ఆకాశ హర్మ్యంలో ఆర్గానిక్ కూరలు!
——————-
హైదరాబాద్ విశ్వనగరం కాబట్టి అంతర్జాతీయ స్థాయి జీవన ప్రమాణాలు అక్కడక్కడా తొంగి చూస్తుంటాయి. విశ్వనగర పౌరులుగా అది మనం పులకించాల్సిన అంశమే కానీ- బాధపడాల్సిన విషయం కాదు. ఆకాశాన్ని తాకే భవనాలు విశ్వనగరానికి మొదటి కొండ గుర్తులు. ఈమధ్య హైదరాబాద్ అన్ని వైపులా ఇరవై, ముప్పయ్, నలభై, యాభై అంతస్థుల భవనాలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ పైపైకి దూసుకుపోతున్నాయి. ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికల్లో ప్రతి శనివారం రియల్ ఎస్టేట్ ప్రత్యేక అనుబంధం వస్తూ ఉంటుంది. అలా ఈ శనివారం ఒక ఇంగ్లీషు పత్రికలో హైదరాబాద్ నడిబొడ్డున కడుతున్న ఇరవై అయిదు అంతస్థుల ఇంద్రుడు సిగ్గుపడాల్సిన ఒక విలాసవంతమయిన అపార్ట్ మెంట్ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చింది. అయిదు వేల చదరపు అడుగుల ఆకాశంలో ఉయ్యాలలాంటి విశాలమయిన అపార్ట్ మెంట్. ధర చదరపు అడుగుకు అక్షరాలా పదకొండు వేల రూపాయలు. అంటే అయిదున్నర కోట్లు. స్టాంప్ డ్యూటీ, జి ఎస్ టీ లు ఆరున్నర శాతం. కార్ పార్కింగ్, ఎమినిటీస్, క్లబ్ హౌస్ అదనం. అంత ఇంటికి ఫర్నీచర్, ఇంటీరియర్ ఎంత కాదన్నా కోటి. మొత్తం పూర్తయి ఇంట్లో అడుగు పెట్టేసరికి ఏడు, ఏడున్నర కోట్లలోపు అయితే చాలా పొదుపుగా చేసినట్లు.
Ads
ఏడెనిమిది కోట్లు పెట్టి కొనగలిగేవారు కొంటారు. అమ్మేవారు అమ్ముతారు. మనకు ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. ఈ విలాసవంతమయిన ఆకాశ హర్మ్యానికి ఆ బిల్డర్ ఇచ్చిన ప్రకటన మాత్రం ఆలోచించదగ్గది. అందులో అపార్ట్ మెంట్ కొన్నవారు కింద సేంద్రియ వ్యవసాయం చేసుకోవడానికి కొంత చోటు కేటాయిస్తారట. కూరలు అక్కడే తాజాగా కోసుకుని వంటింట్లో వండుకుని తిని ఆరోగ్యంగా ఆకాశంలో తేలిపోవచ్చట. అలాంటి ఆర్గానిక్ కూరలు పండించుకునే కమ్యూనిటీ ఫార్మింగ్ కు అవకాశమున్న తొలి ప్రాజెక్ట్ అట.
ఈ ప్రకటన చూశాక సామాన్యుల సందేహాలు:-
ఆర్గానిక్ కూరల కోసం ఎనిమిది కోట్లు పెట్టుబడి పెట్టాలా?
ఇరవై అయిదో అంతస్థులో కృష్ణా రామా అని ఉండకుండా కిందికొచ్చి ఆర్గానిక్ మొక్కలకు నారు పోసి, నీరు పోస్తూ ఉండాలా?
కాంక్రీట్ కీకారణ్యంలో సహకార సేంద్రీయ వ్యవసాయం ఇంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నదా?
ఇంటికోసం కూరలు కొంటారా?
కూరల కోసం ఇల్లు కొంటారా?
నాడా దొరికితే గుర్రం కొన్నట్లు- కూరలు కావాలంటే ఇల్లు కొనాలా?
ఆరోగ్యం ఎవరికీ ఊరికే రాదు. అందునా- ఆర్గానిక్ ఆరోగ్యం అస్సలు ఊరికే రాదు. డబ్బు చెట్లకు కాయదు. ఆర్గానిక్ చెట్లకు అస్సలు డబ్బు కాయదు. డబ్బుకే ఆర్గానిక్ చెట్టు మొలుస్తుంది. డబ్బుకే అపార్ట్ మెంట్ మొలుస్తుంది. డబ్బుకే సహకార సేంద్రీయ సాగు కొనసాగుతుంది.
డిస్ క్లైమర్ లాంటి క్లైమర్:- ఈ అపార్ట్ మెంట్ నిర్మాణం, గోడలు, కిటికీలు, తలుపులు, ఫ్లోరింగ్ గచ్చు గురించి ఎంత గుచ్చి గుచ్చి చూసినా వివరాలు లేవు. ఇద్దరు బహుశా భార్యాభర్తలు బుట్టలో ఆర్గానిక్ కూరలు పట్టుకుని పరవశిస్తున్న వివరాలే ఉన్నాయి కాబట్టి- పాఠకులు ఆర్గానిక్ కంటెంట్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్గానిక్ విన్నపం!…… By…….. – పమిడికాల్వ మధుసూదన్
Share this Article