ఒక వార్త చూడగానే కలిగిన సందేహం ఏమిటంటే..? కాళ్లకు మట్టెలు ఎందుకు తొడుగుతారు..? అదీ పెళ్లిలో వరుడే వధువుకు ఎందుకు తొడగాలి..? ఈ ఆచారం వెనుక పరమార్థం ఏమిటి..? సరే, ముందుగా ఆ వార్త ఏమిటో చూద్దాం… ( ఏ పత్రికో తెలియదు, అది అప్రస్తుతం…) వేములవాడ సెంటర్ నుంచి జనరేటైన వార్త అది… ఇది…
కల్యాణలక్ష్మి పథకం కేసీయార్ స్కీమే… పెళ్లి ఖర్చుల కోసం పేద తల్లిదండ్రులకు 50 వేలు ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడమే ఆ పథకం… షాదీ ముబారక్ కూడా ఇదే… సరే, సంకల్పం మంచిదే అయినా, అనేకానేక కేసీయార్ పథకాల్లాగే దాన్నీ భ్రష్టుపట్టించారు అవినీతిపరులు, అక్రమార్కులు… దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత పెంచి లక్ష రూపాయలు, తులం బంగారం అని ప్రకటించింది…
కొన్ని స్కీములను ప్రారంభించడమే గానీ, తరువాత వచ్చే ప్రభుత్వాలు రద్దు చేసే సాహసం కుదరదు, రాజకీయాల్లో అదంతే… అయితే ఈ సాయం కావాలంటే ఏం చేయాలి..? రూల్స్ ప్రకారం పెళ్లి పత్రిక, పెళ్లి ఫోటోలు, పెళ్లి ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల కాపీలు జతచేసి దరఖాస్తు చేసుకోవాలి… పెళ్లి పత్రిక, పెళ్లి ఫోటో, మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి… పేదల పథకం కాబట్టి ఆదాయ ధ్రువీకరణ పత్రం, అగ్రవర్ణాలకు వర్తించదు కాబట్టి కులధ్రువీకరణ పత్రం… ఇవన్నీ సరే…
Ads
కానీ తాజాగా వరుడు వధువు కాళ్లకు మట్టెలు తొడిగే ఫోటో కూడా జతచేయాలట… లేకపోతే కల్యాణలక్ష్మి లేదుపో అంటున్నారట… ఈ కొత్త నిబంధన ప్రభుత్వం నుంచి వచ్చిన రూల్స్‌లోనే ఉందని రెవిన్యూ అధికారులు చెబుతున్నారని సదరు వార్త చెబుతోంది… మొదట అసలు మట్టెలు ఎందుకు..? ఇదీ ప్రశ్న… అబ్బో, బోలెడు మంది బోలెడు కథలు, బాష్యాలు చెప్పారు… వాటి సారాంశం ఏమిటంటే…
- పెళ్ళైన మహిళలు కాలికి మెట్టెలు, నుదుట తిలకం, మెడలో తాళి, జడలో పూలు పెట్టుకోవడం మన సాంప్రదాయం కాబట్టి,..
- కాలి బొటనవేలు పక్కన ఉండే వేలు స్త్రీలకు ఆయువు పట్టు… దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తుంటుంది… కనుక ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు కాబట్టి అలా తగలకుండా ఉండటానికే మట్టెలు ధరించే సంప్రదాయం వచ్చింది.
- కాలి రెండవ వేలి నుండి ఓ ప్రత్యేక నరం గర్భాశయానికి సంధి చేయబడి, గుండె వరకు వెళుతుంది… కాలికి మెట్టెలు ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి, వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట…
- వారి రుతు క్రమం సరిగ్గా ఉంటుందట. ఈ వేలికి మట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృఢపడుతుంది.
- వెండి మట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుందట. మట్టెలు వెండితో చేసినవి ధరిస్తారు.. వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల… భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుంది…
- కాలి మట్టెలు రెండూ కూడా సంతానాబివృద్ధికి, సుఖ ప్రసవం అవడానికి అనుకూలించే నాడులను సున్నితంగా నొక్కుతు ఉంటాయి.
- అన్నింటికీ మించి ఈ మట్టెలు వివాహిత అని చెప్పే మరో గుర్తు అట…
- తాళి కట్టినట్టే వరుడు మట్టె తొడగాలి…
అబ్బో, ఇదేందిర భయ్, మట్టెల వెనుక ఇన్ని రహస్యాలున్నాయా అని హాహాశ్చర్యపోకండి… మన ట్యూబర్లు ఇంకా చాలాచెప్పగలరు… చెత్తా మూఢనమ్మకాల ప్రసారానికి వేదికగా మారిన ఓ పాపులర్ తెలుగు చానెల్ అయితే ఇంకా చెప్పగలదు, అది వదిలేస్తే…
ఇది తెలుగువారి సంప్రదాయం, ఇతరుల పెళ్లిళ్లలో ఇది కనిపించకపోవచ్చు, మరెలా..? అంతెందుకు..? హిందూ మతంలోనే తెలుగు ఇళ్లల్లోనే కొందరు దీన్ని పాటించరు… మరి వాళ్లకు ఈ సాయం ఎలా..? అబ్సర్డ్ నిబంధన కాదా ఇది… ఇదుగో ఇవే రేవంత్ సర్కారును బదనాం చేసేవి… ఇంకా నయం… ఫంక్షన్ హాలు సర్టిఫికెట్, పెళ్లి విందు ఫోటో, వడ్డించిన ఆహారం వివరాలు, పురోహితుడు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న దృశ్యం, వడి బియ్యం ఫోటో, తలంబ్రాల ఫోటో, ఎంగేజ్‌మెంట్ ధ్రువీకరణలు గట్రా జతచేయమనలేదు… అక్కడికి హేపీ…!!
Share this Article