Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జై సచ్చిదానంద… ఇదేం వివక్ష స్వామీ… దేవదేవుడి కర్తవ్యబోధ ఇదేనా…

February 27, 2024 by M S R

రాయలసీమలో ఒక పల్లెటూరు… ఒంపులు తిరిగిన నల్లటి తారు రోడ్డు.. రోడ్డుకి అటూ ఇటూ చెట్లు.. మేము వెళ్తున్న కారు లైటింగ్ పడి తారురోడ్డు మెరుస్తోంది. దూరంగా పల్లెటూరులో లైట్లు మిణుకు మిణుకు మంటున్నాయి.. కారు లైటింగ్ కి కొన్ని పరుగులు ఎగురుతూ వచ్చి లైట్ల మీద పడుతున్నాయి.. ఊరికి చేరుకోగానే. దూరంగా గుడిలోంచి భజన శబ్దాలు మైకులోంచి పెద్ద శబ్దంతో వినిపిస్తున్నాయి.. ఊరి మొదట్లో బొడ్డు రాయి, దానిపక్కనే అమ్మవారి గుడి కనిపించింది..బొద్దురాయికి పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి.. చల్లటిగాలికి అమ్మవారి గుడి ముందు ఉన్న వేపచెట్టు కొమ్మలు, ఆకుకు గాలికి ఊగుతున్నాయి.. అమ్మవారి గుడికి ఎదురుగా చిన్న కిరాణాషాప్ కనిపించింది..

అలా వీధిలోకి వెళ్తుంటే.. పగలంతా కాయకష్టం చేసిన రైతులు ఊళ్లోకి తిరిగి వస్తున్నారు.. అక్కడో పెద్ద వీధి ఉంది.. వీధిలో ప్రతి ఇంటికి రాతి అరుగులు కనిపిస్తున్నాయి .. ఆ ఆరుగుల మీద వయసు మళ్లిన పెద్దావిడ, నడివయసులో ఉన్న ఇంకో మహిళ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు.. ఇంకో అరుగుమీద ఇద్దరు ముసలి అవ్వలు కబుర్లాడుకుంటున్నారు.. ఇంకో అరుగుమీద బనియన్, పంచెతో ఉన్న ముగ్గురు పెద్దమనుషులు చర్చించుకుంటున్నారు.. అలా ముందుకు వెళ్తే ఇంకో అరుగుమీద నలుగురు యువకులు, ఇక నడివయస్కుడైన రైతు ఊసులాడుకుంటున్నారు..

ఎదురుగా ఆంజనేయస్వామివారి ఆలయం ఉంది.. అందులోనే భజన కార్యక్రమం జరుగుతోంది.. అందులోంచి వచ్చే భజన అంతా మైకులోంచి ఊరి మొత్తం వినిపిస్తోంది.. నేను అలా వీధిలోంచి మొబైల్ తో వీధిలో దృశ్యాలన్నీ చిత్రీకరిస్తుంటే అరుగుల మీద కూర్చున్న వాళ్లంతా నన్ను విచిత్రంగానూ, అనుమానంగానూ, అమాయాకంగానూ చూస్తున్నారు..

Ads

మరో వీధిలోకి వెళ్తుంటే రెండేళ్లు ఉంటాయేమో చిన్న బాబు చిన్న మేకపిల్లతో ఆడుకుంటున్నాడు.. ఆ మేకపిల్ల ఆ బాబు ఎక్కడికెళ్తే అక్కడికెళ్తోంది. అతనితోపాటే గెంతుకుంటూ ఆడుతోంది.. ఆ బుడ్డోడు ప్రతిరోజూ ఆ మేకపిల్లకి వేపాకులు తెచ్చి పెడతాడు.. అందుకే దానికి వాడంటే ప్రాణం అని చెబుతోంది ఒక పెద్దావిడ.. వేపాకులు ఎందుకు చేదుగా ఉంటాయి కదా అన్నాను… లేదు మేకపిల్ల .. గడ్డి తినేవరకూ వేప ఆకులే తింటుంది అందావిడ.. ఆ మేకపిల్లతో ఆ బుడ్డోడు ఆడుతుంటే అన్నీ మర్చిపోయి చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాను..

