ఎందుకలా అనిపించిందో తెలియదు గానీ… వర్జీనియా గ్రేట్ ఫాల్స్ వెళ్లినప్పుడు హఠాత్తుగా ఏడుపాయల, కొండపోచమ్మ తదితర క్షేత్రాలు గుర్తొచ్చాయి… అవేకాదు, చాలాచోట్ల శక్తి స్వరూపిణుల గుళ్లు ఉన్నచోట ఏం చేస్తారు..?
కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సంఖ్యను బట్టి, మొక్కు తీర్చుకునే కుటుంబం రేంజ్‌ను బట్టి మేకనో, కోడినో కసకసా కోసేస్తారు… అక్కడే వండుతారు… దేవతలకు నైవేద్యం… మందు సరేసరి… వండినదంతా అక్కడే అయిపోవాలి… ఒక్క ముక్కలో చెప్పాలంటే అవి స్పిరిట్చువల్ గెట్‌టుగెదర్స్… పుణ్యం, పురుషార్థం, పర్యాటకం అన్నీ…
కాకపోతే మనవాళ్లకు ఓ అరాచకం అలవాటైపోయింది… వ్యర్థాలు ఎక్కడికక్కడ వదిలేస్తాం… ప్రభుత్వం కూడా దొరికిందే సందు అనుకుని లిక్కర్ షాపులు పెట్టేస్తోంది… మిలిటరీ హోటళ్లు, దాబాలు ఏర్పడ్డాయి… ఓ వెహికిల్ ఆగీఆగకుండానే కొందరు పరుగెత్తుకొస్తారు… కోళ్లను, మేకలను అమ్మడానికి… పొతం చేసి ముక్కలు చేసి ఇస్తారు… వండి ఇచ్చే వాళ్లూ దొరుకుతారు… ఎలాంటి టూరిస్ట్ ప్లేసయినా సరే కాస్త జేబుకు కత్తెర పెట్టే వ్యవహారాలే ఎక్కువ…
Ads
ఇటువైపు వద్దాం… అమెరికా… వర్జీనియా రాష్ట్రం… గ్రేట్ ఫాల్స్ పార్కులోని ఫాల్స్… నదీప్రవాహం ఉధృతి బాగానే ఉంది… కానీ ఇదేమీ పెద్ద ఎత్తు నుంచి పడే జలపాతం కాదు… నిజానికి హైదరాబాద్‌కు రెండొందల రేడియస్‌లోనే బోలెడు ఎత్తిపోతలు ఉన్నయ్… ఏక్‌సేఏక్… ఎంతో ఎత్తు నుంచి పడుతుంది ధార… నిండు వర్షాకాలంలో వెళ్తే, చూస్తుంటేనే సంబురం… చాలామంది వెహికిల్స్‌లో వెళ్లి, ఎక్కడో ఓచోట పక్కకు ఆపుకుని, మందూమటన్ గట్రా సుబ్బరంగా ఆరగించి వస్తున్నారు… కాకపోతే వెహికిల్స్‌లోనే వాటర్ బాటిళ్లు సహా అన్నీ తీసుకెళ్తారు… వ్యర్థాలు, ప్లాస్టిక్ గట్రా అక్కడే… మరి ఇక్కడ..?
ఈ గ్రేట్ ఫాల్స్‌ను ఏమాత్రం కమర్షియలైజ్ చేయలేదు వర్జీనియా ప్రభుత్వం… అంతేకాదు, మొత్తం అటవీ వాతావరణం యథాతథంగా ఉంది… ఎడాపెడా చెట్లు నరికేసి, ఐదారు పెద్ద కాంక్రీట్ భవనాలు లేపి, దుకాణాలకు తెరతీయలేదు… ఓ టికెట్ కౌంటర్… పిజ్జా, టీ, కాఫీ, ఏవో స్నాక్స్, ఐస్ క్రీమ్ దొరికే చిన్న కొట్టు… అంతే… ఇక ఆ ఆవరణ మొత్తం టేబుళ్లు, కుర్చీలు బోలెడు… వెళ్లిన పర్యాటకుల్లో కొందరు ఓవైపు ట్రెక్కింగ్‌కు రోజంతా వెళ్లిపోతారు… వాళ్ల పార్కింగు వేరు… జలపాతానికి ఇటువైపు వర్జీనియా, అటువైపు మేరీలాండ్… వాషింగ్టన్ డీసీకి దగ్గరే…
ఇండియన్ టూరిస్టులు గట్రా కేవలం సెల్పీ టూరిజం… కానీ చాలా అమెరికన్ కుటుంబాలు అక్కడికి ట్రక్ కార్లలో, కార్లలో బార్బెక్ ఏర్పాట్లతో వస్తారు… మాంసం, నీళ్లు, ఇతర వంట సామగ్రి తెచ్చుకుని అక్కడే చీకులు కాల్చుకుంటారు… చిన్న స్టవ్వులు గట్రా తెచ్చుకుని అక్కడే వండుకుంటారు… బీర్లు గట్రా ఆ కుటుంబాల ఇష్టం… ఇప్పుడిక సీజన్… ఆ కుర్చీలు కూడా దొరకడమే కష్టం… గంటల తరబడీ చీకులు కాల్చుకుంటూ, సరదాగా ఓ పిక్నిక్‌కు వచ్చినట్టే గడుపుతారు… కారుకు 20 డాలర్ల ఎంట్రీ ఫీజు తప్ప మరే టికెట్టూ లేదు… వెళ్లేటప్పుడు మొత్తం వ్యర్థాలు డస్ట్ బిన్లలో వేసేసి నీట్‌గా వెళ్లిపోతారు… చిన్న కాగితం ముక్క, ప్లాస్టిక్ పేపర్, నమిలేసి వదిలేసిన మటన్ ముక్క… ఏమీ కనిపించవు… అది బాగా నచ్చింది… అక్కడ కొనడానికి ఇంకేమీ దొరకవు కూడా…
అమెరికాలో వీకెండ్స్‌లో ఎక్కడో ఓచోటకు వెళ్లి గడపడం బాగా అలవాటు కదా… పండు ముదుసలి జంటలూ బోలెడు మంది కనిపించారు… సెల్ఫ్ డిసిప్లిన్ టూరిస్టులు… సో, ఈ బార్బెక్స్ ‘బీర్’బెక్స్ చూశాక అనిపించింది… కొండపోచమ్మ గ్రేట్ ఫాల్స్ జిందాబాద్…!!
Share this Article