ఆమె వివాహం.. పాతికేళ్ల విషాదం (A Lesson to All)
The Tragedy behind a Celebrity Marriage
అన్ని పెళ్లిళ్లూ వేడుకలుగానే మిగలవు. కొన్ని వివాహాలు విషాదాలుగా మారి జీవితాంతం వెంటాడతాయి. అలాంటి జీవితమే నటి శాంతి విలియమ్స్‌ది. 12 ఏళ్ల వయసులో తమిళ చిత్రాల్లో బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత అనేక చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు. ‘అపరిచితుడు’ సినిమాలో హీరో విక్రమ్ తల్లి పాత్ర చేసింది ఆమే! తెలుగులో అత్యంత పాపులర్ అయిన ‘మెట్టెల సవ్వడి’(తమిళంలో ‘మెట్టి ఒళి’) సీరియల్‌లో అత్తగారి పాత్ర పోషించి విశేష ప్రజాదరణ పొందారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె చెప్పిన విషయాలివి. ప్రతి స్త్రీ చదివి తెలుసుకోవాల్సిన పాఠాలు.
_ _ _
“తమిళంలో బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన నేను తమిళ, మలయాళ సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ ఉన్నాను. ఒకరోజు నేనే ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు మా నాన్న నన్ను లేపి, నీతో మాట్లాడటానికి ఎవరో వచ్చారని అన్నారు. నేను వెళ్లి చూస్తే ఎవరో ఒక వ్యక్తి బాగా గడ్డం పెంచుకొని, చింపిరి జుట్టు, చిరిగిపోయిన ప్యాంటుతో ఉన్నాడు. చూస్తే పిచ్చోడిలా అనిపించాడు. అతనితో మాట్లాడాలని అనిపించలేదు. అతను మాత్రం సూటిగా “రేపుదయం వాహిని స్టూడియో నైన్త్ ఫ్లోర్‌లో షూటింగ్. నా సినిమాలో నువ్వు నటించాలి” అని చెప్పి పది వేలు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపొయాడు.
నాకూ, మా నాన్నకు చాలా ఆశ్చర్యం. అతనెవరో తెలియదు. సినిమా షూటింగ్ అని చెప్పి డబ్బులిచ్చి వెళ్లాడేంటి అని అనుకున్నాం. మర్నాడు షూటింగ్‌కు వెళ్లాక అక్కడ ఆ పిచ్చివాడు కనిపించాడు. సెట్‌లో లైట్ బాయ్స్ చెప్పాక తెలిసింది ఆయనెవరో! ఆయన పేరు విలియమ్స్. మలయాళంలో చాలా పెద్ద సినిమాటోగ్రాఫర్. ఆయనే సొంతంగా దర్శకత్వం వహించి సినిమా తీస్తున్నారు. నిజం చెప్పొద్దూ, అప్పటికీ ఆయన మీద నాకు మంచి అభిప్రాయం రాలేదు. ఎప్పుడూ ఆయన చేతిలో సిగరెట్ ఉండేది. చింపిరి జుట్టు, గడ్డం, మాసిపోయిన బట్టలు.. ఆ మనిషిని చూస్తేనే నచ్చేది కాదు. కోతిలా ఉన్నాడు అనుకునేదాన్ని.
ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో మా నాన్నకు, అతనికి స్నేహం ఏర్పడింది. అతను రోజూ మా ఇంటికి ఫోన్ చేసేవాడు. అతను మా ఇంటికి వస్తే మా అమ్మ అతనికి ఇష్టమైనవి వండి పెట్టేది. మెల్లగా అతను మా కుటుంబంలో ఒక వ్యక్తిలా మారాడు. నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మా నాన్నతో చెప్పాడు. ఆ విషయం తెలియగానే నేను ససేమిరా అన్నాను. అతను నాకు నచ్చలేదని, అతణ్ని పెళ్లి చేసుకోనని చెప్పాను. పైగా విలియమ్స్‌కి అప్పటికే పెళ్లయి, అతని భార్య విడిపోయింది. ఈ పరిస్థితుల్లో అతణ్ని ఎలా చేసుకోను?
నేను పెళ్లికి ఒప్పుకోలేదని తెలిసి విలియమ్స్ తనున్న హోటల్ పైఅంతస్తుకు వెళ్లి అక్కడి నుండి దూకి చస్తానని బెదిరించాడు. ఆ పరిస్థితిలో మా నాన్న అతనికి నచ్చజెప్పి, నన్ను పెళ్లికి ఒప్పిస్తానని చెప్పి కిందికి తీసుకొచ్చారు. మేము కేరళ నంబూద్రి వర్గం. విలియమ్స్ క్రిస్టియన్. పైగా అతనిది చాలా డిమాండింగ్ స్వభావం. తన మాటే నెగ్గాలన్న గుణం. అతనితో పెళ్లి వద్దని ఎంత చెప్పినా మా అమ్మానాన్నలు వినే స్థితిలో లేరు. మా అక్క వచ్చి ఈ పరిస్థితి గమనించి, వారిని వారించింది. అయినా ఏమీ మారలేదు. మా ఇద్దరికీ రిజిష్టర్ పెళ్లి చేయించారు. నిజం చెప్పాలంటే, నన్ను బలవంతపెట్టి పెళ్లి చేయించారు.
