అందరికీ గుర్తుంది కదా… పెగాసస్..! ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిన ఈ స్పై వేర్‌ను జర్నలిస్టులు, మేధావులు, ప్రతిపక్ష నేతలు, బ్యూరోక్రాట్లు, ఇతర ముఖ్యుల ఫోన్ల ట్యాపింగ్‌కు మోడీ ప్రభుత్వం వాడినట్టు కదా రచ్చ…! స్పై వేర్ వేరు కావచ్చుగాక, దాదాపు ప్రతి రాష్ట్రమూ ట్యాపింగ్, ఫోన్ కాల్స్ స్పైయింగ్ చేస్తూనే ఉంటుంది…
ఏపీలో కూడా ఈ స్పై పరికరాల కొనుగోలు అంశమే కదా చంద్రబాబు హయాంలోని ఇంటలిజెన్స్ చీఫ్ మెడకు చుట్టుకుంది…! తెలంగాణలో కూడా ప్రజలందరి ప్రొఫైల్స్, జాతకాలు, డేటా మా దగ్గర ఉందని కదా అప్పట్లో ఓ ఐటీ ప్రభుత్వ ముఖ్యుడు ఎక్కడో కామెంట్ చేసింది…! ఇప్పుడు డీఎస్పీ ప్రణీత్‌రావు యవ్వారం రోజూ వార్తల్లో కీలకంగా ఉంటోంది చూస్తున్నారు కదా…
యాగ్జిలరీ ప్రమోషన్‌తో డీఎస్పీగా ప్రమోటైన ఈయన ఓ టీవీ చానెల్ ఆఫీసులో ఓ ఫ్లోర్‌ను అడ్డా చేసుకుని, విచ్చలవిడిగా రాష్ట్రంలోని ముఖ్యుల ఫోన్లను ట్యాప్ చేసి, సంభాషణలన్నీ రికార్డు చేసేవాడని కదా ఆరోపణ… ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు… అసలు తనను కస్టడీకి ఇవ్వడమే అక్రమమని సదరు డీఎస్పీ హైకోర్టుకెక్కాడు… దర్యాప్తులోని అంశాలను అధికారులు మీడియాకు లీక్ చేస్తున్నారని కూడా తన పిటిషన్‌లో ఆరోపించాడు… ఒక ఏఎస్పీ (రమేశ్..?) ఈ విచారణలో సదరు ప్రణీత్‌రావుకు చుక్కలు చూపిస్తున్నాడట… ఆల్‌రెడీ ఇద్దరు సీఐలను ఈ యవ్వారంలోనే అరెస్టు చేశారు…
Ads
అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ (రిటైరైన తరువాత నియమించినట్టున్నారు…) ప్రభాకరరావును రేవంత్ రెడ్డి ఖాసిం రజ్వీ అని ఈమధ్య ఏదో మీడియా మీట్‌లో ఓ ప్రశ్నకు బదులిచ్చాడు… తనే కాదు, తనను ఈ ట్యాపింగ్ యవ్వారాలకు పురికొల్పిన పెద్ద తలకాయల్ని బుక్ చేయాలనే పట్టుదల రేవంత్ రెడ్డిలో కనిపిస్తోంది… అఫ్‌కోర్స్, సర్వర్ సాయం చేసిన సదరు టీవీ చానెల్ యజమాని కూడా ఇరుక్కున్నట్టేనట… తన అరెస్టు సమయంలో కూడా ఆ ఇంటలిజెన్స్ ఉన్నతాధికారే కీలకంగా వ్యవహరించినట్టు రేవంత్ రెడ్డి మండిపోతున్నాడు…
47 హార్డ్ డిస్కులతోపాటు రికార్డింగ్ పరికరాలను మొత్తం డేటా రిట్రీవ్ చేయడానికి వీల్లేకుండా ధ్వంసం చేశారట… వివిధ జిల్లాల్లోని దాదాపు 30 మందితో కూడిన టీం ఈ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారాన్ని నిర్వహించారని సమాచారం… సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో వార్ రూమ్స్‌తోపాటు జుబిలీహిల్స్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఓ సీక్రెట్ వార్ రూం నిర్వహించారట…
నియంతృత్వాన్ని నమ్ముకునే పాలకుడు తన నీడను కూడా నమ్మలేడు… అందుకే కేసీయార్ పాలనలో ప్రజాజీవితంలో ముఖ్యులైన అందరి కదలికలపై, ఫోన్ కాల్స్‌పై, భేటీలపై నిఘా ఉండేది… ప్రణీత్‌రావు నుంచి వస్తున్న సమాచారం పోలీస్ ఉన్నతాధికారులను, ప్రభుత్వ ముఖ్యులనూ విస్తుపోయేలా చేస్తుందంటున్నారు… చివరకు కవిత భర్త, సంతోష్ భార్య, ప్రధాన మీడియా బ్యూరో చీఫ్‌లు, ప్రతిపక్ష ముఖ్యులు, కొందరు బ్యూరోక్రాట్ల ఫోన్లు కూడా ట్యాపయినట్టు ఓ సమాచారం వినిపిస్తోంది… అంటే తనకు సన్నిహితంగా మెలిగే వాళ్ల ఫోన్లనూ కేసీయార్ ఉపేక్షించలేదన్నమాట.,.
దర్యాప్తు సాగుతున్నందున ఇప్పుడు వివరాలేమీ చెప్పలేననీ, ఒక్కసారి దర్యాప్తు పూర్తయ్యాక నేనే స్వయంగా మొత్తం వివరాల్ని మీడియాకు చెబుతానని మొన్నటి ఓ మీడియా మీట్‌లో రేవంత్ రెడ్డి చెప్పాడు… సో, ఈ దర్యాప్తు పూర్తయితే ఇక పెగాసస్‌ను ఎన్నో రెట్లు మించిన ఫోన్ ట్యాపింగ్ యవ్వారం బయటపడనుందన్నమాట..!!
Share this Article