కేవలం విపక్ష పార్టీల మీదకే ఈడీలు, ఐటీలు, సీబీఐలను ఉసిగొల్పి, అరెస్టులు చేయించి, బీజేపీ ఏకపక్ష న్యాయాన్ని అమలు చేస్తోందనీ, తన పార్టీలో చేరితే హఠాత్తుగా సచ్చీలురైపోతున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా ఉన్నవే… పోనీలే, అలాగైనా కొంతమంది అక్రమార్కులు బయటపడుతూ కటకటాల వెనక్కి చేరుతున్నారు కదానే అల్ప సంతోషం కొందరిది…
హేమంత్ సోరెన్ అరెస్టు… కేజ్రీవాల్ అరెస్టు… కవిత అరెస్టు… ఈ వార్తల నడుమ మరో ముఖ్యమైన పరిణామం పెద్దగా ఫోకస్‌లోకి రాలేదు… అది డీఎంకేకు సంబంధించి…! టూజీ స్కాం తెలుసు కదా… 1.76 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రాకుండా పోయింది… చిన్న విషయం కాదు… కల్‌ప్రిట్స్ ఎవరు..? కరుణానిధి బిడ్డ కనిమొళి, డీఎంకే నాయకుడు రాజా… ఇద్దరూ కొన్నాళ్లు జైలులో ఉన్నారు, తరువాత ట్రయల్ కోర్టు వాళ్లను నిర్దోషులుగా వదిలేసింది… జరిగి ఆరేడేళ్లయింది…
జయలలిత మరణం తరువాత శశికళను తొక్కడం మీదే కాన్సంట్రేట్ చేసిన బీజేపీ, అన్నాడీఎంకేతో జతకూడింది గానీ డీఎంకేను తొక్కే ప్రయత్నం ఏమీ చేయలేదు… అంత భారీ స్కాం జరిగితే బాధ్యులను శిక్షించలేని వ్యవస్థ మనది… ఒక జాతిగా తలవంచుకునే వైఫల్యం… ఏదో నామ్‌కేవాస్తే 2018లో ట్రయల్ కోర్టు తీర్పు మీద ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది సీబీఐ గానీ… తరువాత ఏ కదలిక లేదు, సీబీఐ కూడా లైట్ తీసుకుంది… మోడీ ఏ కారణంతో డీఎంకేను ఉపేక్షించాడో, దాని వెనుక మర్మమేమిటో ఎవరికీ అంతుపట్టలేదు…
Ads
కాంగ్రెస్ కూటమిలో బలమైన ప్రాంతీయ పార్టీ డీఎంకే మాత్రమే… పైగా డీఎంకే అరాచకవాదం ఎప్పుడూ డేంజరసే… మొన్నామధ్య స్టాలిన్ కొడుకు ప్రేలాపనల్ని కోర్టు కూడా తప్పుపట్టింది… టూజీ స్కాం ప్రధాన నిందితుడు రాజా కూడా అసలు ఇండియా దేశమే కాదన్నాడు… ఒక భాష లేనిది ఒక దేశం ఎందుకవుతుంది నాన్సెన్స్ అనే కూతలకూ దిగాడు… మా బాట మేం చూసుకుంటాం అన్నాడు… రెండేళ్ల క్రితం కూడా రాజా, మరికొందరు నేతలు మరీ విపరీత వ్యాఖ్యలకు దిగారు…
‘‘ఇప్పటివరకూ మా ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నా బాటలో నడుస్తున్నాడు… మాకు గనుక స్వయంప్రతిపత్తి ఇవ్వకపోతే పెరియార్ మార్గంలోకి వెళ్లాల్సి వస్తుంది… మోడీకి ఇదే నా సూచన…’’ అని బహిరంగంగా హెచ్చరించాడు రెండేళ్ల క్రితం… (అంటే ద్రవిడనాడు పోరాటం అని సదరు రాజా అభిప్రాయం)…
రాజా కోరుతున్న ప్రత్యేక ప్రతిపత్తి ఏమిటి..? మొన్నమొన్నటిదాకా కశ్మీర్‌కు ఉన్నట్టు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రధాని ఎట్సెట్రా కావాలా..? లేక మొత్తం దేశాన్నే చీల్చి ద్రవిడనాడు ఏర్పాటు చేయాలా..?
