Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చివరలో దర్శకుడు ఆవేశం తగ్గించుకుని ఉంటే… ఈ మూవీ రేంజ్ మరోలా ఉండేది…

March 11, 2024 by M S R

Aranya Krishna….  చూడదగ్గ సినిమా! తెలుగులో వస్తున్న సినిమాలు చూస్తుంటే ఎందుకింత భావ దారిద్ర్యం అనే నిరాశ ఎప్పుడూ వెంటాడేది. ఆఫ్ బీట్, ఆర్ట్ సినిమాల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. కనీసం కమర్షియల్ సినిమాల్లో కూడా ఏ మాత్రం సృజనాత్మకత కనిపించదు ఏవో కొన్ని ఫార్ములా లెక్కలు మినహా! మధ్యమధ్యలో ఒకరిద్దరు దర్శకులు తళుక్కున మెరిసినా వారిని ఏ పెద్ద హీరోనో ఎత్తుకుపోయి ఫార్ములా సినిమాలు తీయిస్తాడు. ఇంక వాళ్లు కూడా రొటీన్ మూసల్లో ఇరుక్కుపోతారు. అందుకే తెలుగు సినిమాల్ని ఓటిటిలో చూడటమే కష్టంగా వుంది, ఇంక థియేటర్ దాకా వెళ్లడం కూడానా అనిపిస్తుంది నాబోటి మంచి సినిమా అభిమానికి. కొంచెం ఆలస్యంగానైనా “అంబాజీపేట మ్యారేజి బాండ్” సినిమా చూశాను. సహజమైన వాతావరణంలో, అంతకంటే సహజమైన పాత్రలు, సంభాషణలతో ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ మంచి కమర్షియల్ సినిమాగా దీన్ని గుర్తించొచ్చు.


దుర్మార్గ వ్యవస్థలోనే దుర్మార్గులుంటారు. ఒక వ్యక్తిలో కనిపించే చెడు వెనుక వ్యవస్థీకృతమైన భావజాల మద్దతు వుంటుంది. లేకపోతే ఓ ఊరికి ఒక దొర వంటి వ్యక్తి, అతని బారిన పడి సాంఘికంగా, ఆర్ధికంగా గిలగిలా తన్నుకునే ప్రజా సమూహమూ వుండదు. మనిషికీ మనిషికీ మధ్య సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక అంతరాలు ఎక్కువగా వున్నప్పుడే ఒక వ్యవస్థని దుర్మార్గమైనదని అనగలం. వివక్ష, హింసలకి – కులానికీ మధ్య వున్న సంబంధం అర్ధం చేసుకోకోకపోతే ఏ సామాజిక దుఃఖమూ అర్ధం కాదు. భారతదేశపు నగరాల్లో కంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కులాల పేరుతో సాంఘిక వివక్ష, ఆర్ధిక అంతరాలు, దోపిడీ, ఎదురు ప్రశ్నించిన వారి అణచివేత జరుగుతుంది. మరీ ముఖ్యంగా కింది వర్గాలవారు విద్యతో తమ జీవితాల్ని ఒక క్రమంలో బాగుచేసుకోవడాన్ని సహించలేని అగ్ర కుల పెత్తందారీతనం ఇంకా సజీవంగానే వుంది. మంచి బట్టలేసుకున్నందుకు, సెల్ ఫోన్ వాడుతున్నందుకు, తమ ఎదుటే కాలు మీద కాలు వేసుకున్నందుకు, మోటార్ సైకిలో, గుర్రమో ఎక్కినందుకు ఈ సినిమా కథ ఇలాంటి విషయాల్ని బేస్ చేసుకొని రాసుకున్నదే. కింద వర్గాల వారు ఆర్ధిక దోపిడీకి గురి కావడంతో పాటు తమ ఆత్మాభిమానాన్ని కూడా పోగొట్టుకొని దీనంగా నిలవకపోతే పెత్తందార్ల అహాలు దెబ్బ తినే వైనాన్ని ఎఫెక్టీవ్ గా చూపించాడు “అంబాజీపేట మ్యారేజి బాండ్”లో దర్శకుడు. తాను అనుకున్నది చెప్పడానికి దర్శకుడు ఎక్కడా సంశయించలేదు, తడబాటుపడలేదు.

