Sai Vamshi……. మతం.. అతి మామూలు వస్తువుగా ఉన్న కాలం ఒకటి …
… నిండా పదిహేడేళ్ల అమ్మాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు. స్టార్ స్టేటస్. అద్భుతమైన రోల్స్. సమకాలీన నటీమణులకు నిజంగానే దడ పుట్టించేంత నటనా వైదుష్యం.. ఇవన్నీ నటి శోభ సొంతం. తల్లిదండ్రులు మలయాళీలు. కానీ శోభ పుట్టి పెరిగిందంతా చెన్నై. ఆమె తల్లి ప్రేమ కూడా మలయాళ నటి కావడం విశేషం. ‘తట్టుంగల్ తిరక్కపడుమ్’ అనే తమిళ సినిమాతో బాలనటిగా అరంగేట్రం చేసి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారి విజయ శిఖరాలు ఎక్కారు శోభ. 18 ఏళ్లు రాకుండానే అర్ధంతరంగా తనువు చాలించారు. ఆమె తుది కాలం ఒక విషాద కావ్యం.
… ఇప్పుడు విషయం ఆమె గురించి కాదు, ఆమె నటించిన ‘ఒరు వీడు ఒరు ఉళగం’ (ఒక ఇల్లు ఒక ప్రపంచం) సినిమా గురించి! అప్పటికి ఆమె వయసు ఎంతని? పట్టుమని పదహారేళ్లు. కానీ ఏం నటన! వాహ్! కథ ప్రకారం ఒక బ్రాహ్మణ కుటుంబంలోని అమ్మాయి (శోభ) తన మాస్టారికి జ్వరం తగ్గాలని తల్లి (పండరీబాయి) దగ్గరికి వచ్చి తులసి ఆకుల కషాయం అడుగుతుంది. ఆ కషాయం తీసుకుని వెళ్తూ, ఆయన జ్వరం తగ్గేందుకు పెరుమాల్ (వెంకటేశ్వర స్వామి)కి మొక్కుకోమని తల్లితో అంటుంది. తల్లి నవ్వి, ‘మీ మాష్టారు క్రైస్తవుడే! వాళ్లకు బాగవ్వాలంటే మేరీ మాతను మొక్కుకోవాలి’ అంటుంది.
Ads
… ఆ అమ్మాయి చర్చికి వెళ్లి మేరీ మాత విగ్రహం ఎదుట నిలిచి ‘అయిగిరి నందిని.. నందిత మేదిని’ అంటూ అమ్మవారి స్తోత్రం పాడుతుంది. “నిన్నెలా వేడుకోవాలో నాకు తెలియదు తల్లీ! అందుకే ఇది పాడాను” అంటుంది. ఆ మొక్కు ఫలితమో, మరేమో కానీ మాష్టారికి జ్వరం తగ్గిపోతుంది. ఇంక కషాయంతో పని లేదని తీసుకెళ్లిపోతుండగా ఆయన పిలిచి, దాన్ని తీసుకుని తాగుతాడు. “నువ్వు నమ్మకంగా తెచ్చినదాన్ని నేను తాగకుండా ఎలా ఉంటానని” అంటాడు.
… 1978 నాటి సినిమా ఇది! మతం.. అతి మామూలు విషయంగా చలామణీ అయిన సమయం అది. పరస్పర సహకారాలు, మతాభిమానాలు పూర్తి ఆమోదం పొందిన వేళ అది. ఆ కాలంలో ఇలాంటి సన్నివేశాలు ఉండేవి. ఇప్పుడు ఇలాంటి సన్నివేశాలు పెడితే వందమంది నుంచి వంద రకాల ఆక్షేపణలు రావొచ్చు. రెండు వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తవచ్చు. అబ్బో! భలే చిత్రమైన కాలం కదా ఇది! కానీ అప్పుడూ మతము ఉంది. అది అంతర్వాహినిగా లోలోన నిలిచి ఉండేది తప్ప ఇవాళ ఉన్నంతగా బయల్పడి, అసూయ పడి, గొడవ పడి, విచిత్రోచిత్రమైన సిద్ధాంతాలకు దాసమై ఉండలేదు.
PS: ఈ ‘ఒరు వీడు ఒరు ఉళగం'(ఒక ఇల్లు ఒక ప్రపంచం) సినిమా దర్శకుడు దురై. ఆ తర్వాత ఆయనే ‘పసి’ అనే సినిమా తీశారు. శోభ కెరీర్లో అతి ముఖ్యమైన సినిమా అది. ఆ చిత్రంలో ఆమె చేసిన ‘కుప్పమ్మ’ పాత్రకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం సైతం ప్రకటించారు. అప్పటికి ఆమెకు 17 ఏళ్లు. అవార్డు అందుకునేలోగానే ఆత్మహత్య చేసుకున్నారామె. ఆమె చనిపోయిన నాలుగేళ్లకు ఆమె తల్లి ప్రేమ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అతి పెద్ద విషాదం. తెలుగు సినిమా ‘మనవూరి పాండవులు’ సినిమాలో పిచ్చి పట్టిన సుందరి పాత్రలో శోభ నటన చూడొచ్చు… విశీ
Share this Article