీ ఒకటి పంపించండి అన్నారు ఆడిట్ వాళ్లు…
రెండూ ప్రభుత్వ శాఖలే కదా… ఎవరూ తగ్గడం లేదు…
స్టేషన్ డైరెక్టర్ ఆఫీసు ఈసారి ఇంకా తెలివిగా సమాధానం పంపించింది… ‘ఆఫీసు మాన్యువల్ పరిశీలించాం, ప్రోగ్రాముల్లో వీఐపీలు పాల్గొన్నప్పుడు ఖర్చు రూల్స్‌కు కొన్ని సడలింపుల్ని స్టేషన్ డైరెక్టర్ తీసుకోవచ్చునని ఉంది… అదేమో రాయల్ బెంగాల్ టైగర్, ఆర్డినరీ కాదు… అది రాయల్ బెంగాల్ టైగరేనని నిర్ధారించిన జూ అధికారుల సర్టిఫికెట్ జతచేస్తున్నాం, రాయల్ బెంగాల్ టైగరేనని పక్కాగా నిర్ధారించుకున్నాకే, ఆ ఒప్పందం అనే నిబంధన నుంచి మినహాయింపు తీసుకున్నాడు మా స్టేషన్ డైరెక్టర్… పైగా సదరు టైగర్ తన పర్‌ఫామెన్స్ కోసం ఎలాంటి ఫీజు చెల్లింపు కోసం ఒత్తిడి చేయలేదు…’
ఆడిట్ ఆఫీసర్‌కు ఇంకేం కొర్రీ పెట్టాలో అర్థం కాలేదు… ఆడిట్ అభ్యంతరాన్ని డ్రాప్ చేసేశాడు… మరి బ్యూరోక్రసీయా మజాకా…!!
(గతంలో ఇది చదివినట్టుగా అనిపిస్తోందా..? పర్లేదు, ఈ తెలుగు అనువాదాన్ని మరోసారి కొత్తగా చదవండి… నిత్యనూతనమైన సూత్రాలు ఇవి…)
Share this Article