indian Railways: రైల్వే ప్రయాణికులకు సూపర్ టేస్టీ న్యూస్.. ఇకపై జర్నీలో స్విగ్గీ ఫుడ్.. రైలు ప్రయాణం హ్యాపీగా ఉన్నా ఆహారంలో విషయంలోనే కాస్త ఇబ్బంది ఉంటుంది. నచ్చిన ఆహారం తినే అవకాశం ఉండదు. రైళ్లలో ఏ ఫుడ్ అమ్మితే అదే తినాల్సి ఉంటుంది.
అలా కాకుండా మీ రైలు ప్రయాణించే ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌కు చెందిన ఫుడ్‌ని తినే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! అయితే ఇప్పుడు దీనిని అధికారులు నిజం చేస్తున్నారు.
ఇకపై రైలు ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని, నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎలాగైతే ఫుడ్ డెలివరీ యాప్‌లో బుక్ చేసుకుంటామో అలాగే రైలు జర్నీ సమయంలోనూ ఫుడ్ బుక్ చేసుకోవచ్చు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ, స్విగ్గీ మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం జరిగిన ఒప్పందం ప్రకారం.. మార్చి 12వ తేదీ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Ads
తొలుత ఈ సేవలను విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్, బెంగళూరు స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీలో కాకుండా ఐఆర్‌సీటీసీ యాప్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో ఎన్‌ఆర్ నెంబర్‌ను ఎంటర్ చేసి కావాల్సిన ఆహారాన్ని కావాల్సిన స్టేషన్‌లో పొందొచ్చు. దీంతో ప్రయాణికులు మరింత మధురానుభూతి పొందుతారని ఐఆర్‌సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు.
ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ పేర్కొన్నారు. దీనివల్ల రైల్వే స్టేషన్లకు సేవలు విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. రానున్న కొన్ని వారాల్లో మరో 59 స్టేషన్లలో ఈ సేవలను స్విగ్గీ ప్రారంభించనుంది…
……. ఇదీ వాట్సప్ వార్తా గ్రూపుల్లో కనిపించిన వార్త… బాగుంది… రైల్వే ప్లాట్‌ఫారాల మీద, రైళ్లలో అమ్మే ఫుడ్ పైన ఉన్నన్ని విమర్శలు అన్నీ ఇన్నీ కావు… ఫుడ్ హైజీన్ కాదు, ఏమాత్రం రుచిగా ఉండదు, ధరలు విపరీతం, పడకపోతే వాంతులు, అజీర్ణం, కడుపునొప్పి ఎట్సెట్రా అదనం… ఆమధ్య అపరిచితుడు సినిమాలో ఓ బీభత్సమైన సీన్ కూడా చూశాం కదా… ఈ నేపథ్యంలో ఈ రైల్వే-స్విగ్గీ ఒప్పందం టేస్టీ వార్తే… ప్రధాన స్టేషన్లన్నింటికీ ఇది త్వరగా వ్యాపిస్తే ప్రయాణికుల కడుపు నింపినవారవుతారు… శుభం… బ్రేవ్…
Share this Article