Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అస్తు… మూవీ మొత్తం మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికత…

March 13, 2024 by M S R

Sai Vamshi……..   కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్‌ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన ‘అస్తు’. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక రోజు ఆయన తన ఇంటివారికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతే? ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించి జీవన తాత్విక అంశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి.


చక్రపాణి శాస్త్రి. భార్యను పోగొట్టుకుని పెద్ద కూతురు, అల్లుడి సంరక్షణలో ఉంటున్న వ్యక్తి. మెల్ల మెల్లగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ తనవారినే మర్చిపోయే పరిస్థితి. అలాంటి వ్యక్తి ఓ రోజు అనుకోకుండా బజార్లో ఎటో వెళ్లిపోయాడు. ఎక్కడికి? ఏనుగుపై మనుషుల్ని ఎక్కించుకుని పొట్ట పోసుకునే వారి దగ్గరికి. ఎందుకు? సమాధానం లేదు. చెప్పలేడు. ఆయనకు ఆనందంగా అనిపించిన చోటికి వెళ్లిపోయే స్థితిలో ఉన్నాడు. మాటలు లేవు. ఆకలి, దాహం అని మాత్రమే అడగగలడు. నవ్వొస్తే నవ్వు. బాధొస్తే ఏడుపు. మధ్యలో సంస్కృత శ్లోకాలను వల్లిస్తూ ఉంటాడు. ఏనుగును అబ్బురంగా చూస్తూ, ఆ ఇంటివారి చిన్నపిల్లతో కలిసి ఆడుతూ తానూ ఓ పిల్లాడిలా మారిపోయాడు.

మరోదిక్కు కూతురు, అల్లుడు ఊరంతా వెతుకుతూ ఉన్నారు. ముంబై మహానగరంలో ఒక మనిషిని వెతికి పట్టుకోవడం సులభమా? అయినా ఉదయం నుంచి సాయంత్రం దాకా రకరకాల ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. గతాలు వెంటాడుతూ ఉన్నాయి. రకరకాల మనుషులు తారసపడుతూ ఉన్నారు. ఏది నిజం? ఏది అబద్ధం? ఎవరూ తేల్చి చెప్పలేరు. మానవ సంబంధాల్లో అతి ముఖ్యమైనది ప్రేమ, నమ్మకం. అవి రెండూ బలంగా ఉన్న చోటు వర్తమానం. అదే నిజం! చివరకు తూర్పున సూర్యుడు ఉదయించే సమయానికి ఇంటివారికి ఆయన జాడ తెలిసింది.

Ads

కథ సుఖాంతమైంది.చాలా చిన్న కథ. అయితే అర్థం చేసుకోగలిగితే అనంతమైన అంశాలన్నీ ఈ చిన్న కథలోనే ఉంటాయి. ఈ కథ అల్లుకున్న మనుషుల్లోనే ఉంటాయి. మనదైన ప్రపంచం అవతల మనుషులు కోరుకునే నెమ్మది, నమ్మకం, ప్రేమ ఒకటి ఉంటుంది. అది కావాలి. అదే కావాలి. దానికి దృశ్యరూపం ఇచ్చిన సినిమా ఇది. ఇంటి పెద్ద కనిపించకుండా పోవడం వెనుక ఇంటి సభ్యుల బాధ, వేదన ఒకటైతే, వెళ్లిపోయిన మనిషి తాలూకు అంతర్గత సంచలనం, ఆనందం మరో పక్క. ఇదంతా చెప్పడం కష్టం. చూసి తీరాల్సిందే! మానవ సంబంధాల్లోని భిన్నమైన పార్శ్వాలను అత్యంత ప్రభావవంతంగా పట్టుకున్న సినిమా ఇది. చూసి మర్చిపోవడం కష్టం.

అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడిగా మోహన్ అగాషే నటన గురించి ఎంత చెప్పినా తక్కువే! వృత్తిరీత్యా మానసిక వైద్య నిపుణుడు. 1975 నుంచి సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. మరాఠీ నాటకరంగంలో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఈ చిత్రంలో పోషించిన పాత్ర మన మనసుల్లో నిలిచిపోతుంది. ముంబై వీధుల్లో ఏనుగు వెంట అమాయకంగా తిరిగే వృద్ధుడి రూపం మనల్ని వదిలిపోదు. ఆయన కూతురిగా ఇరావతి హర్షే నటన చాలా బాగుంది. ఏనుగు ద్వారా జీవనం సాగించే కన్నడ ఇల్లాలి పాత్రలో ప్రముఖ నటి అమృతా సుభాష్ చక్కగా నటించారు. ఉన్న రెండు, మూడు సన్నివేశాల్లోనే అద్భుతమైన నటన ప్రదర్శించడం ఎలాగో ఆమె పోషించిన పాత్రను చూసి అర్థం చేసుకోవచ్చు. ఆ సంవత్సరం జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటి అవార్డు ఈ పాత్రకు గాను ఆమెను వరించడం విశేషం. Amazon Primeలో ఇంగ్లీషు సబ్‌టైటిల్స్‌తో లభ్యం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions