సరిగ్గా నెల రోజుల క్రితం మలయాళంలో విడుదలైంది ఈ సినిమా… పేరు ప్రేమలు… కొద్ది నెలలుగా మాలీవుడ్ చాలా జోష్ మీద ఉంది తెలుసుగా… ఈ సినిమాకు పెద్ద స్టార్ కేస్టింగ్ లేకపోయినా సరే 85 కోట్లు వసూలు చేసింది… ఓవర్సీస్‌లోనే 35 కోట్లు… మలయాళంలో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 85 కోట్లు అంటే బంపర్ సెన్సేషనల్ హిట్ అన్నట్టు లెక్క..! అన్నట్టు నిర్మాణ వ్యయం ఎంతో తెలుసా..? జస్ట్, 3 కోట్లు..!
సరే, దీన్ని తెలుగులోకి తీసుకొచ్చారు… ఎందుకు..? సహజంగానే హిట్ సినిమాల్ని వేరే భాషల్లోకి డబ్ చేసి, వీలైనంత డబ్బు చేసుకోవడం పరిపాటే కదా… అంతేకాదు, ఈ సినిమా కథకు పూర్తిగా హైదరాబాద్ వేదిక… మన విశ్వనగరమే బ్యాక్ డ్రాప్ గనుక, సహజంగానే మన తెలుగువాళ్లకు కనెక్ట్ అవుతుంది ఎంతో కొంత…
సినిమాను ఫహాద్ ఫాజిల్ నిర్మించాడు… నిజానికి ఈ సినిమా కథ అంత పెద్ద ట్విస్టులు, ఎమోషన్స్ ఎట్సెట్రా బరువుగా ఏమీ ఉండదు… ఓ బీటెక్ అబ్బాయి, సాఫ్ట్‌వేర్ అమ్మాయి… లవ్… యూకే వెళ్లడానికి ప్లాన్ చేస్తాడు ఆ అబ్బాయి… కానీ వీసా రిజెక్టెడ్… ఓ మిత్రుడి ప్రోద్బలంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు, అక్కడ అమ్మాయిని ఓ పెళ్లిలో చూసి లవ్వులో పడిపోతాడు…
Ads
పెద్దగా కథాకాకరకాయ మీద దృష్టి పెట్టకుండా… దర్శకుడు ఎంత సరదాగా కథను నడిపించవచ్చుననే అంశం మీదే దృష్టి పెట్టాడు… ఫన్నీ సీన్స్ రాసుకున్నాడు… ఈతరం టెకీలకు, యువతకు ఇంకేం కావాలి..? కనెక్ట్ కావడానికి చాలు కదా… తెర వంగిపోయే బరువును ఎలాగూ ప్రస్తుత తరం పెద్దగా ఇష్టపడటం లేదు… అందుకే ఈ సినిమా అంత సక్సెస్… ఓ సాదాసీదా కథను కొత్తకొత్తగా, సరదాగా చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి మరో ఉదాహరణ ఇది…
ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, మైండ్ స్పేస్, చార్మినార్, కాజాగూడ లేక్, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి… ఓహ్, హైదరాబాద్‌లో ఇన్ని మంచి లొకేషన్లు ఉన్నాయా అని మనమే ఆశ్చర్యపోయేలా హైదరాబాద్ సిటీని చూపించాడు దర్శకుడు… పనిలోపనిగా కుమారి ఆంటీ, పల్లవి ప్రశాంత్ బాపతు పంచ్ డైలాగ్స్ కూడా సందర్భోచితంగా వాడేసుకున్నారు… దర్శకుడు తెలివైనవాడే… ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాడు… డబ్బింగ్ అనగానే తెలుగు ట్రెండ్‌ను పట్టుకున్నాడు…
అబ్బే, పెద్దగా కథ లేకుండా జస్ట్, ఫన్ కోసం థియేటర్ దాకా వెళ్లి సినిమా ఏం చూస్తాం బ్రదర్, పైగా ఎమోషన్స్ గట్రా ఏమీ లేవంటున్నారు కదా అంటారా..? నో ప్రాబ్లం, ఓటీటీలో కూడా కొద్దిరోజుల్లో చూడొచ్చు… పెద్దగా అంచనాలేమీ పెట్టుకోకుండా సరదాగా చూడటానికి వోకే సినిమా ఇది… సినిమాలో చెప్పుకోవల్సింది ఓ ప్రధాన పాత్రలో నటించిన మమిత… మలయాళ తారలు నిజంగా మనసుపెట్టి నటిస్తారు… భలే చేసింది… మిగతావాళ్లు కూడా వోకే..! (కేరళలో ఈ సినిమా చూసిన ఓ హైదరాబాదీ ఇన్‌పుట్స్ ఆధారంగా…)
Share this Article