రామరావణ యుద్ధం జరుగుతోంది… రావణుడు రాముడి బాణాలకు నిర్వీర్యుడయ్యాడు… రథం నుండి తూలి భూమి మీదకు పడిపోయిన రావణుడిని చూసి రాముడు “భయంకరమైన యుద్ధం చేశావు రావణా, నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి. నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు, నీ కళ్ళల్లో భయం కనపడుతుంది, నీ ఒంటికి చెమట పట్టింది, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. పోయి ఇవ్వాళ రాత్రి పడుకో, విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు, చేతిలో ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి రా, నా పరాక్రమము ఏమిటో చూద్దువు కాని, ఇవ్వాల్టికి పొ” అన్నాడు…
బీజేపీ నమ్ముకున్న రాముడు ప్రదర్శించిన యుద్ధనీతి అది… మాకు రైలు టికెట్లు కొనేందుకు డబ్బుల్లేవు, పోస్టర్లకు డబ్బు లేదు, 2 రూపాయల ఖర్చుకూ వెసులుబాటు లేదు, ఎప్పుడో సీతారాం కేసరి నాటి లెక్కలు అడుగుతున్నారు… మా ఖాతాలు ఫ్రీజ్ చేశారు… దాదాపు వంద కోట్లు స్తంభించిపోయాయి… వంద శాతం జరిమానాలు వేస్తున్నారు… ఈ స్థితిలో ఈ ఎన్నికల యుద్ధం ఎలా చేయగలం..? బీజేపీ మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది… ఈడీలు, ఐటీలు, సీబీఐలను ఉసిగొల్పి, కంపెనీల నుంచి అడ్డగోలుగా విరాళాలు పొంది, మామీదేమో ఈ కక్షసాధింపా..? అని నిన్న కాంగ్రెస్ అతిరథులు వాపోయిన వార్త చదివితే రామరావణ యుద్ధం, రాముడి యుద్ధనీతి గుర్తొచ్చింది…
Ads
కావచ్చు, ఒక సమర్థన ఉండవచ్చు… రొమాన్స్‌లో, పాలిటిక్స్‌లో (వార్‌లో) ఫెయిర్ అని ఏమీ ఉండదు, సో, కాంగ్రెస్‌ను ఆర్థికంగా దిక్కుతోచని స్థితిలోకి తోసేయడం కూడా యుద్ధచతురతే అనే సమర్థన వినిపించవచ్చుగాక… కానీ యుద్ధం సమస్థాయిలో, సమస్కంధులు, సమఉజ్జీల మధ్య జరగాలి… నిజంగానే బజారులో నిలబడి ఉన్న కాంగ్రెస్ మీద బీజేపీ అస్త్రాలను విసురుతోంది… నిధులు స్తంభింపజేసి, పార్టీ ముఖ్యులను అసహాయులను చేసి, ఇక పోరాడండయ్యా అంటే అది సమస్కంధుల పోరాటం ఎలా అవుతుంది..?
అఫ్‌కోర్స్, రాజకీయ పార్టీ కదా, కాంగ్రెస్‌కూ విరాళాలొచ్చాయి… కానీ చాలా తక్కువ… కేంద్రంలో అధికారంలో ఉండటం, దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి మరీ విరాళాల వేట సాగించడంతో బీజేపీ సాధనసంపత్తి అనూహ్యంగా పెరిగిపోయింది… ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా డీఎంకే వంటి మిత్రపక్షాల మీద ఆధారపడాలేమో… లాటరీ మాఫియా డాన్ మార్టిన్ డీఎంకేకు, టీఎంసీకి బోలెడు డబ్బు ఇచ్చాడు… అదేమిటో గానీ వైసీపికి కూడా 150 కోట్లు ఇచ్చాడు… ఏపీలో వాడి బిజినెస్ ఏమిటో తెలియదు.,. కాంగ్రెస్‌కు వేదాంత వాడు 125 కోట్లు ఇచ్చాడు… తను బీజేపీకి కూడా ఇచ్చాడు, అది వేరే సంగతి… బీజేపీకి ఇవ్వని వాళ్లెవరు అసలు..?
ఇప్పుడు కేసీయార్ సాయం చేయలేడు, చేసేంత సీన్ లేదు, చంద్రబాబేమో బీజేపీ కూటమిలో ఉన్నాడు, తనూ ఇవ్వడు.., టీఎంసీ తన కూటమిలో లేదు, ఆమే ఇవ్వదు… ఆప్ తనే కష్టాల్లో ఉంది… అఖిలేష్, తేజస్వి యాదవ్ తదితరులు కూడా అంతగా డబ్బు ఏమీ ఇవ్వలేరు… హేమంత్ కూడా జైలుపాలయ్యాడు… శివసేనకు బాగానే విరాళాలు వచ్చినా దాని ఖర్చులు దానికే సరి… ఇక కాస్తోకూస్తో డబ్బు సర్దుబాటు తెలంగాణ, కర్నాటక పార్టీ విభాగాల నుంచే జరగాలి… ప్చ్, వేల కోట్ల నిధులతో సర్వసంపత్తితో ఉన్న బీజేపీ ఎదుట ఈ సర్దుబాటు చాలా తక్కువే… నిజమే, రథం విరిగి, విల్లు విరిగి, గుర్రాలు మరణించి, నేలమీద నిరాయుధుడిగా నిలబడి ఉన్నట్టుగా ఉంది కాంగ్రెస్ సిట్యుయేషన్..! అంటే కాంగ్రెస్ రావణుడి వంటి పార్టీ అని కాదు సుమా..! ఒక ఉదాహరణ చెప్పుకోవడం, అంతే..!!
Share this Article