దీపం.. శివపూజకు రూపం
*******************
శైవం.. లోతు దొరుకుడు చాన కష్టమైన పని.
అది, ప్రకృతి గతమైన.. సత్యం శివం సుందరం !
రకరకాల శివతత్త్వ సంప్రదాయాలను–
నడినెత్తికెత్తి బోనంమీద గండదీపంగా మోసే
తెలంగాణలో పాతపాత పద్ధతులెన్నో ఇంకా పదిలమే.
గుట్టలనూ, మెట్టపుట్టలనూ,వాగులనూ, అడవులనూ,
వ్యవసాయాన్నీ, పశుపక్షి సంపదలనూ, పాడిపంటలనూ,
ఉన్నతంగా గౌరవించి, వృత్తుల పనిముట్లను పూజించిన
సాంస్కృతిక వారసత్వం ఒకటి.. శైవం నిండా నిండివున్నది.
అది తెలంగాణగడ్ఢమీద తరతరాలుగ అమలవుతనేవున్నది.
కాపుదనపు కష్టపోతు.. శివునికి అన్నపూజలు చెల్లిస్తడు.
కేదారేశ్వరుడిని నీతిగాకొలిచి అన్నదానవ్రతం ఆచరిస్తడు.
ధాన్యవ్యాపారం జేసే కోమటి, బరువులు మోతవేసే పెరుక
శివతత్త్వాన్ని మనిషిమనిషికీ చేరవేసే గురులింగ జంగమ
శివుడిసన్నధిలోన సకలసపర్యలకూ అంకితమైన తమ్మల
కమ్మరి, కుమ్మరి, మేదర, సాలె, చాకలి, మంగలి, మాదిగ..
సమస్తవృత్తుల సమష్టికృషికి ఒక గుర్తింపు శైవంలో ఉన్నది.
బసవేశ్వరునికాలంలో ఆ గుర్తింపు పరాకాష్టను అందుకున్నది.
కాయకష్టధారుడైన మనిషి, వృత్తినీ, తన ప్రతి పనిముట్టునూ
పూజించే సమున్నత భావజాలం శైవసాహిత్యంలో నమోదైంది.
కోమటి కుంచంకుండనే దైవంగా భావించి దానిపై దీపం వెలిగిస్తే
చేపలవేటలోనున్న బెస్తబోయ గంగ ఇసుకకు లింగరూపాన్నిస్తే
గొర్లమందకు కావలివున్న గొల్లబోయ పెంటికనే లింగంగా సేవిస్తే
కుమ్మరి ఆవమూ, కమ్మరి దాతి, సాలె మగ్గమూ, మేదర గంపా
అట్లా ఇంటింటికీ తమ ఇసిరెలే దైవత్వమందుకున్నయో ఏమో.
వాటికి ఓ అవశేషమనుకోవచ్చు, ఈ రోకలిబండ దీపపుపూజ.
మాపటిపూట చీకటిపడుతుండగానే రోకలిపొన్నుకు మట్టిమెత్తి
పెద్దర్వాజ ఎదురుంగ నడివాకిట్ల తవ్వి రోకలి నిలబెట్టి గద్దెవేసి
పసుపుకుంకుమతోటి పూదిచ్ఛి, పూలుపత్రి పండ్లుపలాలువెట్టి
నడితొవ్వల పైరగాలికి సందెదీపం పెట్టిమొక్కుడు.. ఈ ఆచారం.
రాజేశుని పలారముల్లో ! అని బెల్లం పంచిపెట్టుడు ఓ సంతర్పణ.
పాతబట్ట కట్టుకున్నా సరే, ఎంతటి మడీ నీతీ నీయమం పద్ధతి !
తిరుగన్నదే లేని భక్తీ ప్రపత్తి. అదే పదేళ్లతో మొక్కే మన పబ్బతి !!
దేవుడు.. ఎన్నడూ లోకాతీతుడు కాడు, కాలేడు.
అందుకే లోకాలశంకరుడు అని యోగ్యంగ పిలిచుకుని
సర్వాంతర్యామికి తాతలతండ్రులు చెల్లించిన దీపనమస్కారం !
ఇది.. మన పద్ధతి – మన చరిత్ర ! ~ డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి, కరీంనగర్, తెలంగాణ.
Share this Article