ఈ సినిమా ఎప్పుడొచ్చి పోయిందో గుర్తు లేదు గానీ… సినిమా పేరు సౌండ్ పార్టీ… బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ ఇందులో హీరో… సినిమా ఫ్లాపో, హిట్టో తెలియదు గానీ… బిగ్‌బాస్ పాపులారిటీ నాకు తెలిసి ఏ కంటెస్టెంట్‌కూ పెద్దగా ఉపయోగపడదు… జస్ట్, కొన్నాళ్లు టీవీలో స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో కనిపిస్తారు…
ఆమధ్య సొహెయిల్ వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూశాం కదా… ఈ సౌండ్ పార్టీ సినిమా కూడా సన్నీకి పెద్ద ఫ్లెచింగ్ అవుతుందని అనుకోలేం… సినిమా చూస్తుంటే వింతవింతగా అనిపించింది… సరే, కామెడీ ప్రధానంగా కథ నడపాలని అనుకున్నారు కాబట్టి లాజిక్కులను లైట్ తీసుకున్నారు…
ఏ సీన్ చూసినా… పాత అమృతం సీరియల్, జబర్దస్త్, బిగ్‌బాస్, మరో ఇద్దరు ముగ్గురు కమెడియన్లు కనిపించారు… బిగ్‌బాస్ సన్నీ, ప్రియ, జబర్దస్త్ చలాకీ చంటి, కమెడియన్లు పృథ్వి, ఆలీ, సప్తగిరి, అశోక్ కుమార్ తదితరులు… హీరోయిన్ ఎవరో కొత్త మొహం… అమృతం సీరియల్‌లోని మరో ప్రధాననటుడు ‘సర్వం’ కూడా ఉన్నాడిందులో… నటీనటుల ఎంపిక బాగానే ఉంది… కానీ మరీ బిట్‌కాయిన్ అంటే ఇప్పుడు తెలియనివాళ్లు లేరు… క్రిప్టోకరెన్సీని లిక్విడ్‌గా చూపించడం, దాని బేస్‌గా సీన్లు నడవడం, మరీ మైక్రోస్కోప్‌తో కాయిన్ల తయారీ వంటి అంశాలతో కామెడీ వర్కవుట్ కాకుండా పోయింది…
Ads
ఇతరత్రా కామెడీ సీన్లలో కూడా పెద్ద పంచ్ లేకపోవడంతో సినిమా పెద్దగా నవ్వు పుట్టించలేదేమో గానీ… ఈ సినిమాలో ఓ పాత్రధారి గురించి చెప్పుకోవాలి ఓసారి… సో, ఇది ఆ సినిమా సమీక్ష ఏమాత్రం కాదు… ఇప్పుడు సమీక్షలూ అవసరం లేదు… నిర్మాత, దర్శకుల ఎఫర్ట్ బాగానే ఉన్నా, ఏదైనా వేరే కథ, లైన్ మీద కష్టపడి ఉంటే ఇంకా మెరుగైన ఫలితం వచ్చి ఉండేదేమో…
ఆ పాత్ర పేరు కేకే… కుబేర్ కుమార్… సినిమాలో హీరోకు తండ్రి పాత్ర… ఆయన పేరు నరిపెద్ది శివన్నారాయణ… అప్పట్లో సూపర్ హిట్ కామెడీ సీరియల్ అమృతం గుర్తుంది కదా, అందులో అప్పాజీ పాత్ర… ఇప్పటికీ యూట్యూబ్‌లోని ఆ సీరియల్ చూస్తుంటారు ప్రేక్షకులు… ఆ సీరియల్‌లో ముఖ్యమైన పాత్ర… సూపర్ కామెడీ టైమింగ్… దాంతోనే ఆయన టీవీ సీరియళ్లు, సినిమాల్లో బిజీ అయిపోయి బీఎస్ఎన్‌ఎల్ కొలువు కూడా వదిలేసినట్టు గుర్తు… థియేటర్ అనుభవమూ ఉంది… కానీ 20 ఏళ్లుగా ఫీల్డ్‌లో ఉన్నా సరే, మంచి నటన ఉన్నా సరే, తనకు దక్కాల్సినంత పేరు, పాత్రలు దక్కలేదేమో అనిపించింది… పేరుకు వంద సినిమాలు చేశాడట కానీ ఈ సినిమాతోనే హైలైట్ అయినట్టున్నాడు ఎంతోకొంత…
సౌండ్ పార్టీలో నిజానికి సినిమాను సగం మోసింది తనే… మంచి టైమింగ్… హీరోకూ తనకూ నడుమ తండ్రీ కొడుకుల కెమిస్ట్రీ కూడా బాగా పండింది… మిగతావాళ్లు బాగా చేయలేదని కాదు, ఈ అప్పాజీ మాత్రం ఇరగదీశాడు… అమ్మమ్మడాట్‌కామ్, మంగతాయారు వంటి సీరియల్స్ తనకు కొంత పేరు తీసుకొచ్చినా సరే, సినిమాల్లో తనకు ఇంకా మంచి పాత్రలు వచ్చి ఉండాల్సిందేమో అనిపిస్తుంది..!! (భూతద్దం భాస్కర నారాయణలో చేస్తున్నట్టున్నాడు)…
Share this Article