Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భాషలందు లాఠీ భాష వేరయా… జగాన దీనికి సాటి లేదయా…

March 13, 2024 by M S R

పోలీసు మర్యాద… ప్రపంచంలో లిపి లేని భాషలు ఎన్నో ఉన్నాయి. మాట్లాడే మాటకు లిపి ఒక సంకేత రూపం- అంతే. సహజంగా మాట్లాడే భాషను ఎంత యథాతథంగా రాసినా మాట్లాడే భాషలో ఉన్న పలుకు అందాన్ని లిపిలో దించలేము. పలికేటప్పుడు భారద్దేశం అనే అంటాం. కానీ- రాసేప్పుడు మాత్రం భారత దేశం అని రాస్తాం. భారత దేశం అని చదువుతున్నారంటే రాసిన ప్రతి అక్షరాన్నీ పలకాలన్న మన తపన- అంతే.

మాట్లాడే భాషలో సంధి అంత్యంత సహజం. లేకపోతే ఒక్కొక్క పదం, ఒక్కో అక్షరం వేరుపడి యంత్రం మాట్లాడినట్లు ఉంటుంది. (ఈరోజుల్లో యంత్రాలే మనకంటే చక్కగా మాట్లాడుతున్నాయనుకోండి- అది వేరే విషయం). ఇంతకంటే లోతుగా వెళితే ఇది భాషలో లిపికి సంబంధించిన పాఠం అవుతుంది కాబట్టి… ఇక్కడికి వదిలేసి… లిపి లేని ఒకానొక పోలీసు భాష; వారి మర్యాదలకే పరిమితమవుదాం.

రాజకీయ పార్టీల బహిరంగసభలు ప్రత్యక్ష ప్రసారం చేయడం నా వ్యాపారవృత్తిలో భాగం. ఇలాంటిచోట్ల పోలీసు వారి భాష, మర్యాద నాకు చాలా అవమానకరంగా, అమానవీయంగా అనిపిస్తూ ఉంటుంది. సభకు ముందు నిర్వాహకులు డ్యూటీ పాస్ లు ఇస్తారు. పోలీసులు విడిగా మరో పాస్ ఇస్తారు. సభకు ముందు జరిగే అన్ని సమావేశాల్లో చక్కగా, మర్యాదగా మాట్లాడే పోలీసులే సరిగ్గా సభ జరిగే వేళ చంద్రముఖులుగా మారిపోతారు. అదెలాగో చూడండి.

Ads

తుపాకీ చూస్తావా?

ఒక బహిరంగ సభ. ముందు రోజే అన్నీ ఏర్పాట్లు చేసుకుని… రాత్రి దగ్గర్లో లాడ్జ్ లో పడుకుని… ఉదయాన్నే సభా స్థలికి బయలుదేరాము. సభ జరిగే చోటుకు రెండు కిలోమీటర్ల ముందే వాహనాన్ని అడ్డగించే పోలీసుల దగ్గర మొదలయ్యే వాగ్వాదం ఎంత దాకా వెళుతుంది అన్నది ఆ రోజు మన జాతకచక్రాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. “వెహికిల్ పాస్ ఉంది కదా! లోపలికి వెళ్లనివ్వండి! ఈ మీటింగ్ లైవ్ చేసేవాళ్ళం” అన్న నా మాటల్లో అమ్మనాబూతులు వినిపించినట్లు సి ఐ ఊగిపోయాడు. నేను వెళ్ళడానికి వీల్లేదంటే మీ డ్రైవర్ హారన్ కొట్టాడు… ఏమనుకుంటున్నారు? తుపాకీతో కాల్చి పారేస్తాను…అని పోలీసు భాష మొదలుపెట్టాడు.

చాలా రోజులుగా తుపాకీ కాల్చక ఉబలాటంగా ఉన్నట్లున్నాడు… పొద్దున్నే ఆయన కాల్పులకు గురి కావడమెందుకని… అందరం బండి దిగి… ప్రాణభయంతో నడవబోయాము. ఈలోపు మా కెమెరామ్యాన్ చేతిలో ఉన్న పెట్రోల్ డబ్బా అతడి కంట్లో పడింది. మా లైవ్ వెహికిల్ జనరేటర్లో పోయడానికి తెచ్చుకున్న ఇంధనమది. మాలో ఆత్మాహుతి దళాలను పసిగట్టినవాడైన ఆ సిఐ వెంటనే అడ్డుకున్నాడు. పాస్ ఉన్న మనిషిని అనుమతిస్తాను కానీ… పెట్రోల్ డబ్బా ఉన్న మనుషులను అనుమతించను అని అడ్డుగా నిలుచున్నాడు.

