మీకు మహానటి సినిమాలో ఓ విశేషం గుర్తుంది కదా… సావిత్రి కథకు సంబంధం ఉన్న ముఖ్య పాత్రలకు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో గెస్ట్ రోల్స్ చేయించాడు నాగ్ అశ్విన్… సుభద్రమ్మగా దివ్యవాణి, ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు, చక్రపాణిగా ప్రకాష్ రాజ్, ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, అక్కినేనిగా నాగచైతన్య, పుల్లయ్యగా మనోబాల, అలిమేలుగా మాళవిక నాయర్, సుశీలగా శాలినీ పాండే, కేవీరెడ్డిగా క్రిష్, సింగీతం శ్రీనివాస్‌గా తరుణ్ భాస్కర్, మధురవాణి తల్లిగా తులసి, వేదాంతం రాఘవయ్యగా వంగా సందీప్, కెమెరామన్ కేశవగా నరేష్, పింగళిగా బుర్రా సాయిమాధవ్ ఎట్సెట్రా… ఆ సినిమాకు ఇదీ ఓ ఆకర్షణ…
అదే నాగ్ అశ్విన్ ఇప్పుడు కల్కి అని ఓ అత్యంత భారీ చిత్రం తీస్తున్నాడు… భారీ అనడం ఎందుకంటే..? భారీ తారాగణం మాత్రమే కాదు, భారీ వ్యయం… అత్యంత భారీ కథాకాలం… అంటే మహాభారతం నుంచి 2898 సంవత్సరం దాకా… భూతం నుంచి భవిష్యత్తు దాకా… ఆ భారీ పరిణామగతిని రెండు గంటల్లో ఎలా చూపిస్తారనేది పెద్ద టాస్కే… పైగా సైన్స్, ఫిక్షన్, మైథాలజీలను కలగలపడం భారీ టాస్కే… సరే, నాగ్ అశ్విన్ ప్రతిభావంతుడైన దర్శకుడే కాబట్టి బాగానే తీస్తాడని ఆశిద్దాం…
ఐతే మహానటిలో ప్రముఖులను తన సినిమాలో చిన్న చిన్న గెస్ట్ రోల్స్ చేయించుకున్నట్టే ఈ కల్కిలో కూడా చేయించుకోబోతున్నాడా..? దీని మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి… ప్రభాస్ విష్ణుమూర్తి పదో అవతారం కల్కి పాత్రలో కనిపిస్తాడని ఓ గాసిప్… ఏమో, నిజమే కావచ్చు కూడా… సినిమాలో అమితాబ్ బచ్చన్, కమలహాసన్ కూడా నటిస్తున్నారనేది కన్‌ఫమ్ న్యూసే కదా… అమితాబ్ అశ్వత్థామ పాత్ర, కమలహాసన్ బలిచక్రవర్తి పాత్రలట… మరి దీపిక పడుకోన్..?
Ads
ఆమె పాత్ర పేరు పద్మ అట… కల్కి భార్య పేరు పద్మ అట… (ఏమో మరి, ఏ పురాణాల్లో ఉందో…) కల్కి చేసే పోరాటాల్లో పద్మ కూడా చురుకైనా భాగస్వామి అట… సో, దీపికకు ప్రభాస్‌కు ఈక్వల్ రోల్ దొరికినట్టే అన్నమాట… మరి గెస్ట్ రోల్స్…? పరుశురాముడు, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు పాత్రలు ఉంటాయట… వాటిల్లో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, నాని తదితరులు పోషిస్తారని ఓ టాక్ నడుస్తోంది… ఏ పాత్రకు ఎవరనేది మీ ఊహ, మీ ఇష్టం…
ఇవే గాకుండా శ్రీకృష్ణుడి పాత్రను కూడా సినిమాలో చూపిస్తారనీ, కృష్ణుడి ప్రియురాలు రాధ పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపిస్తుందని చెబుతున్నారు… మరి శ్రీకృష్ణుడు..? ఇంకా దీనిపై ఊహాగానాలు రావడం లేదు… వోకే, ఇవన్నీ గాసిప్సే కావచ్చు, నిజాలుగా మారవచ్చు… కానీ ప్రస్తుతానికి చదువుకోవడానికైతే బాగానే ఉంది…! అవునూ, ఇంత మంది నడుమ ఇక ప్రభాస్‌కు దక్కే స్క్రీన్ స్పేస్ ఎంత..?! రెండుమూడు భాగాల సినిమా తీస్తే తప్ప ఈ కథకు న్యాయం జరగదేమో..!
Share this Article