రాజ్యసభకు మొన్న నేరుగా నామినేటైన సుధామూర్తి… అలియాస్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య, బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ అత్తగారు, రచయిత, మోటివేటర్, సంఘసేవకురాలు సుధామూర్తి.., గుర్తుందా..? ఆమధ్య కునాల్ విజయకర్ అనే ఫుడ్ రైటర్, టీవీ పర్సనాలిటీ చేసిన ‘ఖానే మే క్యా హై’ అనే ఓ ప్రోగ్రాం వీడియోలో మాట్లాడుతూ… ‘‘నేను ప్యూర్ వెజిటేరియన్… గుడ్లు కూడా తినను, అంతెందుకు వెల్లుల్లి కూడా తినను… ఏ దేశమైనా వెళ్తే రెస్టారెంట్లలో వెజ్, నాన్-వెజ్ వంటకాలకూ సేమ్ స్పూన్లను వాడుతుంటారు కదా, అందుకని అవి వాడాలంటే నాకు భయమేస్తుంది… అంత సంప్రదాయవాదిని ఫుడ్ విషయంలో…’’ అని చెబుతూ పోయింది…
అంతే ఇక, ఆమె మీద నెటిజనంలోని ఓ సెక్షన్ విరుచుకుపడింది… సమర్థించినవాళ్లూ ఉన్నారు.,. ఫుడ్ అనేది ఆమె చాయిస్, విమర్శించకూడదనే వర్గం ఒకవైపు… ఫుడ్ మీద మరీ ఇంత ఛాందసమా అని విమర్శించేవారు మరో వర్గం… ట్రోలర్లు ఒకవైపు, సమర్థకులు మరోవైపు… రెండుగా చీలిపోయారు నెటిజనం… ఆమె ఎటైనా వెళ్తే ‘రెడీ టు ఈట్’ ప్యాకెట్లను తీసుకెళ్తుంది తనతో… అప్పటికప్పుడు నీళ్లను మరిగించి, ఈ ప్యాకెట్లలోని పదార్థాన్ని అందులో వేస్తే వంటకం రెడీ… ఎందుకైనా మంచిదని అటుకులు వంటి తేలికరకం సరుకుల్ని కూడా తీసుకెళ్తుంది…
Ads
వీలైనంతవరకూ వెజ్ రెస్టారెంట్ కోసం సెర్చ్ చేస్తుంది, దూరమైనా సరే అక్కడికే వెళ్తుంది… లేదంటే తనతోపాటు తెచ్చుకునే స్వల్ప సరుకులతో తనే వంట చేసుకుంటుంది… ఓ చిన్న కుక్కర్, బ్యాటరీలతో నడిచే ఇండక్షన్ స్టవ్ కూడా తీసుకెళ్తుందని కొందరు నెటిజన్లు వెక్కిరింపులకు దిగితే… మోసుకుపోయేది ఆమె, వండుకునేది ఆమె, మధ్యలో మీ అభ్యంతరాలేమిట్రోయ్ అని సమర్థించేవాళ్లు మరికొందరు…
ఈ చర్చలోకి కొందరు రిషి సునాక్‌ను కూడా లాగారు… రకరకాల వ్యాఖ్యానాలు… ఆమె సింపుల్‌గా ఉంటుంది… ఆడంబరం, అట్టహాసం ఏమీ ఉండవు… ఏ ఫుడ్ తీసుకోవాలనేది ఆమె ఇష్టం… కానీ ట్రోలర్స్‌కు ఇవన్నీ దేనికి..? దొరికింది కదాని ఆడేసుకుంటున్నారు… ఇదంతా చదువుతుంటే కొందరు సంప్రదాయవాదులైన జైనుల కష్టాలు కొన్ని గుర్తొచ్చాయి… జంతువుల పాలను కూడా వాళ్లు స్వీకరించరు… గుడ్లు, నాన్ వెజ్ వాసన కూడా చూడరు… ఏ దేశమైనా వెళ్తే వాళ్లు తమకు అనువైన ఫుడ్ కోసం సాగించే అన్వేషణ ఓ ప్రయాసే… వాళ్లు ఏది పడితే అది తినరు… ఆల్కహాల్ దగ్గరకు రానివ్వరు… చివరకు ఉల్లి, పొటాటో, కేరట్, అల్లం, వెల్లుల్లి కూడా ఉపయోగించరు… తమ ఇళ్లల్లో తప్ప ఇంకెక్కడా వాళ్లు తృప్తిగా భోంచేయలేరు… కానీ తమ అలవాట్లను, సంప్రదాయాల్ని వదులుకోవడానికి కూడా ఇష్టపడరు…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం ఇప్పుడు అంటారా..? జొమాటో తీసుకున్న ఓ నిర్ణయం మీద మళ్లీ నెటిజనం భారీ ట్రోలింగ్ చేస్తోంది… జొమాటో వెజ్ పేరిట ఓ కొత్త విభాగం స్టార్ట్ చేసింది… దీనికోసం వెజ్ ఫ్లీట్ కూడా… అంటే ప్యూర్ వెజిటేరియన్ డిషెస్ మాత్రమే సప్లయ్ చేసే రెస్టారెంట్ల నుంచి మాత్రమే తీసుకొస్తారు… నాన్ వెజ్ డిషెస్ మాత్రమే కాదు, చివరకు హోటళ్లు సప్లయ్ చేసే వెజ్ డిషెస్ కూడా ఈ ఫ్లీట్ తీసుకురాదు… సుధామూర్తి వంటి సంప్రదాయవాదులు కోరుకునే శుద్ధ శాకాహార సౌకర్యం అన్నమాట…
ఇక చూసుకొండి, జొమాటో మీద ఫుల్లు ట్రోలింగ్… వీడు మళ్లీ పాత యుగాల వైపు మనల్ని తీసుకుపోతున్నాడు, కులం బేస్ ఫుడ్ సప్లయ్ ఏమిట్రా అని కొందరు… ఇది మరీ మతవాదం, బ్రాహ్మణవాదం, మనువాదం దాకా వెళ్లిపోయి ఇంకొందరు ఆడేసుకుంటున్నారు… వాళ్లందరూ మరిచిపోయింది ఏమిటంటే..? జొమాటో అనేది ఓ వ్యాపారం… ఫలానా స్పెషలైజేషన్ ప్రవేశపెడితే నాలుగు డబ్బులు వస్తాయి అనుకుంటే ఓ ప్రయోగం చేస్తాడు, క్లిక్ కాలేదంటే క్లోజ్ చేస్తాడు, అంతిమంగా వాడికి కావల్సింది లాభాలు… వాళ్లకు డబ్బే కులం, డబ్బే మతం… పోనీ జొమాటో భాషలోనే చెప్పాలంటే ఫుడ్డే కులం, ఫుడ్డే మతం…!! మరి అల్లం, వెల్లుల్లి వేస్తారా..? ఉల్లిపాయలు వాడతారా..? ఈ సూక్ష్మ రంధ్రాన్వేషణలోకి మనం ఇక్కడ వెళ్లడం లేదు… సెలవు…
Share this Article