విలియమ్స్ అనే వ్యక్తి నా భర్తగా వచ్చిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. సినిమాలు చేయడం మానేశాను. మాకు నలుగురు పిల్లలు పుట్టారు. ఏ విషయంలోనూ అతని నుంచి నాకు సహాయం అందలేదు. అన్నీ మా అమ్మానాన్నలే చూశారు. విలియమ్స్‌కి కోపం ఎక్కువ. షూటింగ్‌లో ఎవరి మీద కోపం వచ్చినా, ఇంటికి వచ్చి నన్ను కొట్టేవాడు. అతని చేతిలో నేను తిన్నన్ని దెబ్బలు ఏ భార్యా తన భర్త దగ్గర తిని ఉండదు. ఒకసారి సెట్‌లో నన్ను కొట్టి, కారులో పడేసి తాళం వేశాడు. చుట్టూ అందరూ అతణ్ని తిట్టారు. తర్వాత అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ వచ్చి కారు తాళం తీసి నన్ను ఇంటికి పంపించాడు. ఇన్ని జరిగినా అతణ్ని విడిచి వెళ్లాలని ఏరోజూ అనిపించలేదు. మాది సంప్రదాయ కుటుంబం. భర్తే దైవం, చచ్చేదాకా అతనితోనే ఉండాలి అనే పద్ధతిలో నన్ను పెంచారు. అందుకే ఎన్ని ఇబ్బందులు పడ్డా విలియమ్స్‌ని వదలలేదు.
ఒకానొక టైంలో సినిమా తీసేందుకు డబ్బులు కావాలని అడిగాడు. నా పేరు మీద ఒక ఇల్లుంది. దాన్ని తాకట్టు పెడదాం అన్నాడు. మా నాన్నకు తెలియకుండా అలాంటిదేమీ చేయనని చెప్పాను. చివరకు నన్ను బతిమాలి, బెదిరించి ఆ ఇంటిని తాకట్టు పెట్టి రెండు లక్షల అప్పు తీసుకున్నాడు. చివరకు ఆ అప్పు తీర్చలేక కోర్టు ఆ ఇంటిని వేలం వేసింది. నలుగురు పిల్లలు, అమ్మతో కలిసి మేం నడిరోడ్డు మీదకు వచ్చాం. ఆ సమయంలోనూ విలియమ్స్ నుంచి నాకు ఎలాంటి సాయం రాలేదు. కొందరు ఆత్మీయులే నాకు తోడుగా నిలిచి కొత్త ఇల్లు చూసి, కావాల్సిన సామాన్లు అందించారు. నాకు నలుగురు పిల్లలున్నారు. వారికి తిండి పెట్టాలి, చదువు చెప్పించాలి. ఎలా అని ఆలోచించాను. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాను.
1979లో మా పెళ్లి జరిగింది. అప్పటికి నాకు 20 ఏళ్లు. ఆయన పది, పదిహేనేళ్లు పెద్ద. ఆయన మనసులో ఏముందో కానీ, నాకు మాత్రం భర్తతో సంతోషంగా గడపాలి, పిల్లలు ఆయనతో సఖ్యంగా ఉండాలి అనిపించేది. కానీ అదెప్పుడూ సాధ్యపడలేదు. మేమిద్దరం కలిసి ఉన్న సమయంలో ఒక్కటంటే ఒక్క సంతోషకరమైన జ్ఞాపకం లేదు. నేను అతణ్ని పెళ్లి చేసుకోవడం సినిమా రంగంలో ఎవరికీ ఇష్టం లేదు. కానీ ఎవరికీ దాన్ని ఆపే శక్తి లేకపోయింది. ఇదంతా విధిరాత అనిపిస్తోంది. పెద్దల మాటకు ఎదురు చెప్పలేని నా అశక్తత ఇంత దూరం తెచ్చిందేమో? 2003లో ఆయనకు పక్షవాతం వచ్చింది. మంచంపై ఉన్నప్పుడు ఆయనకు అన్ని సేవలూ చేశాను. ఆయనకు నెలకు లక్ష దాకా ఖర్చయ్యేది. నాకొచ్చేదాంట్లో ఆయనకు ఖర్చు చేసేదాన్ని.
2005లో ఆయన మరణించారు. ఆయన మలయాళంలో చాలా పెద్ద సినిమాటోగ్రాఫర్. అందరికీ ఆయన తెలుసు! మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేష్‌గోపి లాంటివారు మా ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. దర్శకుడు ప్రియదర్శన్ తొలి రోజుల్లో మా ఇంట్లో పడుకునేవాడు. వాళ్లంతా మాతో స్నేహంగా ఉండేవారు. కానీ విలియమ్స్ చనిపోయినప్పుడు ఎవరూ రాలేదు. ఆ టైంలో నేను ‘మెట్టెల సవ్వడి’ సీరియల్ చేస్తూ ఉన్నాను. అందులో నా తోటి నటీనటులు, ఇతర బృందం మొత్తం నాకు అండగా నిలిచారు. విలియమ్స్‌కి నచ్చినట్టు క్రైస్తవ పద్దతిలోనే తనని సమాధి చేయించాను.
అయన పోయి ఇరవై ఏళ్లు అవుతోంది. ఆయన లేని లోటు ఇవాళ తెలుస్తోంది. భర్త లేని భార్య జీవితం నరకం. ఆయన మంచంలో ఉన్నా సరే, నేను చూసుకునేదాన్ని. నాకంటూ ఒక తోడు ఉంటే చాలని అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ అవకాశం లేదు.” – – – – విశీ
Share this Article
Ads