సామాన్యంగా ఒక సినిమాలో కథని నడిపించే కథానాయకుడు, కథానాయకి అంటే ప్రేమికులే అయ్యుంటారు. కానీ ఈ సినిమాలో కథని నడిపించేది అక్కా తమ్ముళ్లు పద్మ, మల్లిలు. పద్మ బాగానే చదువుకుని స్థానిక లీడర్, వడ్డీ వ్యాపారి, పెత్తందారు ఐన వెంకట్ సిఫారసుతో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఊరిలో వున్న పాఠశాలలో ఉద్యోగం సంపాదిస్తుంది. ఆ మాత్రం సాయానికి వెంకట్ ఆమె మొత్తం కుటుంబాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలనుకోడమే కాకుండా పాఠశాలని తన గోడౌన్ చేసుకుంటాడు. దాన్ని ఆమె ప్రతిఘటించడంతో అతని అహం దెబ్బ తిని ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. పద్మకి తనతో సంబంధముందని ఊరంతా పుకార్లు పుట్టిస్తాడు. అదే సమయంలో మల్లి వెంకట్ చెల్లెలు ప్రేమించుకుంటుంటారు. అది వెంకట్ ని మరింత రెచ్చగొడుతుంది. స్కూల్లో పద్మని వివస్త్రని చేసి అవమానిస్తాడు. మల్లి గుండు గొరిగిస్తాడు. సెలూన్ నడుపుకునే మల్లి తండ్రిని కొడతాడు. మల్లి పనిచేసే మ్యారేజి బ్యాండు మొత్తాన్ని వేధిస్తాడు. ఇంక ఇక్కడి నుండి పతాక సన్నివేశం వరకు కథని అగ్ర కుల పెత్తందారీతనానికి, కింది కులాల ఆత్మ గౌరవ పోరాటానికి ప్రాధాన్యమిచ్చాడు దర్శకుడు. ఆ ఘర్షనని సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఇంతటి సామాజిక వాస్తవికతని ఇన్నాళ్లపాటు మలయాళం, తమిళ సినిమాల్లోనే చూసేవాళ్లం. ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో చూడగలం ఈ సినిమా ద్వారా. ఈ ప్రయత్నం గొప్పది.

Ads

ఇందులో మల్లి తన పుట్టినరోజు సందర్భంగా అందరికీ స్వీట్లు పంచుతూ వెంకట్ కి కూడా ఇవ్వబోతే “నాకొద్దు పో” అని ముఖం చిట్లిస్తాడు. అంతలోనే మల్లి దగ్గర వున్న బేసిక్ మొబైల్ ఫోన్ చూసి “మీకు బాగా డబ్బులెక్కువైనాయిరా” అంటూ ఈసడిస్తాడు. మల్లి సెలూన్ కి వచ్చి క్షవరం చేయించుకొని, చంకల్లో కూడా గీయించుకొని, కింద కూడా షేవ్ చేయమంటాడు. “ఇలా గీక్కోవడం మానేసి ఊళ్లో గొడవలు నీకెందుకురా?” అంటాడు. ఒక క్రమంలో ఇలాంటి దాష్టీక ప్రవర్తనల్ని మల్లి కుటుంబం ప్రతిఘటిస్తున్న క్రమంలో ప్రేక్షకుడు కథలో సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి బాధితుల పక్షాన చేరతాడు. కథని రాసుకున్న తీరు, సనివేశాల కూర్పు, ఆర్టిస్టుల నటన మనల్ని కట్టిపడేస్తాయి. ఇందుకు దర్శకుడు దుష్యంత్ ని మనం అభినందించక తప్పదు.