లైవ్ ఎలా జరుగుతుంది? జనరేటర్ ఎలా రన్ అవుతుంది లాంటి సాంకేతిక విషయాలు చెప్పి చూశాను. అతను ప్రతిసారీ తుపాకీనే చూడమంటున్నాడు. గంటసేపు అలా రోడ్డుమీదే కూర్చుని… చివరికి ఆ జిల్లా ఎస్పికి ఫోన్ చేసి… మేడమ్ నిన్న మనమనుకున్నదేమిటి? ఇప్పుడు మీవాళ్లు చేస్తున్నదేమిటి? తుపాకీలో ఆరు తూటాలున్నాయట. మేమిక్కడ ఆరుగురే ఉన్నాము. బతికుంటే బలుసాకు తిని శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుకుంటాం… దయచేసి మా ప్రాణాలను కాపాడండి మేడమ్! అని వేడుకున్నాను.

దయగల తల్లి వెంటనే స్పందించి వాకీ టాకీలో ఆ సిఐకి చెప్పింది. తుపాకీని ఉపయోగించకుండా పెట్రోల్ డబ్బాతోపాటు మమ్మల్ను లోపలకు అనుమతించాడు. ఎలాగో పని జరిగింది. కానీ ఆయనన్న అసభ్యమైన, రాయడానికి వీల్లేని మాటలు మాత్రం నా గుండెకు గుచ్చుకునే ఉన్నాయి. తరువాత ఆయనే డిఎస్పి గా పదోన్నతి పొంది ఒక స్కూల్లో విద్యార్థులకు సంస్కార పాఠాలు ఎలా నేర్చుకోవాలో, చదువుకు ఉన్న విలువ ఎంత గొప్పదో, చదువుకున్నవారిని గౌరవించాల్సిన అవసరమేమిటో చక్కగా చెప్పగా జోనల్ పేజీలో వచ్చిన ఫోటో సహిత వార్తను మా కెమెరా మ్యాన్ నాకు పంపి మానిన గాయాన్ని మళ్లీ కెలికాడు!

మరో మీటింగ్. ఏ గేట్లో అయినా ప్రవేశించడానికి మాకు పాస్ లు ఉన్నాయి. రోడ్డు మీద ఒక సిఐ స్థాయి పోలీసు ఆపాడు. పాస్ చూపితే… దిగి… నడిచి వెళ్ళండి… అన్నాడు. ఇది మీడియా పాస్. మీ ఎస్పి జారీ చేసినదే… ఈ కార్యక్రమం లైవ్ చేసేది మేమే. ఈ గేట్లో వెళితే పబ్లిక్ వెళ్లే చోటికే వెళ్లగలం… ఫలానా గేట్లో వెళితేనే స్టేజ్ దాకా వెళ్లగలం… అన్న నా మాటల్లో అంతులేని అహంకారం, సంస్కార రాహిత్యం, పచ్చి బూతులు, అమర్యాద, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై హత్యా ప్రయత్నం లాంటి నేరాలన్నీ అతడికి ఒకేసారి కనిపించాయి.

అయితే మా ఎస్పినే అడుక్కోండి అని… ఇంకో మాట మాట్లాడితే బొడ్లో రివాల్వర్ తీసి కాలుస్తానన్నట్లు ఫోజు పెట్టి అడ్డంగా నిలుచున్నాడు. వ్యాపారం పోయినా పరవాలేదు… ప్రాణమే పోయేలా ఉంది అనుకుని… ఆయన స్నేహపూర్వకంగా ఆదేశించినట్లు కిలో మీటర్ నడిచి… పబ్లిక్ వెళ్లే గేట్లో వెళ్లి… మూడు చోట్ల దొంగల్లా బారికేడ్లు, గోడలు, ఫెన్సింగ్ వైర్లు ఎక్కి… దూకి స్టేజ్ దాకా వెళ్లాము. “సకల ప్రజాస్వామ్య బలం పోలీసు లాఠీ ముందు ఎందుకోగానీ నీరుగారిపోతుంది” అన్నది పతంజలి పరిశీలన.

కడుపుకు అన్నమే తింటారా?

ఇంకో పబ్లిక్ మీటింగ్. ఇంట్లో మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడని సరదాగా వాడిని కూడా తీసుకెళ్లాను. ఊరికి దూరంగా ఎడారిలో ఆ మీటింగ్. మధ్యాహ్నం భోజనం సమయానికి మా వాడితో  కలిసి మీడియాకు భోజనం పెడుతున్న చోటికి వెళితే… ఈ పాస్ కు పిండం ఇక్కడ కాదు అని ఒక పోలీసు స్నేహపూర్వకంగా అడ్డుకున్నాడు. నిర్వాహకులు మైకులో చెప్పి పంపితేనే వచ్చాము… ఇది ఆల్ యాక్సెస్ పాస్ అంటే… చెయ్ ఖాళీ లేదు పోతారా? లేదా? అని చెయ్యడ్డు పెట్టి… అడుక్కు తినేవారిని విదిలించినట్లు స్నేహపూర్వకంగా తరిమేశాడు.

