ముఖేష్ అంబానీకి సమస్యలు లేవని మీరు అనుకుంటున్నారా? ముఖేష్ భాయ్ 15వ అంతస్తులోని తన పడక గది నుండి లేచి వచ్చి, 17వ అంతస్తులోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టి, 19వ అంతస్తులోకి వెళ్లి, అల్పాహారం చేసి, 14వ అంతస్తులోని పర్సనల్ ఆఫీసుకు వెళ్లేందుకు దుస్తులు ధరించి, అవసరమైన ఫైల్స్ తీసుకుని, 16వ అంతస్తులోని నీతాకు శుభాకాంక్షలు చెప్పి…
13వ అంతస్తులో ఉన్న తన పిల్లలకు ‘సీ యు’ అని చెప్పి, 3వ అంతస్తులో దిగి, తన 2.5 కోట్ల బిఎమ్‌డబ్ల్యూని తీసుకుని, బయట ఉన్న ఆఫీస్‌కు సెల్ఫ్ డ్రైవింగ్ చేయాలని అనుకున్నాడు, కానీ అతను మేడ మీద కారు తాళపుచెవులు మరచిపోయాడు… అయితే ఏ అంతస్తులో? 15, 17, 19, 14, 21, 16 లేదా 13…? ఎక్కడ..?
అతను తన సేవకులు, వంటవారు, పనిమనిషి, సెక్రటరీలు, పూల్ అటెండర్లు, జిమ్ ట్రైనర్లు, లిఫ్ట్ అటెండెంట్లు మొదలైన వారికి అన్ని అంతస్తులకూ ఫోన్లు చేస్తాడు..,. అన్ని ఫ్లోర్లలో చాలా చురుకుగా శోధించారు… అందరూ ఉరుకులూ పరుగులు… కానీ కారు కీ ఎక్కడా కనిపించడం లేదు, దొరకడం లేదు…
Ads
విసుగు చెంది, అరగంట వెతుకులాట తర్వాత, ముఖేష్ భాయ్ ఇక కీ అన్వేషణ వదిలేసి, తన డ్రైవర్ నడుపుతున్న ఐకాన్ కారులో బయలుదేరాడు. ఇది జరిగిన నాలుగు రోజుల తరువాత… తాత్కాలికంగా ఈమధ్యే పనిలోకి తీసుకోబడిన ఓ పనిమనిషి ముఖేష్ భాయ్ ప్యాంటు ఉతికి, దాన్ని 16వ అంతస్తు బాల్కనీలోని ఒక దండెం మీద ఆరబెట్టింది… అదుగో ఆ ప్యాంటు జేబులోనే ముఖేష్ మరిచిపోయిన తాళపు చెవులు ఉన్నాయి… అక్కడ వీచిన బలమైన గాలులకు ఆ ప్యాంటు ఎక్కడో పడింది… ఇస్త్రీ చేయడానికి ఇచ్చిన దుస్తులను వ్యక్తిగతంగా తనిఖీ చేసే నీతా అలవాటు కారణంగా ఎట్టకేలకు ఆ తాళపుచెవులు కనిపెట్టబడ్డాయి… వాటిని ఓ పక్కన పెట్టింది జాగ్రత్తగా…
ఇది జరిగాక 3 రోజులకు… నీతా మొహంలో చిరాకు వ్యక్తం చేస్తూ ముఖేష్‌ను అడిగింది… ‘‘తెల్లవారుజాము 3 గంటల దాకా ఎక్కడ తిరుగుతున్నారు..?’’
‘‘నేనెక్కడికి పోయాను, ఇంట్లోనే ఉన్నాను రాత్రంతా…’’
‘‘మరి తెల్లవారుజామున 3 గంటలకు టెర్రస్‌లో హెలికాప్టర్‌లో దిగింది ఎవరు..? మీరు కాదా..? ఆ టైమ్‌కు ఆ సౌండ్‌తో నిద్ర చెదిరింది, ఇక మళ్లీ నిద్రపట్టలేదు..’’
‘‘ఓహ్ అదా… ఆ హెలికాప్టర్ జర్మనీ నుంచి వచ్చింది… మన BMW కారు తాళపు చెవులు ఎక్కడో పోయాయి కదా… డూప్లికేట్ తాళపు చెవులు కావాలన్నాను… వాటిని ఇవ్వడానికి జర్మనీ నుంచి BMW నుంచి ఆ కంపెనీ స్టాఫ్ వచ్చారు..’’ గొణుగుతూ చెప్పాడు ముఖేష్…
ఇంతకీ ఈ కథలోని నీతి ఏమిటి..? సింపుల్… కుబేరులకూ కష్టాలుంటయ్… వాళ్ల జీవితాలు పూలపాన్పులు అని మనం అనుకోకూడదు… పీతకష్టాలు పీతవి… అంతే…
ఈ పోస్టు మళ్లీ సోషల్ మీడియాలోనే కనిపించింది… చదివాను, కానీ అది గూగుల్ అనువాదంలాగా అనిపించింది, పైగా గతంలో కూడా ఎక్కడో చదివినట్టు గుర్తుంది,.. అనంత్ అంబానీ పెళ్లి పూర్వ వేడుకల వేళ మరొక్కసారి చదువుకుందాం… కొన్ని సవరణలతో…)
Share this Article