ముందుగా ఓ తాజా వార్త చదవండి… ‘‘మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ తన స్టాండ్‌ను మార్చుకుని, భారతదేశం మాల్దీవులకు అత్యంత సన్నిహిత మిత్రుడు అని చెప్పాడు, మొహమ్మద్ ముయిజ్జూ ఇప్పుడు PM మోడీ నుండి రుణ విముక్తిని కోరుతున్నాడు, మాల్దీవులు గత సంవత్సరం చివరినాటికి భారతదేశానికి 400.9 మిలియన్లు బకాయిపడింది… మాల్దీవులకు సహాయం అందించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది, అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేసింది…” అని అతను భారతదేశాన్ని ప్రశంసించాడు…
మాల్దీవులు ఓ దీవి… తిప్పికొడితే ఉప్పల్, బోడుప్పల్ జనాభా అంత కూడా ఉండదు… 5 లక్షలు… హాఫ్ ఫీట్ సముద్ర మట్టం పెరిగితే దేశమే కనిపించదు… దానికి ఇండియా దాదాపు 3300 కోట్లకు పైగా ఇచ్చింది… అదీ ఇప్పటివరకూ ఆ దేశం తీర్చలేదు… కానీ ఎప్పుడైతే చైనా ఆ కొత్త ప్రభుత్వాన్ని దువ్వడం ప్రారంభించిందో అప్పటి నుంచీ ఆ మంత్రులకు, అధ్యక్షుడికి హఠాత్తుగా కళ్లు నడినెత్తికి ఎక్కాయి… అంతటి చైనాయే మాకు మిత్రదేశం అవుతోంది, ఇక మాకేం తక్కువ అనుకుని విర్రవీగారు…
Ads
మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నామనే సోయి, ఏ దేశాన్నయినా ఏదైనా డిమాండ్ చేయవచ్చుననే భావన కలిగింది… భారత ప్రభుత్వంతో రెటమతం పోకడ స్టార్టయింది… మన విదేశాంగ శాఖ ఓ ఝలక్ ఇవ్వాలనుకుంది… ఏకంగా ప్రధాని మోడీ లక్షద్వీప్ వెళ్లి, సముద్ర తీరాన కుర్చీ వేసుకుని కూర్చుని, తనకు సహజమైన రీతిలో ఫోటో ఫోజులు ఇచ్చి, లక్షద్వీప్ టూరిజానికి మద్దతుగా వ్యాఖ్యలు చేశాడు… అసలు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థే టూరిజం… అందులోనూ ఇండియన్ టూరిస్టులు ఎక్కువ… (ఒక ప్రధాని ఒక అడుగు తీసి అడుగు వేస్తే దాని వెనుక ఓ లెక్క ఉంటుంది… ఆ లక్షద్వీప్ ఫోటోల వెనుకా ఓ మర్మం ఉంటుంది… ఉంది…) కుర్చీ వేసుకుని కూర్చోవడం అంటే, అవసరమైతే కుర్చీ మడత పెడతామని చెప్పడం..!
మోడీ చురకతో ఆ ప్రభుత్వ ముఖ్యులకు ఎక్కడో సెగ తగిలింది… నోటికొచ్చినట్టు ప్రేలాపనలకు దిగారు… దీంతో చైనా ఆ అధ్యక్షుడిని తమ దేశానికి పిలిచి ఆలింగనం చేసుకుంది… అది ధృతరాష్ట్ర కౌగిలి అనే విషయం శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌కు, ఇప్పుడిప్పుడే పాకిస్థాన్‌కు కూడా తెలుస్తోంది… కానీ మాల్దీవులకు కొత్త కదా… మా దేశం నుంచి ఇండియా బలగాలు, హెలికాప్టర్లు వగైరా వెళ్లిపోవాలన్నాడు… చైనా యుద్ధ నౌకకు ఆశ్రయం ఇచ్చాడు… ఈలోపు ఇండియన్ టూరిస్టులు దాన్ని బహిష్కరించసాగారు…
అలాంటి మాల్దీవుల అధ్యక్షుడు హఠాత్తుగా మాటమార్చి, భారతదేశం నా మిత్రదేశం అని పల్లవి మార్చగానే… ఏదో కళ్లు తెరుచుకున్నాయనీ, కనువిప్పు కలిగిందనీ, చైనా నిజస్వరూపం కనిపించిందని ఏమీ కాదు… ఇండియా గనుక తన రుణం తిరిగి చెల్లించాలని ఒత్తడం స్టార్ట్ చేస్తే పరిస్థితులు ఎలా మారతాయో తెలుసు… ఇండియా చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణ, కంప్లిషన్ ఆగిపోతే సిట్యుయేషన్ ఏమిటో తెలుసు… అందుకే ఈ ధోకేబాజ్ మాటలకు దిగాడు… ముయిజ్జా మారడు… భారత విదేశాంగ శాఖకు కూడా తెలుసు అది… అందుకే మాల్దీవులను దాని గతికి దాన్ని వదిలేసి, లక్షద్వీప్‌ను బలమైన సైనిక స్థావరంగా మార్చే పనిలో పడింది ఇండియా… తూర్పు వైపు ఎలాగూ అండమాన్ నికోబార్ దీవుల్లో మనవి బలమైన స్థావరాలు..!
Share this Article