ఇదే డీఎంకే కూటమి సభ్యపార్టీ విడుదలై చిరుతైగల్ కచ్చి… సింపుల్‌గా వీసీకే… ఈ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వన్ని అరసు అదే మాట అంటున్నాడు… ఎక్కడో బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘ప్రత్యేక తమిళదేశమే శరణ్యం… దానికోసం సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ పోరాడదాం, వచ్చే ఆగస్టు 17 వరకూ ఇక ఇదే ఉద్యమం…’’ అన్నాడు… సనాతన ధర్మ వ్యతిరేక పోరాటానికీ, ప్రత్యేక దేశ పోరాటానికీ లంకె ఏమిటి..? ఏమో, స్టాలిన్ మాత్రమే చెప్పాలి… ఎందుకు స్టాలిన్ చెప్పాలీ అంటే… రాజా తన పార్టీ కీలక నాయకుడు… వీసీకే తన మిత్రపార్టీ… అసెంబ్లీలో నాలుగు సీట్లలో గెలిచింది పార్టీ…
ఆల్‌రెడీ లోకసభలో కూడా ఓ సీటుంది దానికి… ఈ పార్టీలో మొదటి నుంచీ ఎల్టీటీఈ ప్రభాకరన్ ఆరాధకులు… సమర్థకులు… (అంతెందుకు, ఇదే డీఎంకే కూడా అంతేకదా…) శ్రీలంక సైన్యం, టైగర్ల నడుమ హోరాహోరీ నడుస్తున్న కాలంలో ఈ పార్టీ ఇతర పార్టీలను తోడేసుకుని Tamil Eelam Supporters Organization పేరిట ప్రదర్శనలు నిర్వహించింది… అలాగని ఇది అంత స్థిరంగా ఒకే కూటమికి అంటిపెట్టుకుని ఉండే రకమేమీ కాదు… ఇది చదవండి, అర్థమవుతుంది…
1) TMC : (VCK Party First Election 1999-2001)
2) DMK–BJP : (NDA) (2001-2004)
3) VCK – Makkal Koottani : (2004-2006)
4) AIADMK (Democratic People Alliance) : (2006-2009)
5) DMK–Congress (UPA) : (2009-2014) & (2017-2021)
6) DMK (DPA) : (2014-2015)
7) Makkal Nala Koottani (2015-2016)
8) DMK (SPA) : (2021-Present)
అటు రాజా, ఉదయనిధి, వీసీకే వ్యాఖ్యలు… మరోవైపు డీఎంకే మంత్రుల అవినీతి… (ఇద్దరు మంత్రులు జైళ్లో ఉన్నారు)… ఐనాసరే మోడీ మరోవైపు సీబీఐ చేతులు కట్టేసింది దేనికి..? ఈ ప్రశ్నకు ఇన్నాళ్లూ జవాబు లేదు మోడీ దగ్గర… ఇప్పుడు తాపీగా, తాజాగా ఎన్నికల ముంగిట్లో… సీబీఐ మళ్లీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది… రాజా, కనిమొళితోపాటు అప్పటి టెలికాం సెక్రెటరీ, రాజా ప్రైవేటు సెక్రెటరీ, యూనిటెక్ ఎండీ, అనిల్ అంబానీ కంపెనీ (RADAG)కి చెందిన ముగ్గురు ఉన్నత స్థాయి అధికారుల్ని వదిలేయడం మీద అప్పీల్ చేసింది… హైకోర్టు దీని విచారణకు అంగీకరించింది… అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది కదా..!!
Share this Article