సింహం ఆకలితో చావనయినా చావాలి కానీ…గ డ్డి మేయకూడదు అన్న పద్యం చదువుకుంటూ… ఆది భిక్షువు వాడినేది అడిగేది అన్న సిరివెన్నెల పాటకు మా వాడికి అర్థం చెబుతూ రెండు గంటలు అన్నం కోసం రోడ్ల మీద పడి తిరిగితే ఎక్కడా దొరకలేదు. ఇద్దరం నీళ్లు తాగి… ఆ పూట పస్తులున్నాం. అప్పుడు మా వాడు అన్న మాట- నాన్నా మనకు ఒక పూట అన్నం లేకపోతే పోయింది కానీ… ఆ పోలీసు ప్రవర్తన మాత్రం చాలా అవమానకరంగా ఉంది- వద్దన్న తరువాత మనం మారు మాట్లాడకుండా వెనక్కు తిరిగాము కదా! వీళ్లు మారరా? అని. ఆ పోలీసు ఆ పూట నా నోటి కూడును అడ్డుకుంటే అడ్డుకున్నాడు కానీ… నేను రోజూ ఎలా రోడ్ల మీద అవమానాలు పడుతున్నానో మావాడికి తెలిసిందట.

ఒకానొక పబ్లిక్ మీటింగ్. నిర్వాహకులు పదిరోజులుగా చేయని ఏర్పాటు లేదు. వేసవి వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఫ్యాన్లు, మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లు, స్నాక్స్, కొబ్బరి నీళ్లు, భోజనాలు, పళ్లు… ఇలా చెబితే లిస్ట్ కొండవీటి చేంతాడు కంటే పెద్దది. మీటింగ్ ముహూర్తం వేళ రానే వచ్చింది. బండలు పగిలే ఎండల వేళ. మంచి నీళ్ల బాటిళ్లను పోలీసులు అడ్డుకోవడంతో మాకు నాలుక పిడచకట్టుకుని పోతోంది. సార్! ఫలానా గేట్లో నీళ్ల బాటిల్స్ ఆగిపోయాయి… పంపండి అని నిర్వాహకులు మైకులో పదే పదే చెబితే అతికష్టం మీద పోలీసులు ఒక్కొక్కరికి ఒక్కో చుక్క దక్కేలా రెండు బాటిళ్లను పెద్ద మనసుతో అనుమతించారు.

ఇలాంటిచోట్ల నిర్వాహకుల మీద ఆధారపడకుండా మా ఏర్పాట్లేవో మేము చేసుకుంటూ ఉంటాం.అందులో భాగంగా బయటెక్కడో హోటల్లో అన్నం పొట్లాలు కట్టించి సభాస్థలికి తెప్పించాము. పొద్దున పదకొండు గంటలకు బయలుదేరిన ఆ పొట్లాలు మమ్మల్ను చేరేసరికి సాయంత్రం సూర్యాస్తమయం అయిపోతూ ఉంటుంది. స్కానర్లో నుండి అన్నం పొట్లాలు తేలేదన్న కారణంతో ఆగ్రహించి తినబోయిన అన్నాన్ని నోటి దగ్గర నుండి కడుపుకు అన్నమే తింటున్నాననుకునే ఒక పోలీసు అధికారి లాక్కెళ్లాడు. “కడుపుకు అన్నం తినేవారు చేసే పనేనా?” అని అడగాలని నోటిదాకా వచ్చినా… పతంజలి పోలీసు లాఠీ సూత్రభయం వల్ల అడగలేకపోయాం.

ఎన్నో సందర్భాల్లో త్రిబులెక్స్ కూడా కడగలేక సిగ్గుతో తలదించుకునే పోలీసు భాషకు మా సిబ్బంది గురవుతుంటే వినలేక చెవులు మూసుకోవాల్సి వస్తుంది. ఆయా సందర్భాల్లో వారి “సంస్కృత” భాషకు నేను అచ్చ సంస్కృతంలో మనసులోనే శపించి పక్కకు వెళ్లిపోతూ ఉంటాను. తపశ్శక్తి లేని నా శాపం ఫలించక ఎందరో బతికిపోయి ఉంటారు. లేకపోతే విఠలాచార్య సినిమాలోలా ఎందరో అక్కడికక్కడే మాడి మసైపోయి ఉండేవారు!… -పమిడికాల్వ మధుసూదన్… 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions