అయోధ్య గుడి… బాలరాముడి దర్శనం కోసం భక్తకెరటాలు పోటెత్తుతున్నయ్… యావత్ దేశం నుంచీ ప్రత్యేక రైళ్లే గాకుండా సొంత వాహనాలు, ఇతరత్రా రవాణా మార్గాల్లో జనం వెల్లువెత్తుతున్నారు… ప్రాణప్రతిష్ఠ తరువాత 30-35 రోజుల వ్యవధిలో 65 లక్షల మంది దర్శించుకున్నట్టు అంచనా… అంటే రోజుకు దాదాపు రెండు లక్షలు…
అయోధ్య విశ్వసందర్శన క్షేత్రంగా మార్చాలనే ప్రయత్నాలు, ప్రణాళికల నేపథ్యంలో ఈ భక్తుల తాకిడి ఇప్పట్లో ఆగదు… కానీ రోజూ సముద్రాన్ని తలపిస్తున్న ఈ రద్దీని స్ట్రీమ్ లైన్ చేయడం ఎలా..? భక్తుల రాకపోకలు, దర్శనాలకు ఎలాంటి అవాంతరాలు, అవస్థలూ లేని ఓ సిస్టమ్ ఎలా..? ఇదీ అయోధ్య ట్రస్టు ఎదుట ఉన్న ప్రశ్న…
నిజానికి మన దక్షిణాది దేవాలయాలతో పోలిస్తే ఉత్తరాదిలో రోజువారీ భక్తుల టర్నవుట్ తక్కువ… దాంతో పెద్దగా ఇబ్బందులు పరిగణనలోకి రావు… అంతటి వైష్ణోదేవి ఆలయానికి ఎప్పుడైనా 30 వేల వరకూ భక్తులు వస్తే దిగువన క్లోజ్ చేసేస్తారు… ఉజ్జయిని, పూరి, వారణాసి వంటివి తప్ప మిగతా ఆలయాల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్ తక్కువ…
Ads
అయోధ్యలో కూడా విశేష దర్శనాలు, వీఐపీ దర్శనాలు, ఆర్జితసేవలు గట్రా లేవు… దర్శనాలకు బ్రేకుల్లేవు… ఇదొక్కటీ మన సౌత్ గుళ్లతో పోలిస్తే నయం అనిపిస్తుంది కానీ ఓ సిస్టం లేకుండా క్రౌడ్ మేనేజ్‌మెంట్ ఇలాగే ఎన్నాళ్లు మెయింటెయిన్ చేయగలమనే ప్రశ్నకు అయోధ్య ట్రస్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం కనిపించింది…
తిరుమల ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు రోజూ 60-70 వేల మందికి దర్శనాలను ఓ క్రమపద్ధతిలో ఇప్పించగలుగుతోంది… బ్రహ్మోత్సవాలు, వైకుంఠఏకాదశి, రథసప్తమి వంటి సందర్భాల్లో ఇంకా ఎక్కువ జనం వచ్చినా సరే… జాప్యం తప్ప వేరే అవస్థలు ఉండవు… కంపార్టమెంట్లు, రెండు నెలల ముందు నుంచే ఆర్జిత దర్శనాల టికెట్లు, ధర్మదర్శనాలకు కంకణాలు, సరిపడా వసతులు ఉంటాయి… టికెట్లు, కంకణాల టైములను బట్టి కొండపైకి వస్తుంటారు… కంపార్ట్‌మెంట్లలో టాయిలెట్స్, పాలు, ఏదైనా అల్పాహారం ఇస్తారు, వృద్ధులకు ప్రత్యేక దర్శన వసతులు, కొండపై ఉండటానికి అతిథి గృహాలు…
ఎప్పుడో చోళులు, విజయనగర రాజుల దగ్గర నుంచీ ఇప్పటిదాకా తిరుమలలో భక్తులు ఓ సిస్టం ప్రకారం నడుచుకునే ఏర్పాట్లున్నయ్… డెవలప్ అవుతూ వచ్చాయి… ఉచిత అన్నప్రసాదం, కల్యాణకట్ట ఉన్నాయి… ఈ స్థితిలో అయోధ్య ట్రస్టు విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికార బృందం ఒకటి అయోధ్యను దర్శించింది… అక్కడ దర్శనాలకు ఓ పద్ధతిని ఎక్కడెక్కడ ఎలా అమలు చేయాలో పరిశీలించింది… ఓ బ్లూప్రింట్‌ను అయోధ్య ట్రస్టుకు అందించింది…
ఈ పరిణామాలపై హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అప్పరసు శ్రీనివాసరావు రాసిన స్టోరీ ఒకటి సవివరంగా ఉంది… రీసెంటుగా అయోధ్య వెళ్లొచ్చిన భక్తుల అభిప్రాయాలు, టీటీడీ ముఖ్యాధికారుల వివరణలతో అయోధ్యలో క్రౌడ్ మేనేజ్‌మెంట్ అవసరాన్ని వివరించింది… అయోధ్య ఇంకా నిర్మాణంలో ఉంది… బాలరాముడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఏ ఇబ్బందులూ తలెత్తని సరైన ఏర్పాట్లు కావాలి… అవి ఇప్పుడే జరగాలి…
తిరుమల ఐసోలేటెడ్… కానీ అయోధ్య సిటీ దగ్గరలోనే ఉండి, మామూలు జనం రాకపోకలు కూడా ఉంటాయి… తిరుమలకు వచ్చేవాళ్లకు అక్కడి పద్ధతులు తెలుసు… రిపీట్ భక్తులు… కానీ అయోధ్యకు వచ్చేవాళ్లు కొత్త భక్తులు… అయోధ్య బాలరాముడికి నిధుల సమస్య లేదు… అవసరమైతే విరాళాలు ఇంకా వస్తాయి… ఎటొచ్చీ, భక్తులకు మంచినీరు, టాయిలెట్స్, అల్పాహారం, క్యూ లైన్లు, రద్దీ నియంత్రణ వంటి ఏర్పాట్లు ట్రస్టు తరఫునే పకడ్బందీగా సాగితే మేలు… అదుగో ఆ కోణంలోనే టీటీడీ అయోధ్యకు సహకరిస్తోంది… బాలరాముడికన్నా ఈ విషయంలో ఎంతైనా తిరుమల వెంకన్న చాలా సీనియర్ కదా..!!
ఎప్పుడో ఏడాదికి నాలుగైదు రోజులు సాగే జాతర కాదు కదా అయోధ్య… నిరంతర భక్తప్రవాహం… అందుకే ఓ పకడ్బందీ నియంత్రణ పద్ధతి అవసరం… విశ్వ ఆధ్యాత్మిక క్షేత్రంలా భాసిల్లాలంటే ఆ ఏర్పాట్లు ఇప్పుడే మొదలవ్వాలి..!
Share this Article