నిన్న ప్రధానమంత్రి తెలంగాణా రాష్ట్రానికి వచ్చి అనేక అభివృద్ధి పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు వర్చ్యువల్ గా, ఆదిలాబాద్ వేదికగా, నిర్వహించారు. అధికార కార్యక్రమం కాబట్టి, తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రిని ఆహ్వానించి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆ సభలో, Cooperative Fedaralism స్ఫూర్తితో ప్రధానమంత్రిని ఉద్దేశించి, ‘మీరు రాష్ట్రాలకు పెద్దన్న వంటి వారు’ అని అంటూ మూడు భాషల్లో మాట్లాడి ప్రజలను, నాయకులను, మోడీని ఇంప్రెస్ చేయడమే కాక పాలిటిక్స్ కేవలం ఎన్నికలప్పుడే చేయాలనీ, తర్వాత అందరూ కలిసి దేశ అభివృద్ధికి పాటుపడాలనీ; మోడీ కలలు కంటున్న 5 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణా రాష్ట్ర సహకారం కూడా ఉంటుందనీ; అందుకు గాను తమకూ సహకారం అందించాలని కోరడమూ; తమకు ఎలాంటి ‘ఈగోలు’ లేవని చెప్పడమూ రేవంత్ రెడ్డి గారి నిజాయితీని, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఉన్న నిబద్దతను తెలియచేస్తాయి. Even, స్టాలిన్ కూడా నిన్న మోడీ పాల్గొన్న అభివృద్ధి సభలో పాల్గొన్నాడు. మమతా బెనర్జీ కూడా ప్రధానమంత్రిని కలిసింది.
ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కలవడం బీయారెస్స్ నాయకులకు నచ్చలేదు. ఎందుకంటే, అంతర్గతంగా ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయో మనకు తెలియదు గానీ, బయటకు మాత్రం బీయారెస్స్, బీజేపీ పరస్పరం విమర్శించుకుంటున్నారు. గత నాలుగైదు ఏళ్ళలో, ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి కేసీయార్, ఏదో ఒక వంకతో, తప్పించుకుని, అధికార లాంఛన ప్రక్రియను పాటించ లేదు.
అటువంటి వాతావరణంలో, నిన్న ప్రధానమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకోవడం, సహజంగానే, బీయారెస్స్ కు నచ్చలేదు.
కానీ, రాజకీయాల్లో, కనీసం కొన్ని ప్రమాణాలు పాటించాలి. ప్రభుత్వం చేసే ప్రతీ పనిని, ప్రతీ చర్యను, నీచంగా విమర్శించే సంస్కృతి మానుకోవాలి. రాజకీయాలలో అపర చాణుక్యుడైన కేసీయార్, అత్యంత పరిణతి ప్రదర్శించి, స్వచ్ఛమైన భాషను వాడి ఉంటే, ప్రజల సానుభూతి, సమకాలీన రాజకీయ చరిత్రలో, కొంత మంచి స్థానం దక్కుతుందని గ్రహించాలి. కానీ, అలా కనిపించడం లేదు.
‘పెద్దన్న’ అని పిలవడంలో తప్పేమీ లేదు. తెలంగాణా సమాజంలో, ఒక పెద్ద మనిషిని, అలా పిలవడం చాలా సహజం.
ఎందుకంటే, కేటీయార్ అసెంబ్లీలోనే ‘భట్టన్నా!; శ్రీధరన్నా! ఉత్తమన్నా!’ అని సంబోధించారు. కాబట్టి, ఇటువంటి రొడ్డకొట్టుడు, చీప్ పాలిటిక్సును ప్రజలు చీదరించుకుంటున్నారు.
బీయారెస్స్ నేతలకున్న మిథ్యా అహంభావం వల్ల, కేంద్రం నుండి రావలసిన నిధుల విషయంలో, రాష్ట్రం ఎంత నష్ట పోయిందో అంచనా వేసుకోండి.
బీయారెస్స్ ముందు బీజేపీతో స్నేహంగా ఉంది. తరువాత బద్ధ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తుంది. కానీ, మొదటి నుండీ బిజెపిని తమ శత్రువుగా పరిగణిస్తున్న డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, ప్రధానమంత్రిని మీరు అవమానించినంతగా, అవమానించ లేదు. సభ్య సమాజం ఒప్పుకోని బూతులతో మీరు మోడీ గారిని తిట్టారు.
కాబట్టే, సహజంగానే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండవలసిన కార్డియల్ సంబంధాలు దెబ్బతిని, మనకు హక్కుగా రావలసిన అనేక ప్రయోజనాలు ఆగిపోయాయి. ఈ విషయంలో, బీజేపీ కూడా హుందాగా ప్రవర్తించడం లేదు. రాజకీయ పార్టీల మధ్య శతృత్వాన్ని, రాష్ట్ర అభివృద్ధిని కుంటు పడే విధంగా, నిధులను విడుదల చేయకుండా, వాడుకుంది.
కానీ, రేవంత్ రెడ్డి గారు పదే పదే మాకు ‘ఈగో’ లేదనీ, కేంద్రంతో సహకార ఫెడరలిజం స్ఫూర్తితో సంబంధాలు ఏర్పరుచుకుని, వ్యవహరిస్తామని చెప్పారు. ఆ ప్రవర్తన వల్ల మనకు తక్షణ ప్రయోజనం రూపంలో, రక్షణ శాఖ నుండి 160 ఎకరాలు, హైదరాబాదు నగరం చుట్టూ విస్తరించిన కంటోన్మెంటు వ్యవస్థ వలన కలుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు మోక్షం కలిగించే విధంగా, Elevated Expressway ల నిర్మాణానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది.
సామాన్య ప్రజానీకంలో ఒకడిగా నాకు ఈ ప్రయోజనాలే ముఖ్యం. మీ అహంభావాలకు నా రాష్ట్ర ప్రయోజనాలను త్యాగం చేసేంత గొప్ప పనులు మీరేం చేయలేదు, ఈ పదేళ్ళలో.
కాబట్టి, మీకు సమాజంలో ప్రస్తుతమున్న నిజ విలువను తెలుసుకోండి. అహంభావాన్ని వీడి, అవినీతి జరిగింది అని తప్పు ఒప్పుకుంటేనే ప్రజలు మిమ్మల్ని క్షమించేది. రాజకీయాల్లో, గెలుపోటములు సహజమే. ఓడినప్పుడు, మన రాజకీయ సంస్థలోని లోపాలను విశ్లేషించుకుని, వాటిని పరిష్కరించుకోవాలి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే కార్యక్రమాలు చేపట్టి, తదుపరి ఎన్నికలకు సిద్ధపడితే, విజయం మీదే కావచ్చు. కానీ, వంద రోజులు కూడా అధికారంలో లేనీ, ప్రభుత్వాన్ని, నిర్హేతుకంగా విమర్శించడం సబబు కాదు.
లేకపోతే, iconoclausts గా విధ్వంసకారులుగా, చరిత్రలో మిగిలిపోతారు. మన పొరుగున ఉన్న ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారిని చూసి హుందాతనమూ, humility అంటే ఏమిటో తెలుసుకోండి… By… Dr. Prabhakar Jaini…
Share this Article