కేజ్రివాల్ విజువల్ పర్సన్, విజన్ ఉన్న పర్సన్, సీ, లుకింగ్, బ్రైట్ లాంటి విజువల్ పదాలు ఆయన మాటల్లో తరచూ వినిపిస్తాయి. ఆయన కంటి కదలికలు, చేతుల కదలికలు కూడా అదే విషయాన్ని ధ్రువపరుస్తాయి. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు ఆయన మొదట ఎడమవైపు పైకి చూసి తర్వాత నేరుగా చూస్తారు. అంటే ఆయన తన జ్ఞాపకాలు, అనుభవాల్లోంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించి మాట్లాడుతున్నారని అర్ధం. అంతేకాదు ఆయన నిజాన్నే మాట్లాడుతున్నారని ఈ కంటి కదలికలు చెబుతాయి. కంటి కదలికలు కుడి వైపు పైకి ఉంటే ఏదో క్రియేట్ చేసి చెప్తున్నారని అర్ధం.
నాకు నచ్చిందే చేస్తాను….
కేజ్రీవాల్ సంప్రదాయ రాజకీయ నాయకులకు పూర్తిగా భిన్నమైన నాయకుడు. తన ఉపన్యాసాలతో అదరగొట్టడు, అలివికాని హామీలతో మభ్యపెట్టడు. సామాన్యుడిలో సామాన్యుడిలా వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాడు.
తాను నమ్మిన విలువల పరిరక్షణ కోసం పోరాడతాడు. నిజమైన ప్రజా సేవకుడిగా పనిచేస్తాడు. అందుకేనేమో తమ పార్టీ గుర్తుగా చీపురు ఎంచుకున్నాడు. అయితే అరవింద్ పైకి కనిపించేటంత ప్రజాస్వామ్య నాయకుడు కాదని ఆయన బాడీ లాంగ్వేజ్ చెబుతుంది. ఆయన మాట్లాడేటప్పుడు తరచుగా చూపుడువేలు చూపించి మాట్లాడతాడు. అలాగే అరచేతిని కిందకు ఉంచి మాట్లాడతాడు. వీటిని బట్టి ఆయన ఆథారిటేటివ్ నాయకుడని చెప్పవచ్చు. అంటే ఎవరేం చెప్పినా తాను అనుకున్నదే చేయడం, తాను చెప్పిందే మిగతావారు వినాలనే తత్వమన్నమాట. జనలోక్పాల్ బిల్లు కోసం హజారేతో కలిసి ఉద్యమించినప్పటికీ, రాజకీయ పార్టీ స్థాపన విషయంలో ఆయనతో విభేదించడానికి కూడా ఈ నాయకత్వ లక్షణమే కారణమని చెప్పవచ్చు. అయితే విజన్, ఫోకస్ ఉన్న నాయకుడు కాబట్టి తన పార్టీని సమర్ధంగా, విజయపథంలో నడిపించగలిగాడు.
Ads
ప్రొయాక్టివ్ పర్సన్…
అరవింద్ ప్రొయాక్టివ్ వ్యక్తిత్వమున్నవాడు. సమస్యలు వచ్చినప్పుడు వాటిపై స్పందించడం కాకుండా, సమస్యలను ముందే గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాడు. తాను చేస్తున్నది మంచో చెడో నిర్ణయించుకునేందుకు తన అంతర్వాణినే ఆధారంగా తీసుకుంటాడే తప్ప ఇతరుల వ్యాఖ్యలను పట్టించుకోడు. ఒత్తిడి ఎదురైనప్పుడు తానే భరిస్తాడు, పెద్దగా బయటకు వ్యక్తం చేయడు. ఏ విషయంపైనైనా ఎదుటివారిని ఒప్పించేందుకు అనేక ఉదాహరణలు వివరిస్తాడు. తన సహచరుల స్పందనలు, ప్రజల ప్రతిస్పందనలు ఆధారంగా నిర్ణ యాలు తీసుకుంటాడు. జయాపజయాలకు తానొక్కడినే బాధ్యుడినని అనుకోడు. తన జట్టుతోపాటు పరిస్థితులు కూడా కారణమని ఒప్పుకుంటాడు. గతం, వర్తమానం కంటే భవిష్యత్తు గొప్పగా, మెరుగ్గా ఉండేందుకు సహకరించేలా నిర్ణ యాలు తీసుకుంటాడు.
ప్రజల కోసం… ప్రజల మనిషిగా…
ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించాకనే కేజీవాల్ ప్రజాసమస్యను పట్టించుకుంటున్నాడనుకుంటే పొరపాటే. అంతకు ముందే… తాను ఇవ్కం టాక్స్ అధికారిగా ఉన్నప్పుడే ప్రజా సమస్యలపై పోరాడారు. ప్రజలకు సమాచార హక్కు ఉంటే చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చని విశ్వసించారు. ఆ హక్కు కోసం ఉద్యమించారు, సాధించారు. రామన్ మెగనస్సే అవార్డును అందుకున్నారు. ప్రస్తుత రాజకీయాలు, రాజకీయ పార్టీలను నేను వ్యతిరేకిస్తున్నాను… రాజకీయాలు నాకు సహనాన్ని నేర్పాయి… సిద్ధాంతపరంగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక్కటే… ఢిల్లీలో మా విజయం ప్రజల విజయమే… ఇవన్నీ కేజ్రీవాల్ మాటలే, వర్తమాన రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలనే సమున్నత లక్ష్యంతో ఆయన స్థాపించిన ఆమ్ ఆద్మీపార్టీ సంచలనాలు సృష్టించింది… మరిన్ని సంచలనాలు సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. …. సైకాలజిస్ట్ విశేష్, 8019 000066 psy.vishesh@gmail.com
(ఇది దాదాపు పదేళ్ల క్రితం కేజ్రీవాల్ తత్వం, వ్యవహార ధోరణి మీద సైకాలజిస్టు విశేష్ రాసిన విశ్లేషణ… అలాంటి వ్యక్తి ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి, అరెస్టయి చివరకు తీహార్ జైలుకు వెళ్తున్నాడు…)
Share this Article