ఒక వార్త… ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందిన 31 ఏళ్ల ఓ యువకుడు… 17 ఏళ్ల ఓ బాలికను ప్రేమించాడు… పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు… అత్యాచారం చేశాడు… తరువాత బాలిక తల్లిదండ్రులు ఫిబ్రవరి ఒకటిన అరెస్టు చేసి, ఝర్‌పాడ జైలుకు పంపించారు… ఇప్పుడామెకు 18 ఏళ్లు నిండాయి… అంతేకాదు, జైల్లో ఉన్న సదరు యువకుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది…
తమకు పెళ్లి జరిపించాలని లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది… సదరు యువకుడు తను ఉంటున్న జైలు అధికారులనూ ఇదే కోరాడు… వాళ్లూ ఓకే అన్నారు… తనేమో అండర్ ట్రయిల్… అందుకని జైలునే పెళ్లి వేదికగా చేశారు… పందిరి వేసి, బాజాభజంత్రీలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ పెళ్లి చేశారు… ఇరు కుటుంబాలు పాల్గొన్నాయి…
Ads
వార్త వరకూ స్థూలంగా చూస్తే… అబ్బో, మన అధికారులు, మన న్యాయ వ్యవస్థ ఎంత గొప్పవి… మంచి మనస్సులతో అధికారులు ఆ ఇద్దరికీ పెళ్లిపెద్దలుగా మారి, జైలునే కల్యాణవేదికను చేసి, శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించారు కదా… సూపర్… అన్నట్టుగా అదే కోణంలో వార్తలు సాగాయి… పెళ్లి తరువాత తతంగాల మాటేమిటో గానీ… అసలు కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి…
పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేసిన వాడు నిజంగానే ఆమెను ప్రేమించిన ప్రేమికుడేనా..? దాన్ని ప్రేమ అనాలా..? సరే, ఆమెకు అప్పటికి పెళ్లివయస్సు రాలేదు… పెళ్లికి మైనర్ కాబట్టి ఆ లైంగిక బంధం అత్యాచారం అయ్యిందా..? పోనీ, ఆమె కూడా తనను ప్రేమించి ఉండి ఉంటే మరి తల్లిదండ్రులు ఆయనపై అత్యాచారం కేసు పెడుతుంటే ఎందుకు వారించలేదు..? మేమిద్దరం ప్రేమికులం, పెళ్లిచేసుకుంటాం అని ఎందుకు చెప్పలేదు..?
వోకే, 18 ఏళ్లు నిండాయి, అత్యాచారం చేసినా సరే, వాడినే పెళ్లి చేసుకోవాలని ఆమె అనుకుంది, అత్యాచారం బయటపడ్డాక ఇక నన్నెవరూ పెళ్లిచేసుకోరు, ఇక ఈ జీవితానికి వాడే దిక్కు అనుకుందీ అనుకుందాం కాసేపు… అవేవో దిక్కుమాలిన పాత తెలుగు సినిమాల్లో ఈ కథలూ ఉన్నాయి కదా, అత్యాచారం చేసినవాడి వెంబడి అత్యాచార బాధితురాళ్లు పడి పడి, వాడిని మార్చి చివరకు కథలు సుఖాంతం చేశారు… అత్యాచారం చేసినవాళ్లనే పెళ్లిచేసేసుకుంటే ఆ నేరాలు మాసిపోయి, అధికార పార్టీల్లో చేరినట్టు హఠాత్తుగా పునీతులైపోతారు కదా…
లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ పెళ్లికి సహకరించింది కదా… ఈ కేసులో పెద్ద బలమే లేకుండా పోయింది కదా… రేప్పొద్దున ఆమే నెగెటివ్ సాక్ష్యం చెప్పదు కదా… తనెలాగూ శిక్ష పడిన ఖైదీ కాదు కదా… బెయిల్ ఇప్పించవచ్చు కదా… ఎంచక్కా బయటికి వచ్చాక ఊరందరూ చూసేలా పెళ్లి జరిగేది కదా… ఐనా, అంత అర్జెంటుగా వాళ్లిద్దరికీ పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది..? జైలులోనే ఈ ప్రహసనానికి పూనుకోవడం దేనికి..? నాలుగు రోజులు పోతే బెయిల్ వచ్చేది కదా…
వాళ్లే పెళ్లి చేసుకున్నాక, ఇక కేసు నాలుగు రోజులు నడిచినా సరే పెద్దగా బలం ఉండదు దాంట్లో… ‘మైనర్ మీద లైంగిక దాడి’ అనేదే ప్రధాన కేసు అయితే సదరు మైనర్, ప్రస్తుత మేజర్, తన భార్యే తనకు శిక్ష పడేలా కోర్టు విచారణకు సహకరించదు కదా… సో, ఈ కథలో చెప్పుకోవడానికి ఏ నీతీ లేదు… ఆ న్యాయ, జైలు అధికారులు ఊడబొడిచిన ఉద్దరణ కూడా ఏమీలేదు… తలకుమాసిన టీవీ సీరియళ్ల కథలాగే ఉంది…!!
సనాతన ధర్మంలో బ్రాహ్మణ వివాహం, గాంధర్వ వివాహం, దైవ వివాహం, ఆర్ష వివాహం, ప్రజాపత్య వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం, పిశాచ వివాహం అని రకాలున్నయ్… అత్యాచారం చేసి, అనివార్యంగా పెళ్లి చేసుకునేలా చేసి, చట్టం సాక్షిగా తాళి కట్టే ఈ వివాహాన్ని ఏ జాబితాలో చేర్చాలి..? లేక తొమ్మిదోరకం వివాహంగా గుర్తించాలా..?
Share this Article