ఓపెన్ హైమర్… ఈ సినిమాకు ఏకంగా ఏడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి ఈసారి… దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ప్రతిభ ఆ సినిమాలో ప్రతి సీన్‌లోనూ కనిపిస్తుంది… అందరికీ తెలిసిన కథే అయినా ఆసక్తి తగ్గకుండా మంచి ప్రజెంటేషన్ మీద దృష్టి పెట్టాడు… నిజానికి ఇంకా ఎక్కువ అవార్డులే వస్తాయని సినిమా ప్రేక్షకులు కూడా అంచనా వేశారు… నోలన్‌కు ఆస్కార్ కొత్తేమీ కాదు.,. కానీ గన్ షాట్‌గా ఈ సినిమాకు ఈసారి అవార్డుల పంట గ్యారంటీ అని ఊహిస్తున్నదే…
బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ సహా ఏడు అవార్డులకు ఈ సినిమా అర్హమైనదే… ఇంతకీ ఈ సినిమా దేని గురించి సార్ అనడిగాడు ఓ మిత్రుడు… జపాన్ హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అమెరికా తొట్టతొలి అణుబాంబు వేసింది కదా… అదుగో ఆ బాంబు సృష్టికర్త పేరు హైమర్… డాక్టర్ జే రాబర్ట్ ఓపెన్ హైమర్… ఫాదర్ ఆఫ్ ఆటం బాంబ్… అసలు అణుబాంబు తయారీకి దారితీసిన పరిస్థితులు, ఆ మాన్ హాటన్ ప్రాజెక్టు, ఆ సైంటిస్టు మథనం, అణుప్రయోగం తరువాత విధ్వంసం, విషాదాలను గమనించాక వైరాగ్యంలోకి జారిపోవడం గట్రా ఈ సినిమా కథ…
సినిమా రిలీజు సమయంలోనే ప్రశంసాపూర్వక సమీక్షలు వెలువడ్డాయి… ఓపెన్ హైమర్ ఆ బాంబు సృష్టించిన విధ్వంసం తరువాత తీవ్ర మనోవేదనకు గురయ్యాడని సినిమా కథ చెబుతోంది… కానీ తన ధర్మాన్ని తాను నెరవేర్చాననీ హైమర్ చెప్పేవాడనే కథనాలు కూడా ఉన్నాయి… తన బాంబు సృష్టిని సమర్థించుకోవడానికి హైమర్ భగవద్గీతను ఆశ్రయించాడు… నిజమే… ఈ సినిమాలోనూ ఆ ప్రస్తావన ఉంది…
Ads
‘సృష్టించేవాడిని నేనే- నాశనం చేసేవాడినీ నేనే’ అంటాడు కదా శ్రీకృష్ణుడు… అంటే తను గీసిన స్కెచ్‌లో మిగతావాళ్లంతా జస్ట్ పాత్రధారులే అంటాడు… కర్మ నీ వంతు, ఫలితం నాకు వదిలెయ్ అనేది గీతాసారం… నేను చేసిందీ అదే కదా అంటాడు హైమర్… ఐతే సినిమాలో ఓచోట రొమాన్స్ సీన్‌లో గీతను కూడా చూపించడం కొంతమేరకు ఇండియన్ రివ్యూయర్ల విమర్శకు గురైంది… అలాగే సీనిమా నిడివి కూడా 3 గంటల 10 నిమిషాలు… అదీ ఒకింత మైనస్ పాయింటే…
తీవ్ర మథనానికి గురై నైతికంగా డౌన్ అయిన సమయంలో హైమర్ భార్య తనకు అండగా నిలబడి, కుటుంబాన్ని చక్కబెట్టుకున్న తీరు కూడా నోలన్ బాగా చిత్రీకరించాడు… న్యూక్లియర్ సైన్స్, ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ మీద కాస్త అవగాహన, ఆసక్తి ఉన్నవాళ్లకు సినిమాలోని టెక్నికల్ బ్రిలియెన్స్ బాగా కనెక్టవుతుంది…
(హైమర్ భార్య కేథరిన్, బిడ్డ టోనీ, కొడుకు పీటర్… రియల్ ఫోటో)
అణుబాంబు పేలిన తరువాత ఏం జరిగింది..? ఏమో, ఎవరూ సరిగ్గా రికార్డు చేసినట్టు లేదు… తను కమ్యూనిస్టు సమావేశాలకు హాజరయ్యాడని తెలిసి ఎఫ్‌బీఐ తనను విచారించడమే గాకుండా తనపై ఎప్పుడూ నిఘా ఉంచేదని చెబుతారు… అంతేకాదు, తన పిల్లల్లో కొడుకు పీటర్ న్యూమెక్సికోకు వెళ్లి, పూర్వీకుల ఇంట్లో కార్పెంటర్‌గా బతికాడని ఓ కథనం… బిడ్డ టోనీ ఉద్యోగాల అవకాశాలకూ పలు అడ్డంకులు ఎదురై సఫరైందనీ అంటారు… ఓపెన్ హైమర్ సినిమా ప్రధానంగా అణుబాంబు బేస్డ్ కథే అయినా తన పర్సనల్ జీవితం మీద కూడా కొంత ఫోకస్ చేసింది…! సినిమా 10 కోట్ల డాలర్లతో నిర్మితమైతే… 96 కోట్లను వసూలు చేసింది..!!
Share this Article