నో, నో, ఈ ఏకగ్రీవాలు ఎన్నికల స్పూర్తికే విరుద్ధం, నేనంగీకరించను, ఠాట్, ఆపేయండి అని గర్జించిన నిమ్మగడ్డ వారు గవర్నర్‌ను కలిసి రాగానే ఏకగ్రీవాలకు వోకే అనేశాడు… గవర్నర్ ఏం చెప్పాడు, ఈయన ఎందుకు అనివార్యంగా వినాల్సి వచ్చింది అనేది మళ్లీ వేరే పెద్ద కథ… హోం శాఖకు ఎస్ఈసీ నుంచి ఏమైనా లేఖ చేరిందా..? గవర్నర్ కోపంగా ఉన్నాడా..? వంటి వివరాలు మళ్లీ ఏ కిషన్ రెడ్డో స్వయంగా, లేక ఏ విజయసాయిరెడ్డో తవ్వి వెల్లడించాలి… నిన్ను కలిసేదేముంది అన్నట్టుగా అడమెంటుగా వ్యవహరించిన కీలక ఉన్నతాధికారులు నిమ్మగడ్డతో భేటీ వేసి, నవ్వుతూ, తుళ్లుతూ వ్యవహరించడం ఏమిటి..? ఏమిటీ విపత్తు..? అది ఇప్పట్లో తేలే యవ్వారంగా కనిపించడం లేదు…
చంద్రబాబు నిమ్మగడ్డను ముందుపెట్టుకుని ఆడిస్తున్నాడు అని వైసీపీ ఆరోపిస్తుంటే… నో, నో, ఈ ఎన్నికల సంఘం ఫెయిలైంది అని చంద్రబాబు విమర్శలు చేయడం ఏమిటి..? మళ్లీ ఇదేం ట్విస్టు..? అసలు ఏం జరుగుతోంది..? అన్నింటికీ మించి నిమ్మగడ్డ ‘ఎన్నికలు సజావుగా, సాఫీగా జరుగుతున్నాయి’ అని అధికార యంత్రాంగాన్ని అభినందించడం ఏమిటి..? తెల్లారిలేస్తే కసికసిగా ప్రభుత్వం మీద, అధికార యంత్రాంగం మీద విరుచుకుపడే నిమ్మగడ్డ ఇంత పాజిటివ్ వ్యాఖ్యలు చేయడం ఏమిటి అసలు..? ఒకవైపు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డ మీద కారాలు మిరియాలు నూరబోతున్నదీ, సీరియస్‌గా ఉండబోతున్నదీ అనే అభిప్రాయాలు వ్యాప్తి చెందుతున్నవేళ ఏమిటీ వైపరీత్యాలు..? తోపు విశ్లేషకులు కూడా జుత్తు పీక్కుంటున్నారు… అసలేం జరుగుతోంది..?
Ads
ఆహా… ఏం ఫోటో… కన్నులపండుగ… ఒకవైపు నిమ్మగడ్డ… మరోవైపు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు… ఎంత ఆహ్లాదకరమైన ఫోటో… కానీ నిజమేనా..? ఈమధ్యకాలంలో కనిపించిన మోస్ట్ హిపోక్రటిక్ సీనరీయా..? మొన్నమొన్ననేకదా మంత్రి పెద్దిరెడ్డిని హౌజ్ అరెస్టు అని ఎస్ఈసీ ఆదేశించింది… వెంటనే జోగి రమేష్, తరువాత కొడాలి నాని… వైసీపీ క్యాంపు నుంచి నిమ్మగడ్డ మీద దాడి సాగుతూనే ఉందిగా… మరేమిటి ఈ అసాధారణ దృశ్యాలు..? అంతా చల్లబడిందా..? అంతా చక్కబడిందా..? చాన్సే లేదు కదా… జగన్ ప్రభుత్వం మీద నిమ్మగడ్డ కోపానికి కారణం ఉంది… నిమ్మగడ్డ మీద జగన్ సర్కారు ద్వేషానికీ కారణం ఉంది… మరెలా ఈ నవ్వుల్, పువ్వుల్..?
నిజానికి అప్పుడే అయిపోలేదు కదా… పెండింగ్ పరిషత్ ఎన్నికలున్నయ్… మున్సిపల్ ఎన్నికలున్నయ్… నిమ్మగడ్డకు ఇంకా నెలన్నర టైముంది… ఇంకా చాలా పొలముంది, పొద్దుంది… మనసులో కసితనం ఉంది… మరి అకస్మాత్తుగా ఈ పాజిటివ్ వైబ్స్ ఏమిటి..? ఇంకేదైనా కొత్త భారీ ప్లాన్‌కు నిమ్మగడ్డ తెరతీయబోతున్నాడా..? ఇదీ వైసీపీ క్యాంపులో కిందామీదపడేస్తున్న మథనం… రాజకీయ విశ్లేషకుల్లో అయోమయతనం… అసలు చంద్రబాబు ఎస్ఈసీ ఫెయిల్యూర్ అనడం, జగన్ అధికార యంత్రాంగం భేషుగ్గా పనిచేస్తున్నదీ అని నిమ్మగడ్డ సర్టిఫికెట్ ఇవ్వడం… ఇంకేదో తుపాన్‌కు ముందస్తు సంకేతాలా..? కచ్చితంగా తెరవెనుక ఏదో జరుగుతోంది… అదేమిటో తెలియదు… మాంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా… కాకాణి గోవర్ధన్‌రెడ్డి భయ్యా, ఇదంతా దేనికి అంటావ్..?!
Share this Article