సంపాదించుకున్న మంచి పేరు పోవడానికి, సమాజానికి మొహం చూపించుకోలేని స్థితికి రావడానికి ఏదో ఒక్క సంఘటన చాలు… ఏసీబీ వలలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిందనే ఫోటో, వార్త చూశాక అదే ఆశ్చర్యమేసింది… మంచి సమాజ సేవికగా, మంచి మనస్సున్న అధికారిణిగా సోషల్ మీడియాలో, మీడియాలో బాగా పాపులరైన ఆమె ఒక్కసారిగా అథఃపాతాళానికి పడిపోయినట్టుగా ఉంది…
అఫ్ కోర్స్, అవినీతి వ్యవహారాలు ఉన్నవాళ్లు ఆ సంపాదనను పది మందికీ పంచకూడదని, మంచి మనస్సు ఉండకూడదని ఏమీ లేదు… కాకపోతే ఆమె ఏం చేసినా చప్పట్లు కొట్టిన ప్రజలు ఇకపై మనస్పూర్తిగా అభినందించలేరు… ఓహో, ఈమె కూడా అందరు ప్రభుత్వ అధికారుల్లాంటిదేనా అనే ఓ విముఖత కనిపిస్తుంది… అది భరించడం కష్టం…
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది కాబట్టి… ఇదేదో కుట్ర అనో, తప్పుడు కేసు అనో సమర్థించుకోవడానికి కూడా అవకాశం లేదు… ఇదుగో ఫోటో… పట్టుబడిన ఈమె ఆ తస్లీమానేనా అని మొదట జర్నలిస్టులు కూడా నమ్మలేదు… వాట్సప్ వార్త ఇదుగో… ‘‘రూ. 19 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ. 1,78,000 తీసుకున్న అమౌంట్ ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..’’
Ads
సోషల్ మీడియాలో తస్లీమక్క సేవాదళ్, తస్లీమా అక్క అభిమాన సైన్యం వంటి పేజీల్లో, ఆమె సొంత వాల్‌పై కూడా చాలా ఫోటోలు, పోస్టులు కనిపిస్తూ ఉంటయ్… మానవతామూర్తి తస్లీమా అక్క ఔదార్యం, పొలాలకు వెళ్లి నాట్లు వేస్తూ, కూలీలతో కలిసి పొలం గట్లపైనే భోజనం చేస్తూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటున్న దృశ్యం, మూగజీవాలకు ఆహారం అందిస్తున్న తస్లీమా అక్క, అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుకు చేయూత, నిరుపేద కుటుంబాలకు సాయం… ఇలాంటి ఫోటోలు, వార్తలు ఎన్నెన్నో రీసెంటు పోస్టుల్లో కూడా కనిపిస్తాయి…
ఇది ఆమెపై మొన్నటి ఫిబ్రవరిలో సాక్షి దినపత్రక ప్రచురించిన ప్రత్యేక కథనం… తన తండ్రి పేరుతో సర్వర్ చారిటబుల్ ట్రస్టు అండ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సమాజసేవ చేస్తుంటుంది… నిజంగా అవినీతి, అక్రమాలతో కుళ్లిపోయిన ప్రభుత్వ వ్యవస్థలో సేవాగుణం ఉన్న ఓ మంచి మనస్సు కనిపించడం అభినందనీయం అనే ప్రశంసలే ఆమెకు దక్కుతూ ఉండేవి ఇన్నాళ్లూ.,.
చాలా కుటుంబాల్లో పెద్ద దిక్కుగా ఉన్నవారు చనిపోతే అంత్యక్రియలకు డబ్బులిచ్చి సాయం చేసేది… కరోనా సమయంలో వందలాది కుటుంబాలకు నిత్యావసర సరుకులను సప్లయ్ చేసింది… ఆమె ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింది… ఒక మనిషిగా పదిమందికీ మంచి మనస్సుతో సాయం చేసే గుణం నిజానికి మెచ్చదగిందే… కానీ హఠాత్తుగా ఆమె అవినీతి రెడ్ హ్యాండెడ్‌గా బయటపడిపోయి ఇన్నాళ్లూ సంపాదించిన మంచి పేరుకు ఇక తుడవలేని మరక అంటినట్టయింది… చాలామంది కన్నీటిని తుడిచే పేరున్న ఆ చేతులు ఏసీబీ ట్రాప్‌లో దొరికి ‘ఎర్రగా’ వికారంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు..!!
Share this Article