అలా ముందుకు నడుస్తుంటే ఇంటి గుమ్మంలో కూర్చుని అన్నం తింటోంది మరో పెద్దావిడ. నేను వీడియో తీస్తోంటే నవ్వుతూ అన్నం తింటున్నా.. ఇప్పుడే పొలం కాడినుంచి వచ్చా అంటోంది.. కల్మషం లేని ఆ పెద్దావిడ మాటలు, ఆవిడ నవ్వు చూశాఖ నాకు మనసులో ఏదో తెలీని ఆనందం..
కొంచెం ముందుకు రాగానే శెట్టిగారి చిన్న కిరాణా కొట్టు ఉంది.. చెక్కల్తో చేసిన చిన్న డబ్బా మాదిరి ఆ కొట్టు ఉంది.. సమయం అయిపోయినట్టుంది. కొట్టు మోస్తుంటే పిల్లలు అంతా వచ్చి ఏవో బిస్కట్లు కొనుక్కుంటున్నారు..

కొంచెం ముందుకురాగానే పాలకేంద్రం కనిపించింది.. అదికూడా ఒక అరుగుమీదే ఒక యువతి అందరిదగ్గరా పాలు పోయించుకుంటోంది..వాళ్లు తెచ్చిన పాలల్లోంచి శాంపిల్ కింద కొన్ని పాలు తీసుకుని పక్కనే ఉన్న మిషన్లో పెడుతోంది.. దానిలో వచ్చిన వెన్న శాతాన్ని బట్టి లీటర్ ఇంతలెక్కాన ధర నిర్ణయిస్తారట..ఇంట్లో ఆవులు లేనివాళ్లు కొందరు వచ్చి అక్కడ పాలు పోయించుకుని వెళ్తున్నారు.. పక్కనే నాలుగు పెద్ద పెద్ద పాల క్యాన్లు కనిపించాయి..

ఇంకొంచెం ముందుకు వస్తూ ఒక అరుగుమీద కాసేపు కూర్చున్నాను.. యాడి నుంచి వచ్చినావు? అని అడిగారు ఒక పెద్దాయన. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.. మీరు రోజూ ఇలాగే అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారా? అని అడిగాను

మాకు కాలక్షేపం ఇదే కదా.. మా పిల్లకాయలంతా హైదరాబాద్ పోతే మేమే ముసలి ముతకా అంతా ఇక్కడ మిగిలిపోయాం.. ఇదిగో పగలంతా పొలం చూసుకుంటాం.. రాత్రైతే ఇలా అందరం కూర్చుని కష్టం సుఖం మాట్లాడుకుంటాము అన్నారు
అదిగో ఆ ఇల్లు గణపతి సచ్చితానంద స్వామీజీది అన్నారు
ఏదీ మైసూర్ గణపతి సచ్చితానంద స్వామీజీ వారి ఇల్లా అన్నాను
అవును ఆ స్వామిదే.. మీరు ఊళ్లోకి అడుగుబెట్టేపుడు పెద్ద ఆశ్రమం కనిపించింది కదా అదే ఆయన ఆశ్రమం.. ఇక్కడే ఈ ఇంట్లోనే ఆయన పుట్టాడు.. మీరు లోపలికి వెళ్లి చూస్తానంటే ఇంటి తాళం తెప్పిస్తా అన్నారు
వద్దులెండి .. కానీ మరి ఊరికి ఆయన ఏమైనా చేశారా? అన్నాను
ఏమీ చేయలేదు.. కనీసం ఆశ్రమం వాళ్లు మంచినీళ్లు కూడా ఈయరు అన్నారు
అదేంటి అంటే .. ఏమో తెలీదు, ఆయన ఊరికి ఎలాంటి సాయం చేయలేదు .. ఆయన మాత్రం ఏడు వందల ఎకరాల్లో ఇక్కడ ఆశ్రమం కట్టారు.. చాలామంది దుడ్లు ఉన్నోళ్లు ఉచితంగానే భూములు ఆశ్రమానికి ఇచ్చారు.. అన్నారు..
ఆ మాటలకి ఆశ్చర్య పోయాను.. గణపతి సచ్చితానంద స్వామీజీ నాకు కూడా తెలుసు.. మా బెజవాడలోనూ ఆయన ఆశ్రమం ఉంది.. గతంలో ఆయన్ని నేను కూడా ఇంటర్వ్యూ చేసాను .. మరి సొంత ఊరి వారికి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వకపోవడం బాధేసింది

