ఆయన రిటైరయ్యాడు, భార్య లేదు, విధురుడు… ఆమె కూడా రిటైరైంది, భర్త పోయి చాలారోజులైంది, విధవ… ఇద్దరూ ఒంటరే… స్కూల్ రోజుల నుంచీ ఒకరికొకరు తెలిసినవాళ్లే… చాలా సందర్భాల్లో కలుసుకుంటూనే ఉంటారు… వృద్ధాప్యం కదా.., మతిమరుపు, తగ్గిన కంటిచూపు, ఛాందసం గట్రా కనిపిస్తున్నయ్… ఒంటరి బతుకుకన్నా ఓ జంటను వెతుక్కోవాలనే ఆలోచనల్లోనే ఉన్నారు ఇద్దరూ…
.
స్కూల్ రీయూనియన్ ఫంక్షన్… ఇద్దరూ హాజరయ్యారు దానికి… పార్టీ మాంచి జోష్ మీద సాగుతోంది… మందూ, మటనూ, డాన్సులు, కబుర్లు, హుషారు… ఆయన ధైర్యం చేసి ఆమెను అడిగేశాడు ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ ఆమె చెప్పింది వెంటనే… ‘తప్పకుండా పెళ్లి చేసుకుందాం’…
.
పార్టీ ముగిసింది… ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు… పొద్దున లేవగానే మన హీరోకు ఓ సందిగ్ధం… పెళ్లి ప్రపోజల్ పెట్టినవరకూ గుర్తుంది తనకు… కానీ ఎస్ అని చెప్పిందా..? నో అని కొట్టిపారేసిందా..? నెత్తి మీద మిగిలిన నాలుగు పోచల్ని ఎంత పీక్కున్నా గుర్తుకురావడం లేదు…
.
సరే, ఏమయితే అదయింది… ఆమెనే అడిగేద్దాం అని గత రాత్రి ధైర్యాన్నే మళ్లీ తెచ్చుకుని ఆమెకు ఫోన్ చేశాడు… ఏమీ అనుకోకు, నేను నిన్ను రాత్రి ఇలా అడిగాను, నువ్వేమని బదులిచ్చావో చస్తే గుర్తుకురావడం లేదు… ఇంతకీ నువ్వేమన్నావ్..? చెప్పవా ప్లీజ్..? అనడిగేశాడు… అవతలి వైపు నుంచి తేలికగా ఊపిరి పీల్చుకున్న శబ్దం… తరువాత ఆమె రిప్లయ్ ఇచ్చింది…
.
‘అవును, పెళ్లి చేసుకుందాం అనే అన్నాను… నా గుండె లోతుల్లో నుంచి వచ్చిందా మాట..’ ఆయన పరవశించిపోయాడు… గుండె లయ తప్పింది… ఫోన్ పెట్టేస్తూ ఆమె ఏమన్నదంటే..?
.
‘‘నువ్వు కాల్ చేసి అడగడమే మంచిదైంది డియర్… అసలు గత రాత్రి నాకు ఎవరు ప్రపోజ్ చేశారో గుర్తుకురాక తన్నుకుంటున్నాను ఇప్పటిదాకా…!!”
.
(ఒక వాట్సప్ పోస్టుకు తెలిసీతెలియని నా తెలుగు అనువాదం)
Share this Article