ఆమె పేరు ఏమిటో మళ్లీ మళ్లీ అనవసరం… తెనాలి… జగన్ ప్రభుత్వ పథకాలను అందుకుంటున్న మహిళ ఆమె… భర్త ఏదో షాపులో చిరుద్యోగి… ఆ అభిమానం నిండుగా ఉంది ఆమెకు… ఎవరో యూట్యూబర్ అడిగితే అదే చెప్పింది… అది ఆమె అభిప్రాయం, ఆమె అభిమానం… కానీ అదే ఆమె చేసిన తప్పు అయిపోయింది… పరమ నీచమైన భాషలో ఆమెను ట్రోల్ చేశారు… సాక్షి భాషలో చెప్పాలంటే మారీచులు, సోషల్ మాఫియా, వేటకుక్కలు ఎట్సెట్రా…
నిజానికి సోషల్ పిశాచాలు వాడిన భాష, ఆ పోస్టులు చూస్తే తటస్థులకే మండిపోయేట్టుగా ఉన్నయ్… ఆమె భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది, హాస్పిటల్‌లో మరణించింది… ఆమె ఇద్దరు బిడ్డల ఫోటో చూస్తే ఎక్కడో కలుక్కుమన్నట్టుగా ఉంది… నో, వాళ్ల ఉసురు ట్రోలర్లకు తగుల్తుందనే మాటలు, వ్యాఖ్యలు వేస్ట్… ఎందుకంటే..? ట్రోలర్లు అన్నింటికీ అతీతులు…
Ads
కానీ ట్రోలింగ్ ధాటికి ఓ నిండు ప్రాణం పోవడం అనేది తొలిసారి గమనిస్తున్నాం… సోషల్ మీడియా ట్రోలింగ్ వైరస్ ఎంత డేంజరసో అర్థం చేసుకుంటున్నాం… నిజంగా జగన్ ప్రభుత్వం వాళ్లపై చర్యలు తీసుకుంటుందా లేదానేది పక్కన పెడితే… నాణేనికి మరోవైపు వెళ్దాం కాసేపు…
వోకే, జనసేన, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులో, ఫ్యాన్సో ఈ భీకరమైన ట్రోలింగు చేశారనే అనుకుందాం… గతంలో మహేష్ కత్తిని ఎంత ట్రోల్ చేశారో కూడా చూశాం కదా… అసలు పోస్టులే కాదు, ఫోన్ నంబర్లు తీసుకుని కాల్స్ చేసి బూతులు తిట్టడం, బెదిరించడం, ఇన్ బాక్సుల్లోకి వెళ్లి, కుటుంబ సభ్యులనూ లాగి ఇష్టారాజ్యంగా నోళ్లు పారేసుకోవడం… ఆ పైశాచికం చెబితే ఒడవదు, తెగదు…
కానీ జనసేన, టీడీపీ మాత్రమేనా..? ఏ పార్టీ శుద్ధపూస..? బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ ఎట్సెట్రా ఎవరు తక్కువ..? ఎప్పుడైతే ఫేస్ బుక్ పార్టీల ఫ్యాన్స్, ఫేక్ ఖాతాలతో నిండిపోయిందో… సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలకు, ట్రోలింగులకు, పార్టీ ప్రచారాలకు వేదికగా మారిందో అప్పుడే సోషల్ మీడియా ఓ డేంజరస్ వ్యాధిగా మారిపోయింది… సున్నిత మనస్కులు ఈ వేదికల్లో ఉండలేని దురవస్థ… పెయిడ్ క్యాంపెయిన్స్ సమాజానికే ఓ తలనొప్పి ఇప్పుడు… పెద్ద పెద్ద పొలిటికల్ వ్యూహకర్తల సోషల్ మీడియా విభాగాలు ప్రధానంగా చేసే పనే ఇది కదా… నిజానికి పార్టీలను కూడా కాసేపు వదిలేద్దాం…
హీరోల ఫ్యాన్లు, కులాల వారీ, సంఘాల వారీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా… ఏదో పోస్టులో ఏదో పట్టుకోవడం, ఇక స్టార్ట్ దాడి… బాగా చదువుకున్నవాళ్లు, హుందాగా ఉండాల్సిన పోస్టుల్లో ఉన్నవాళ్లు కూడా బజారు భాషకు దిగుతున్నారు… రిపోర్టులు కొట్టడాలు, కమ్యూనిటీ స్టాండర్డ్స్ అనేవి పెద్ద భ్రమ… కోర్టు, పోలీస్ కేసులు కూడా అంతిమంగా సాధించేదేమీ ఉండదు, ఇదేమీ ఆగడం లేదు… మహిళల్ని, వాళ్ల కుటుంబాల్ని కూడా బయటకు లాగి ట్రోల్ చేస్తున్నారు… ఇక పార్టీల్లో యాక్టివ్‌గా ఉండే మహిళల మీదయితే ట్రోలింగ్‌కు ఆకాశమే హద్దు… నిజంగా దీనికి పరిష్కారం ఏమిటి..? జవాబు అంతుపట్టని పెద్ద ప్రశ్న..!!
Share this Article