మేము ఆ ఊరికి వెళ్లేప్పటికి ఇంకా చీకటి పడలేదు.. మా స్నేహితుడు మమ్మల్ని వారి పొలానికి తీసుకెళ్లాడు..అక్కడికి వెళ్తుంటే దారి పొడవునా బెండ కాయ, కర్భూజా, మొక్కజొన్న , వంకాయ , వేరుశనగ పంటలు కనిపించాయి..  స్నేహితుడి తోటలో మొత్తం కర్భుజా వేశారు.. మేము తినడానికి మంచి కాయలు దొరుకుతాయేమోనని ట్రై చేశా.. కానీ కాయలు ఇంకా పక్వానికి రాలేదు.. రోజూ రాత్రి వాళ్ల బావ వచ్చి ఆ పొలంలోనే పడుకుంటాడట.. లేకపోతే జింకలు, అడవిపందులు, కుందేళ్లు వచ్చి కర్బూజ కాయలన్నీ తినేస్తాయట.. అలాగే పక్కా తోటలో మొక్కజొన్న ఎండిపోతోంది.. దానికి నీళ్లు లేక రైతు పంటని వదిలేసాడట.. అందులోంచి చిన్న చిన్న మొక్క జొన్న పొత్తుల్ని నేనే కోసాను..

వాళ్ల ఇంటికి వచ్చేటప్పటికి స్నేహితుడి వాళ్ల అమ్మ.. మాకోసం ఉగ్గాని, పకోడి అందులోకి పల్లి కారం చేసి పెట్టింది.. ఆ ఉగ్గాని, పల్లి కారం, మధ్యలో పకోడి తింటుంటే.. ఈ జన్మమే.. రుచి చూడగా దానికి దొరికేరా.. ఈలోకమే వండి వార్చగా దానికి వేదికరా.. అనే పాట గుర్తొచ్చింది.. ఇవి తినేలోపే అమ్మ మేము తెచ్చిన మొక్క జొన్న పొత్తుల్ని ఉడకబెట్టి వాటికి కారం, ఉప్పు, నిమ్మకాయ రాసి ప్లేట్లో పెట్టి తెచ్చారు.. అప్పటికే ఉగ్గానితో పొట్ట నిండిపోయింది..కానీ అమ్మ ప్రేమతో తెచ్చిన ఆ మొక్క జొన్న పొత్తులు మరింత రుచిని తెచ్చిపెట్టి తినేలా చేశాయి.. అమ్మకి ధన్యవాదాలు చెప్పి ఆ ఊరికి, ఆ చల్లగాలికి, ఆ కల్మషం లేని మనుషులకి, ఆత్మీయతతో నిండిన మనసులకి వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను.. అశోక్ వేములపల్లి

(ఆ ఊరిపేరు బొమ్మెపర్తి.. జయలక్ష్మీపురం అని కూడా అంటారు.. గణపతి సచ్చితానంద స్వామీజీ ఆ ఊరికి తన తల్లి పేరు పెట్టారట.. ఆ ఊరు ఆ పల్లె జనం అంతా ఎంతో నచ్చారు.. నిజానికి ఆ ఊరు వదిలి రాబుద్ది కాలేదు.. కానీ ఒకటే ఒక విషయం బాధ కలిగించింది.. ఆంజనేయస్వామి గుడికి గోడకు చిన్న కిటికీ మాదిరి వీధివైపు ఉంది.. అందులోంచి చూస్తుంటే లోపల స్వామికి జరుగుతున్న పూజా కార్యక్రమం, స్వామివారి విగ్రహం అన్నీ కనిపిస్తున్నాయి..ఆ కిటిక్ ఎదురుగా పెద్ద బండరాయి కూడా ఉంది..

నేను ఆ కిటికీని ఆసక్తిగా గమనిస్తుంటే .. ఒక పెద్దాయన వచ్చి ఊరికి కొత్తనా? అన్నారు .. అవును.. గుడికి పక్కనే ద్వారం ఉంది కదా ఇక్కడ ఈ కిటికీ ఎందుకు అన్నాను.. ఈ గుళ్ళోకి దళితులెవరూ అడుగు పెట్టకూడదు.. ఒకవేళ ఎవరైనా వస్తే ఇలా గుడిబయట కిటికీలోంచి చూసి దణ్ణం పెట్టుకుని వెళ్లిపోవాల్సిందే.. టెంకాయ కూడా ఇక్కడే కొట్టాలి అన్నారు.. ఇంకా ఈ రోజుల్లో దళితులను గుళ్ళోకి రానీయని కుల వివక్ష కొనసాగుతోందా.. అని బాధ కలిగింది)…… వేములపల్లి అశోక్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions