ఇదే సందర్భం ఒకవేళ కేసీయార్‌కు ఎదురైతే ఎలా ఉండేది..? తను ఏం చేసేవాడు..? మోడీ ఏం చేశాడు..? నిజానికి ఏం చేయాలి..? ఒక ఊహ, ఒక కల్పన… ఎందుకంటే..? ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని కాదు… ఇష్యూస్ పట్ల నాయకుల స్పందన, వైఖరులు వేర్వేరుగా ఉంటయ్… కథలోకి వెళ్తే… ఈ పసికందు ముంబైలోని ఓ ధనిక కుటుంబంలోనే పుట్టింది… విషాదం ఏమిటంటే… పుట్టుకతోనే ఓ అత్యంత అరుదైన వ్యాధి… స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ… ఊపిరి పీల్చుకోవడం, కదలడం, పాలు తాగడం అన్నీ కష్టమే… ఆరు నెలల్లోపు ఓ చికిత్స అవసరం… మన దేశంలో లేదు… ఆ మందులూ దొరకవు… తెప్పించాలంటే బోలెడు ఖర్చు… 16 కోట్ల విలువ… తెప్పిస్తే 6 కోట్ల జీఎస్టీ ప్లస్ ఇతర సుంకాలు… వాళ్లది డబ్బున్న కుటుంబమే అయినా మరీ అంత డబ్బున్నవాళ్లు కాదు… చేయి చాచారు… క్రౌడ్ ఫండింగ్… డబ్బులొచ్చినయ్… కానీ ఆ జీఎస్టీ, ఇతర పన్నులు ఎలా..? మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు… ఆయన నిర్మలా సీతారామన్‌ను అప్రోచయ్యాడు… లాభంలేదు, ఇక మోడీకి లేఖలు రాశాడు… పీఎం కార్యాలయంతో తనకు పరిచయాలున్నయ్ కాబట్టి ఇష్యూ మోడీ దాకా చేరేలా ప్రయత్నించాడు… మోడీ స్పందించి జీఎస్టీ ప్లస్ అదర్స్ నుంచి మినహాయింపు ఇచ్చాడు… ఇక్కడి వరకూ గుడ్… బాగుంది… (తిక్క తిక్క వాదనలు, పోస్టలు తప్ప ఇలాంటి స్పూర్తిదాయక, పాజిటివ్ న్యూస్ జనంలోకి బాగా తీసుకుపోవడం వాట్సప్ యూనివర్శిటీకి ఎప్పుడూ చేతకాదు… దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రమే ఓ ట్వీట్ ద్వారా షేర్ చేసుకున్నాడు…)
ఎందరికి ఇలా క్రౌడ్ ఫండింగ్ ఈ స్థాయిలో లభించగలదు..? ఎందరికి మాజీ సీఎంల తోడ్పాటు లభించగలదు..? ఎందరు పీఎం కార్యాలయంలో పలుసార్లు పర్స్యూ చేయగలరు..? ఈ అరుదైన కేసు తన నోటీసుకు వచ్చినప్పుడు కేవలం ఈ కేసు గురించే ఆలోచించాడు మోడీ, కానీ… రెగ్యులర్ మందులు గాకుండా… ఇలాంటి అరుదైన, అత్యవసర మందుల్ని (లైఫ్ సేవింగ్ డ్రగ్స్) తెప్పిస్తే ఏ పన్నులూ ఉండబోవని ప్రకటిస్తే మోడీ ఎంత ఉన్నతంగా కనిపించేవాడు..? అంతేకాదు, ఈ కేసు విషయంలో చికిత్స ఖర్చును కేంద్రం గనుక భరిస్తే… అదీ నిజమైన ‘ఆయుష్మాన్‌భవ’ అనిపించుకునేది… పాలసీల ద్వారా అందరికీ సంక్షేమం వర్తింపజేయాలి తప్ప, ఒకటీరెండు సందర్భాల్లో ఔదార్యం చూపిస్తే ఫలితమేమిటి అనే ప్రశ్న రావచ్చు… కానీ అవసరమైనప్పుడు, అవకాశమొస్తే ప్రభుత్వం తన అరచేతిని అడ్డుపెట్టి ఇలాంటి పసిదీపాల్ని, ఇతర ప్రాణాల్ని కాపాడుతుందనే ఓ భరోసా ఇచ్చినట్టు అయ్యేది… ‘‘తల్లీ, నేనున్నాను నీకు’’ అనే ఒక్క ట్వీట్ కొట్టి ఉంటే మోడీ ప్రతిష్ట కూడా పెరిగేది… వ్యక్తిగతమే కాదు, ఈ దేశ ప్రధాని హోదాకు… (వంద దేశాలకు కోవిడ్ వేక్సిన్ పంపిణీ, ఏటా వేల కోట్ల ఆయుష్మాన్‌భవ పథకాల్ని మించిన పాజిటివ్ ప్రచారం వచ్చి ఉండేది…)
Ads
నిజం… మోడీ జనంతో మానవతాకోణంలో ఎన్నడూ కనెక్ట్ కాలేదు, కాలేడు… ఉదాహరణలు కూడా లేవు… నిజానికి ఇలాంటి సందర్భం కేసీయార్‌కు ఎదురైతే… (తన దృష్టి దాకా తీసుకు వెళ్లడం కూడా కష్టమే…) తనేం చేసేవాడు..? వెంటనే ఆ పసిపాప చికిత్స పొందుతున్న హాస్పిటల్ వెళ్లేవాడు… అన్ని ఖర్చులనూ ఖజానా నుంచి భరిస్తామని ప్రకటించేవాడు… ఆ పసికందు తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేవాడు… (ఉదాహరణ :: ప్రత్యూష… సవతి తల్లి కిరాతకంతో దాదాపు చావు అంచుల్లోకి వెళ్లిన ఆమెను చేరదీసి, విద్యాబుద్ధులు చెప్పించి, పెళ్లి చేశాడు… అత్తింటిలోకి పంపేవరకు తను కణ్వుడయ్యాడు…) ఇలాంటివి జనంలోకి విస్తృతంగా వెళ్తాయి… అఫ్కోర్స్, దానివల్ల తనకు వ్యక్తిగతంగా ఇమేజ్ పెరగవచ్చు… కానీ ప్రాణావసరాల్లో ప్రభుత్వం ఆదుకుంటుంది అనే ఓ భరోసాను, పాజిటివిటీని, ఆశల్ని నింపడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి… అంతేకాదు, ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ పాలసీలు ఎలా ఉండాలనే అంశంపై చర్చ రేకెత్తించేలా చేస్తాయి…
Share this Article