ఏపీలో చంద్రబాబు తెలుగుదేశంతో బీజేపీ పొత్తు ఉండబోతున్నదనే వార్తలు వస్తున్నాయి… ఒడిశాలో నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్‌తో బీజేపీ పొత్తు ఖరారైపోయింది… బిహార్‌లో జేడీయూ నితిశ్ మళ్లీ బీజేపీ పంచన ఆల్రెడీ చేరిపోయాడు… కర్నాటకలో దేవెగౌడ జేడీఎస్ కూడా బీజేపీతో చేతులు కలిపింది…
కేరళలో మాజీ ముఖ్యమంత్రుల కొడుకులేకాదు, జాతీయ స్థాయిలో ఇంకా బీజేపీలో చాలామంది చేరుతున్నారు… సొంతంగా 370 సీట్ల సాధన, ఎన్డీయే కూటమిగా 400 సీట్లు అనే టార్గెట్ దిశలో బీజేపీ అన్ని శక్తులూ ఒడ్డుతోంది… మళ్లీ అధికారంలోకి వస్తారు, కానీ ఆ సంఖ్యలో సీట్లు వస్తాయా లేదానేది ఫలితాలు చెబుతాయి… అయితే..?
బీజేపీ కోణంలోనే ఆలోచిస్తే… బిహార్, ఏపీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పరిణామాల్ని పరిశీలిస్తే… బీజేపీ అడుగులు సరైనవేనా..? అవి ఆయా రాష్ట్రాల్లో సొంతంగా పాతుకుపోయేందుకు ఉపయోగపడతాయా..? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనేది నిజమే గానీ, ఏమాత్రం విశ్వసనీయత లేని పాత మిత్రుల్ని మళ్లీ పిలిచి హత్తుకోవడం కరెక్టేనా..?
Ads
ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఆరోగ్యం ఏమంత బాగాలేదు, తనకు వారసులు లేరు, ఎవరో మాజీ బ్యూరోక్రాట్ ఆ స్థానం భర్తి చేస్తాడని అంటున్నారు… మరోవైపు బీజేపీ చాపకింద నీరులా బాగా ఆర్గనైజ్ చేసుకుంటోంది… ఈసారి లోకసభ ఎన్నికల్లో బీజేడీకన్నా బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని పలు సర్వేలు చెబుతున్నాయి… మరి నవీన్‌తో దోస్తీ దేనికి..? బీజేపీ ఎదుగుదలకు తామే సెల్ఫ్ బ్రేక్ వేసుకున్నట్టు కాదా..? నవీన్ పాత మిత్రుడే… మళ్లీ ఇప్పుడు తాజాగా అప్తుడయ్యాడు… నవీన్ వ్యూహంలో బీజేపీ పడిపోయింది…
బిహార్‌లో నితిశ్ మీద పెద్దగా వ్యక్తిగత ఆరోపణలు లేవు… కానీ అత్యంత చంచలుడు… ఏమాత్రం క్రెడిబులిటీ లేదు రాజకీయ వ్యవహారాల్లో… హఠాత్తుగా బీజేపీని వదిలేస్తాడు, లాలూ చంకలో చేరతాడు… మళ్లీ బీజేపీని హత్తుకుంటాడు… బీజేపీ కూడా సొంతంగా బిహార్‌ను కైవసం చేసుకునే ప్లాన్లన్నీ ఆటక మీదకు విసిరేసి నితిశ్ నాయకత్వానికీ జై అని నినదిస్తుంది…
సేమ్, కర్నాటకలో దేవెగౌడ… నితిశ్‌కన్నా చంచలం… ఎప్పుడు ఎవరితో చేతులు కలుపుతారో ఎవరికీ అంతుపట్టదు… ఈ పార్టీ కూడా గతంలో బీజేపీ మిత్రపక్షమే… క్రెడిబులిటీ లేని ఆ పార్టీని మళ్లీ అలుముకుంది బీజేపీ ఇప్పుడు… నిజంగా కర్నాటకలో జేడీఎస్ పొత్తు అవసరమా బీజేపీకి..? కొన్ని ప్రాంతాల్లో బీజేపీ సొంత ఎదుగుదలకు ఇది అవరోధం కాదా..?
ఏపీలో చంద్రబాబు… తనూ బీజేపీకి పాత మిత్రుడే… కాకపోతే కాంగ్రెస్ వెలిగిపోబోతుందనే భ్రమల్లో కూరుకుపోయి, మోడీని నానారకాలుగా కించపరిచాడు… తనంత స్థాయిలో బహుశా ఏ రాజకీయ నాయకుడూ మోడీ మీద నోరు పారేసుకోలేదేమో… ఐతేనేం, మళ్లీ ఇప్పుడు బీజేపీ కావాలట… మరి ఆ క్రెడిబులిటీ ఏమాత్రం లేని నాయకుడితో బీజేపీకి ఎందుకు పొత్తు..? ఒకటీరెండు సీట్ల కోసం కక్కుర్తి దేనికి..? ఇన్నేళ్లూ ఒక తెలుగుదేశం సయామీ బ్రదర్ వంటి ఓ నాయకుడి వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ తెలుగుదేశానికి తోకపార్టీలా మారిపోయింది… ఇక ఈ సిట్యుయేషన్ మారదా..?
తెలంగాణలో కేసీయార్ కూడా చంద్రబాబు స్థాయిలో మోడీ మీద దాడి చేశాడు… బీజేపీ జాతీయ నేతల్ని బజారుకు లాగాలని వ్యూహాలు పన్నాడు, ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాలు ఆడాడు… ఐనాసరే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీయార్ పట్ల చూసీచూడనట్టు, తనతో లోపాయికారీ ఒప్పందం ఏదో ఉన్నట్టు వ్యవహరించింది బీజేపీ… ఇప్పుడు కారు నొగలు విరిగేసరికి మళ్లీ మోడీతో పొత్తు అనే ఆలోచన మొలిచింది కేసీయార్‌లో, ఏవో ప్రయత్నాలు చేశాడు, కానీ బిహార్, ఏపీ, కర్నాటక, ఒడిశాల్లోలాగా గాకుండా తెలంగాణలో ‘అధికారిక పొత్తు’కు బీజేపీ అంగీకరించలేదు… లోలోపల ఏమేం అవగాహనలు ఉన్నాయో తెలియదు…
నిజమే… రాజకీయాల్లో వ్యూహాలు, ఫలితాలు ముఖ్యం గానీ… వ్యక్తిగత అహాల జోలికి పోరాదనేది నిజమే కావచ్చుగాక… కానీ పాత మిత్రులు కొత్తగా ప్రేమలు చూపిస్తున్నారంటే, స్నేహాల పట్ల నిబద్ధతలు ఏమాత్రం కనబరచని కేరక్టర్లు మళ్లీ వచ్చి అతుక్కుపోతుంటే… ఈ పరిణామాలు బీజేపీ సొంత ఎదుగుదలకు బ్రేకులు వేస్తుంటే… ఈ ఆలింగనాలు బీజేపీకి అవసరమా..? వీళ్లు ఇలాగే నిలబడతారా..? అది అసలు ప్రశ్న..!!
Share this Article