ముందుగా ఓ వార్త చదవండి… దాదాపు ప్రతి మీడియాా ఇదే కోణంలో రాసుకొచ్చింది… ఆశ్చర్యం, హాశ్చర్యం, హహాశ్చర్యం అన్నీ… ‘లేడీ పవర్ స్టార్‌గా సౌత్‌లో మంచి ఇమేజ్ సంపాదించుకుంది హీరోయిన్ సాయిపల్లవి… ఎన్ని కోట్లు ఇచ్చినా ఎక్స్‌పోజింగ్, గ్లామరస్ పాత్రలు చేయకుండానే సంప్రదాయ పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు… రొమాంటిక్ సాంగ్‌లో నటించబోతుందనే వార్త టాలీవుడ్‌లో దుమారం రేపుతోంది…’’
రాసిన శైలి ఎలా ఉన్నా, దాదాపు ప్రతి మీడియాలోనూ ఇదే కంటెంట్… అయ్యో, ఇది విన్నారా సుబ్బమ్మత్తా, సాయిపల్లవి రొమాంటిక్ సాంగ్ చేస్తుందట, హవ్వ, విడ్డూరం కాకపోతే ఆమె ఈ పాత్రలు చేయడం ఏమిటీ… అని ఇరుగూపొరుగూ అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నట్టుగా ఉంది ఆ కంటెంట్… ఇక్కడ ఓ ప్రశ్న… అసలు రొమాంటిక్ సాంగ్ అంటే ఏమిటి..?
కొన్ని సినిమాల్లో మన స్టార్ హీరోలు, స్టారర్ హీరోయిన్ల డ్యూయెట్లలాగే కిస్సులు, హగ్గులు, కన్ను కొడుతూ లోపలకు రా అన్నట్టు సైగలు, నడమూపుళ్లు ఎట్సెట్రా అనేనా..? దాన్నే రొమాంటిక్ సాంగ్ అనాలా..? మరీ కొన్ని సినిమాల్లోనయితే హీరోయిన్ అందాల ఆరబోతకే సాంగ్స్ పరిమితం… దాన్ని రొమాంటిక్, గ్లామర్ సాంగ్ అనాలా..? రొమాంటిక్ సాంగ్‌లోనూ అర్జున్‌రెడ్డి టైపు బీభత్స రొమాన్స్ ఉంటుంది, కొందరిది అంటీఅంటని నెమలీక టైపు రొమాన్స్…
Ads
మొన్నటి గుంటూరు గురూజీ సినిమాలో సూపర్ హిట్ పాట ఉంది కదా… కుర్చీ మడతపెట్టి… ఆ బూతు పక్కనపెడితే, అది ఐటమ్ సాంగా, డ్యూయెట్టా, రొమాంటిక్ సాంగా.,.? మహేశ్ బాబు, శ్రీలీల కలిసి స్టెప్పులేస్తారు కదా… అదేనా రొమాన్స్ అంటే..? ఆ పాట సాహిత్యం వినండి ఓసారి, అది పక్కా ఓ వేశ్యావాటిక సాంగ్… దాన్ని కూడా రొమాంటిక్ సాంగ్ అనాలా..? రొమాన్స్‌కూ అశ్లీలతకూ తేడా లేదా..?
ఇంతకీ సాయిపల్లవి సాంగ్ ఏ టైపు..? అనేకానేక జీవన ఉద్వేగాల్లో రొమాన్స్ కూడా ఒకటి… అది కాదంటే ఆమె అసలు నటిగానే పనికిరాదు… కాకపోతే అశ్లీలం, అసభ్యత లేకుండా, తను ఎక్స్‌పోజ్ చేయకుండా నటిస్తుంది, నర్తిస్తుంది, అంతే… అంతెందుకు..? చైతూ, వరుణ్ తేజ, నానిలతో డ్యూయెట్లు పాడలేదా ఏం..? హగ్గులు గట్రా ఉన్నాయి కదా… ఎన్‌జీకేలో సూర్యతో డాన్సింది కదా… అంతెందుకు..? రౌడీబేబీ సాంగ్ యూట్యూబ్ రికార్డు కదా… ఒక స్టెప్పులో ధనుష్ పైకి పొర్లుతూ ఎక్కుతుంది… ఇలా, క్లిక్కండి ఓసారి…
మరీ భానుమతి టైపులో… ఎంత పెద్ద తోపు అయినా సరే, నన్నంటకూడదు అన్నట్టు నటిస్తానంటే ఈకాలంలో ఎలా కుదురుతుంది… ఆమె పాడుతుంటే, ఆడుతుంటే ఎంత స్టారుడు అయినా ఎడ్డిమొహం వేసుకుని, టచకుండా, దూరదూరంగా కనిపించేవాడు… అప్పుడలా కుదిరింది… సరే, ఎలాగూ ప్రస్తావన వచ్చింది కదా… మేఘసందేశం సినిమాలో ఓ పాట…
‘సిగలో… అవి విరులో, అగరు పొగలో అత్తరులో’ అనే పాట అక్కినేని, జయసుధల శోభనం రాత్రికి సంబంధించింది… కమనీయంగా, హృద్యంగా, అందంగానే చిత్రీకరించారు… అలాంటి సాంగ్స్ మన పాత సినిమాల్లో బోలెడు, మరో ఉదాహరణ కావాలా..? పగలైతే దొరవేరా, రాత్రికి నా రాజువురా అనే సాంగ్… అది వెన్నెల పూల రొమాన్స్… సో, రొమాన్స్ సాంగ్ అనగానే సాయిపల్లవి కూడా బరితెగించిందోచ్ అన్నట్టుగా కూతలేల, రాతలేల… ప్రతి రొమాంటిక్ సాంగ్ ఎక్స్‌పోజింగ్ కాదు… ఆమె, బాడీ స్ట్రక్చర్‌కు ఎక్స్‌పోజింగ్ కూడా సూట్ కాదు…!!
Share this Article