Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కళ్లు చెమ్మగిల్లజేసే కథ… ప్రధాన కథానాయికగా చెలరేగిపోయిన శారద…

March 6, 2024 by M S R

Subramanyam Dogiparthi….  ఎంతటి పాషాణ హృదయుడయినా , కర్కశుడయినా సినిమా చూసేటప్పుడు కళ్ళు చెమ్మగిల్లాల్సిందే . శారదని ఊర్వశి శారదను చేసిన సినిమా . శారద నట విశ్వరూపం 1969 లో గాంధీ శత జయంతి రోజున విడుదలయిన ఈ సినిమాలో . ప్రపంచ సినీ రంగ చరిత్రలో ఒకే కధ ఆధారంగా తీయబడిన నాలుగు భాషల సినిమాలలో నటించిన ఏకైక నటి శారద . మొదట మళయాళం , తర్వాత తెలుగు తమిళం హిందీ భాషలు . వాణిశ్రీ ప్రేమ నగర్ మూడు భాషల్లోనే నటించింది .

కోటీశ్వరుడి కూతురుగా , మానవత్వం కల తండ్రి కార్మికుల కోసం భాగస్తుడితో గొడవపడి మోసగించబడి, సంపదనంతా పోగొట్టుకున్న తండ్రి కూతురుగా , ప్రేమించిన వాడు మోసగిస్తే , మరో నిజాయితీపరుడయిన కార్మిక నాయుడిని పెళ్లి చేసుకుని , కామందుల కుట్రలో భర్త హత్యకు గురయ్యాక , పేదరికంతో పిల్లలు దొంగతనానికి పాల్పడుతుంటే , సామూహిక మరణాలకు ప్రయత్నించి , పిల్లలను హత్య చేసిందనే నేరారోపణతో కోర్ట్ బోనెక్కి , స్నేహితురాలి చేతిలో మరణించే పాత్రలో శారద అద్భుతంగా నటించింది . మరే ఇతర నటి ఇంత గొప్పగా నటించగలదా అని అనిపిస్తుంది .

మూల కధను వ్రాసిన మళయాళ రచయిత తొప్పిలి భాసిని , ఆ కధను తెలుగు వారి అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన బొల్లిముంత శివరామకృష్ణను , బిర్రయిన స్క్రీన్ ప్లే – దర్శకత్వం వహించిన వి మధుసూధనరావుని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి . డ్యూయెట్లు లేవు , కామెడీ సీన్లు లేవు , ఫైట్లు లేవు . అయినా సంచలనాన్న సృష్టించిందీ రజతోత్సవ చిత్రం .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ వీర హిట్ . తూరుపు సింధూరపు మందారపు వెన్నెలలో ఉదయరాగం , పాపాయి నవ్వాలి పండగే రావాలి , హాలిడే జాలిడే పాటలు శ్రావ్యంగా ఉంటాయి . మహాకవి శ్రీశ్రీ అరుణ పతాకం ఎగిరింది కార్మిక లోకం గెలిచింది , మారాలి మారాలి మనుషులు మారాలి ఎర్ర పాటలు బాగుంటాయి . భూమాత ఈనాడు పాటలో శారద , కాంచనల శాస్త్రీయ నృత్యం కన్నుల విందుగా ఉంటుంది . చీకటిలో కారు చీకటిలో , అమ్మా కన్ను మూసావా అనే రెండు విషాద గీతాలు గుండెల్ని పిండేస్తాయి .

Ads

శారద , కాంచన , శోభన్ బాబు , హరనాథ్ , గుమ్మడి , నాగభూషణం , మంజుల , కె వి చలం , రావి కొండలరావు ప్రభృతులు నటించారు . ప్రఖ్యాత కేరెక్టర్ ఆర్టిస్ట్ రావు గోపాలరావుకి పేరుకి ఇది మూడో సినిమా అయినా , ఈ సినిమాలోని యూనియన్ లాయర్ పాత్ర గుర్తింపుని తెచ్చింది . కె రాఘవేంద్రరావు , కోదండరామిరెడ్డి ఇద్దరూ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్లుగా పనిచేసారు .

ఉ సినిమాలో నిర్మలమ్మ పాత్ర , డైలాగులు పేలిపోయాయి . ఊరంత అయ్య లోకువ , అయ్యకు అమ్మ లోకువ డైలాగ్ , ఊరకూరకనే అలిగి కూతురు ఇంటికి కొడుకు ఇంటికి ప్రదక్షిణలు చేసే పాత్ర మన ఇళ్ళల్లో కనిపించే ముసలమ్మలు గుర్తుకొస్తారు .

ఈ సినిమాలో హిట్ జోడీ శారద , శోభన్ బాబులు ఎన్నో సినిమాలలో జైత్రయాత్ర కొనసాగించారు . మధ్య వయసులో ఏవండీ ఆవిడొచ్చిందితో సహా . 1969 లో వచ్చిన ఈ ఎర్ర సినిమా తరహా ఎర్ర సినిమాలను కొన్నాళ్ళు మాదాల రంగారావు , వెంకటేశ్వరరావు , టి కృష్ణ లాగించారు . ప్రేక్షకులు మారారు . మధ్య తరగతి మిధ్యా లోకంలో తేలిపోయే కాలమొచ్చింది తర్వాత తర్వాత .

మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో ఆడింది . సినిమా హాల్లో ఏడుస్తూనే రెండు మూడు సార్లు చూసి ఉంటా . ఏడుపు వస్తే వచ్చింది కానీ , చూసి ఉండకపోతే మాత్రం తప్పక చూడండి .యూట్యూబులో ఉంది . మీలో ఉన్న మనిషిని , మనసును తట్టిలేపుద్ది . గొప్ప సంచలన , చరిత్ర సృష్టించిన చిత్రం . By the way , ఈ సినిమాలో కనిపించే ఫేక్టరీ తణుకు ఆంధ్రా షుగర్స్ ఫేక్టరీ . #తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘గతేడాది బతికే ఉన్నానేమో గుర్తులేదు.., ఇప్పుడయితే బతికే ఉన్నా.,.‘‘
  • బీసీ రిజర్వేషన్లు… క్రెడిట్ రేవంత్‌రెడ్డిది… ఎవరెవరో హైజాక్ ప్రయత్నాలు…
  • కీచక ప్రజ్వల్ కేసు..! న్యాయవ్యవస్థపై ఆశల్ని బతికించే తీర్పు..!!
  • వినుడు వినుడు విజయవాడ వెతలూ… వినుడీ జనులారా..!!
  • ఎవరు నిజమైన జర్నలిస్టు అనే ప్రశ్న సరే… అసలు జర్నలిస్టు అంటే ఎవరు..?
  • ఆహ్లాదానికీ అసభ్యతకూ నడుమ గీత చెరిపేశాడు రాఘవేంద్రుడు..!!
  • జాతీయ అవార్డు పొందిన ఆ కాసర్ల శ్యామ్ పాట ఎందుకు నచ్చిందంటే..?
  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!
  • వంగా సందీప్‌రెడ్డి మార్క్ రోల్… నో, నెవ్వర్, సాయిపల్లవికి అస్సలు నప్పదు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions