సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, రఘుబాబు… ఇంతమంది కమెడియన్లున్నారు… కానీ పాపం, ఏం చేస్తారు..? సరైన సీన్లు రాసి ఉంటే కదా, వాళ్లు ఏమైనా పండించడానికి..? తోడుగా హీరో గోపీచంద్ కూడా అక్కడక్కడా కామెడీలో పాలుపంచుకున్నాడు… తను సీరియస్, ఎమోషన్ సీన్లు బాగా చేస్తాడు తప్ప కామెడీ సరిగ్గా చేయలేకపోయాడు… అతికీఅతకలేదు…
ఫస్టాఫ్‌లో ఒక హీరోయిన్… మరి తెలుగు సినిమా అన్నాక ఎంత భిన్నమైన కథ తీసుకున్నా, ఏ ప్రయోగం చేసినా హీరోయిన్ అంటూ ఏడవాలి కదా… లవ్ ట్రాక్ ఒకటి ఉండాలి కదా… పెట్టారు… అదీ అతకలేదు… ఉడికీఉడకని ప్రేమ… పోనీ, ఇక్కడ వదిలేశాడా దర్శకుడు, సెకండాఫ్‌లో మరో మొహాన్ని తీసుకొచ్చాడు… మళ్లీ ప్రేమ… అదీ అంతే… నో కెమిస్ట్రీ… అదీ ఉడికీఉడకని ప్రేమే…
ఏదో పరుశురామక్షేత్రం అంటాడు… స్థలపురాణం అంటాడు… భిన్నంగా సినిమాను స్టార్ట్ చేశాడు… అరె, ఇదేదో కొత్తగా ఉంది, గోపీచంద్ కొత్తదనం బాటలో పడ్డాడు, గుడ్ అనుకుని సంబరపడతామో లేదో… హీరోయిన్ ప్రవేశించాక సేమ్, రొటీన్ మూస తెలుగు సినిమాల్లోలాగే యాక్షన్, కమర్షియల్ వాసనలు థియేటర్ నిండా ఆవరిస్తాయి… అలాగే కథ నడుస్తూ ఉంటుంది… అదే హీరోయిజం, అదే ఫార్ములా పోకడలు… ఇలా ప్రిక్లైమాక్స్ దాకా నడుస్తూ ఉంటుంది కథ…
Ads
ఏ విలన్… తను చేసే అరాచకాలు… తన వెనుక వేరే శక్తులు… దాన్ని అడ్డుకుని, మిస్టరీలు చేధించే హీరోదాత్త కథానాయకుడు, అనగా హీరో… ఎన్ని సినిమాల్లో చూడలేదు… జనమే ఇవి చూసీ చూసీ విసిగిపోతున్నారు తప్ప… తీసేవాళ్లకు అలుపు లేదు, తీస్తూనే ఉన్నారు, జనంపైకి వదులుతూనే ఉన్నారు… పదేళ్లుగా ఒక్క హిట్ లేని గోపీచంద్ ఇకనైనా ఓ కొత్త కథను చేస్తాడేమో, హిట్ కొడతాడేమో అనుకున్న అభిమానులు కూడా ఉసూరుమంటారు… ఎస్, తెలుగు ప్రేక్షకులకు తనపై పెరిగిన అపనమ్మకాన్ని మళ్లీ మళ్లీ బలపరుచుకున్నాడు తప్ప, ‘నేనింతే, నేనిక మారను’ అని భీష్మించాడే తప్ప… మారడానికి వీసమెత్తు ప్రయత్నం లేదు…
పైగా ప్రెస్ మీట్లలో సోషియో ఫాంటసీ కథ… కొత్తదనం అని ఏవో కబుర్లు… పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు… సినిమా చూస్తేనేమో ఇదీ… నిజానికి కథ ఎత్తుకోవడం ఆసక్తికరంగా ఉంది, గోపీచంద్ రెండు డిఫరెంట్ షేడ్స్, ఇద్దరు హీరోయిన్లు, తోడుగా మంచి టైమింగ్ ఉన్న కమెడియన్లు… కానీ ఈ బలాలన్నీ వాడుకోవడం తెలియక… తుస్… పాటలు బాగా లేక, బీజీఎం ఆకట్టుకోక… కామెడీ పండక, రొమాన్స్ పండక… చివరకు చప్పిడి ఉప్మాలాగా, కాదు, కాదు, పథ్యం తిండిలా మారిపోయింది సినిమా..!!
Share this Article