ఫేక్ ర్యాంకులతో, ఫేక్ గొప్పలతో అడ్డగోలుగా యాడ్స్ ఇవ్వడం చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలకు అలవాటే… ఎక్కడో చదివి ర్యాంకులు సంపాదించిన వాళ్ల పేరెంట్స్‌కు డబ్బులు ఎరజూపి, తమ పుస్తకాలు చదివారనో, తమ సూచనలు పాటించారనో, అందుకే ర్యాంకులు వచ్చాయనో క్లెయిమ్ చేసుకుని, కొత్తగా పిల్లల్ని చేర్చబోయే పేరెంట్స్ చెవుల్లో పూలు పెట్టడం వాళ్లకు పరిపాటే…
కానీ ఒక విషయానికి మెచ్చుకోవాలి… పిల్లల విజయాల్ని తమ విజయాలుగా ప్రచారం చేసుకోవచ్చు గాక… కానీ ఎప్పుడూ పిల్లల్ని కించపరిచే ప్రకటనలు చేయలేదు… నిజానికి ఒకప్పుడు ఊదరగొట్టినంతగా ఇప్పుడు ప్రచారాలను మరీ ఎక్కువగా ఏమీ ఇవ్వడం లేదు వాళ్లు… ఈ చైనా గాళ్ల అతి పోకడలను మించిపోయింది ఫిట్‌జీ… FITJEE…
ఇది కూడా ప్రకటనలు ఇస్తుంది… కానీ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీస్‌కు మాత్రమే, ఆచితూచి ప్రకటనల్లో కంటెంట్ ప్రిపేర్ చేసేది… అలాంటి పత్తిత్తు కూడా ఇప్పుడు బట్టలు విప్పేసి, నీచమైన స్థాయికి తన ప్రచారాన్ని తీసుకొచ్చింది… కాల మహిమ కాదు, కక్కుర్తి…
Ads
తాజాగా ఓ యాడ్ ఇచ్చారు… అందులో ఓ గరల్ స్టూడెంట్ ఫోటో పెట్టి మరీ పిచ్చి వ్యాఖ్యలకు దిగారు… ‘‘చూశావా, నువ్వు మా సంస్థను వదిలేసి వెళ్లావు… EVIL ఇన్‌స్టిట్యూట్‌లో చేరావు, మా దగ్గరే ఉండి ఉంటే 100 NTA స్కోర్ వచ్చి ఉండేది… (ఈ EVIL గతంలో కోటలో ఉండేది, ఇప్పుడు ఢిల్లీ… FITJEE కి బలమైన పోటీదారు)… మమ్మల్ని వదిలేసి ఆత్మహత్యలకు అడ్డాగా మారిన ఆ సంస్థలో చేరావు… 99.99 NTA స్కోర్‌కు పరిమితమయ్యావ్… మాతో ఉంటే నీకూ 100 స్కోర్ వచ్చి ఉండకపోయేదా..?’’
ఈ యాడ్‌ను జతచేసి ఐఆర్ఎస్ అధికారి కాత్యాయనీ సంజయ్ భాటియా ట్విట్టర్‌లో (ఎక్స్) FITJEE తీరును దులిపేసింది… ఆలోచనాత్మకంగానే ఉంది ఆమె పోస్ట్…
‘‘వాణిజ్య ప్రకటనల్లో కొత్త లోతుకు వెళ్లిపోయారు మీరు… ఒక అమ్మాయి ఫోటో పెట్టి మరీ కించపరుస్తారా..? అదీ వేరే సంస్థలో చేరడం వల్లే దెబ్బతిన్నావని ఎత్తిపొడుస్తారా..? ఇదెక్కడి దారుణం..? ఒక చిన్నపిల్లను ముందుపెట్టి మీ సంస్థ గొప్పలకు పోతోందా..? సిగ్గులేదు… పైగా ఆమె చేరిన సంస్థ ఆత్మహత్యలకు కేంద్రం అని ప్రకటనల్లో పేర్కొనడం మరింత మూర్ఖత్వం…
నిజానికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లలో ఆత్మహత్యలు మొత్తం సమాజానికి ఆందోళనకరమైన ఇష్యూ… మీ ఫాయిదా కోసం వేరే ఇన్‌స్టిట్యూట్లపై సూసైడ్స్ సెంటర్స్ అని ముద్రలు వేస్తారా..? చీప్ టాక్టిస్…
ఇలాంటి ప్రకటనలు విద్యార్థులపై మరింత ప్రెజర్ పెంచుతాయి… ఇదుగో ఇలాంటివే ఆత్మహత్యలకు కారణాలు… అమ్మా, స్మతీ ఇరానీ ఇలాంటివి కాస్త పట్టించుకో అని ఆమెనూ ట్యాగ్ చేసింది…
ఎస్, ఆమె చెప్పిందంతా నిజమే… ఏ సంస్థలో కోచింగ్ తీసుకోవాలనేది ఆ అమ్మాయి, ఆ తల్లిదండ్రుల ఇష్టం… స్కోర్ ఎంత వచ్చినా అది వాళ్ల నిర్ణయ ఫలితం… ఇక్కడి నుంచి వెళ్లిపోయి, అక్కడ చేరిపోవడం వల్లే నువ్వు దెబ్బతిన్నావ్ చూశావా అంటూ ఆ పిల్లను గేలిచేస్తూ, దెప్పిపొడుస్తూ, ఎదుటి సంస్థ పరువును కాలరాస్తూ, తను గొప్పలు పోవడం అనేది FITJEE ప్రచార దౌర్భాగ్యం…
ఎవడు ఎలాంటి ప్రకటనలు ఇచ్చుకున్నా కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు, ఉన్నా పనిచేయదు, పనిచేయాలనుకున్నా చేయనివ్వరు… సో, FITJEE పైత్యానికీ శిక్షలు ఏమీ ఉండవు… సో, సదరు ఐఆర్ఎస్ అధికారిణిలాగే సోషల్ మీడియాలో, ‘ఎక్స్’లో ట్రిపుల్ ఎక్స్ పెట్టి ఉతకడమే మార్గం…!!
Share this Article