ఐతే ఈ సినిమాలో లోపాలు లేకపోలేదు. మల్లి, వెంకట్ చెల్లెలు లక్ష్మికి మధ్య ప్రేమ లోతుగా అనిపించదు. అసలు కథకి పెద్దగా అతకదు కూడా. వారిద్దరి ప్రేమ వ్యవహారం వెంకట్ కి తెలిసినా లక్ష్మికి హడావిడిగా సంబంధం చూడటం మినహా పెద్దగా ఏమీ చేయడు. పద్మ, వెంకట్ల మధ్యన జరిగే ఘర్షణే కీలకంగా వుంది. లక్ష్మి మల్లిలు చివరిసారిగా సెలూన్లో కలిసే సన్నివేశం సాగతీతగా అనిపిస్తుంది. దర్శకుడు ఏదో డ్రామా క్రియేట్ చేయాలని చూసినా అది ఫలించదు. ఓ పాటకి హీరో చేసే డాన్సులతో వారిద్దరి ప్రేమ ఏదో కమర్షియల్ సినిమా తరహాలోనే సాగుతుంది. లోతు లేదు.

చివరిగా ఇచ్చిన ముగింపు కూడా కన్విన్సింగ్ గా లేదు. బాధితుల ప్రతిహింసలో న్యాయముండొచ్చు కానీ అదే ప్రస్తుత వ్యవస్థలో పరిష్కారం కాలేదు. అలాంటి పరిస్థితులైతే లేవు. ఈ సినిమాలో పరిష్కారంగా చూపించింది పరిష్కారమే కాదసలు. దాన్ని గ్లోరిఫై చేసి చూపించినట్లనిపించింది. జనాగ్రహంలో ప్రాణాలు కోల్పోయిన పెత్తందారులుండటం అసహజమేం కాదు. వాళ్ల ఆస్తులు కాలి బూడిదై పోవచ్చు. కానీ పోలీసోళ్లు కూడా వంగి వంగి దండాలు పెట్టే శక్తివంతమైన వ్యక్తిని ఊరి మధ్యలో రెండేళ్లు పైన ఒక డాగ్ కేజ్ లో బంధించి బహిరంగ ప్రదర్శన చేయగలరా? అతనికున్న రాజకీయ పలుకుబడి వున్న వ్యక్తిని అలా వుంచడం సాధ్యమా? బహుశా దర్శకుడు తానే రాసుకున్న కథ ఇచ్చిన ఆవేశం నుండి బైటపడినట్లు లేదనిపించింది. జనం చట్టాల్ని చేతుల్లోకి తీసుకొని ఇదే శాశ్వత పరిష్కారం అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకో లోపం ఏమిటంటే ఇందులో వెంకట్ ఒక్కడే విలన్ గా కనబడతాడు. వాస్తవం అలా వుండదు. అతని వెనుక మద్దతుగా దుర్మార్గ వ్యవస్థని కాపాడే శక్తులు చాలానే వుంటాయి. పోలీసుని చూపిస్తారు కానీ అదేం ప్రభావవంతంగా లేదు. ఓ పెత్తందారు వెనుక అతని కులం, ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని ఎదిగిన రాజకీయులూ వుంటారు. ఈ ఎలిమెంట్స్ కనబడలేదు సినిమాలో.

ఏది ఏమైనా పై లోపాల్ని మినహాయిస్తే “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మంచి ఫీల్ ఇచ్చే సినిమా. పద్మగా శరణ్య ప్రదీప్, మల్లిగా సుహాస్, వెంకట్ గా నితిన్ ప్రసన్న తమకిచ్చిన పాత్రల్లో జీవించేశారు. అందరూ తెలుగు నటులవడం నాకు నచ్చిన మరో అంశం ఈ సినిమాలో. సుహాస్ టాలెంట్ మనకి తెలిసిందే. ఈ సినిమా ద్వారా శరణ్య, నితిన్ ప్రసన్న అదరగొట్టేశారు. ఇప్పటికైనా తెలుగు సినిమా వాళ్లు తమ సినిమాల్లో విలన్లు, హీరోయిన్ల కోసం బాలీవుడ్, మల్లువుడ్, శాండల్ వుడ్ వైపు చూడకుండా నితిన్ ప్రసన్న, శివాని నాగారం వంటి తెలుగు ఆర్టిస్టుల్ని తీసుకుంటే బాగుంటుంది. సహాయ పాత్రల్లో జగదీష్, గోపరాజు రమణ, మల్లి తల్లిదండ్రులుగా వేసిన వారు గొప్పగా చేశారు. ఆహా ఓటిటిలో వుంది చూడండి….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions