ఎన్నికలు వచ్చాయంటే జ్యోతిష్కులకు ఫుల్ గిరాకీ… పైకి ఏం చెప్పినా చాలామంది నాయకులు నామినేషన్ల దగ్గర నుంచి ప్రచారం ప్రారంభం, ముగింపు దాకా మంచి ముహూర్తం చూపించుకుని గానీ కదలరు… వీలయితే ఆలోపే ఏదైనా మంచి యాగమో, పూజో చేయించుకుంటారు… పార్టీలో సెకండ్ కేడర్ కాదు, సాక్షాత్తూ పార్టీల అధినేతలకే ఈ నమ్మకాలు ఎక్కువ… మంచి ముహూర్తంలో పని మొదలు పెట్టడం మంచిదే… అందులో ఎవరికీ పెద్ద అభ్యంతరం ఏమీ లేదు గానీ… తమిళనాడులో ఓ జ్యోతిష్కుడు దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకుపోయాడు… అంతే మరి, ఏదైనా కొత్తగా చేస్తే తప్ప సంప్రదాయ జ్యోతిష్కులను విడిచిపెట్టి మనవైపు రారు కదా… అందుకే… రాజకీయ జ్యోతిష్యాన్ని కొత్త పంతులు తొక్కిస్తున్నాడు… ఆగండాగండి, ఎవరో నామ్కేవాస్తే కోన్‌కిస్కా గొట్టం జ్యోతిష్యుడేమీ కాదు… మన తెలుగు రీడర్లకూ కాస్త పరిచయస్తుడే… ఎలాగంటే..?
ఇదేమిటి..? ఎవరీయన..? జ్యోతిష్కుడంటే ఆ లుక్కు, ఆ డ్రెస్సు గట్రా వేరే ఉండాలి కదా… ఎహె, ఈయనేం జ్యోతిష్కుడు అనకండి… న్యూ ట్రెండ్… ఈయన పేరు బాలాజీ హసన్… (ఎస్, ఎస్, కమల్ హాసన్ ఇంటిపేరే…) తనది సేలం… ఇంజనీరింగ్ చదివాడు, ఎంచక్కా ఆ కొలువే చేసుకుంటాడు… కానీ ఆసక్తి కొద్దీ జ్యోతిష్యానికి సంబంధించి పుస్తకాలు చదివి, కొందరు గురువుల దగ్గర చేరి కాస్త విద్య నేర్చుకున్నాడు… గత వరల్డ్ కప్ క్రికెట్ సమయంలో తను చెప్పింది చెప్పినట్టు జరగడంతో తన పేరు మారుమోగిపోయింది… నిజంగానే న్యూజిలాండ్ దూకుడు, ఆ కేన్ విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్రతిభ గురించి బాలాజీ జోస్యం చెబితే మొదట్లో ఎవరూ నమ్మలేదు… తరువాత కొన్ని జోస్యాలు కూడా నిజమయ్యాయి… శశికళ జైలుపాలయ్యాక పన్నీర్ సెల్వం సీఎంగా నిలబడబోడనీ, పళనిస్వామి ఆ కుర్చీ ఆక్రమిస్తాడని చెప్పింది తనే… అందరూ నవ్వారు, కానీ నిజమైంది… ఇలా తను రెగ్యులర్ జ్యోతిష్కుడైపోయాడు… అది తన కథ…
Ads
మరి తాజా సంగతేమిటీ అంటారా..? తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నయ్ కదా… రేపోమాపో షెడ్యూల్ కూడా రాబోతోంది… అటు బీజేపీ సపోర్ట్ ఉన్న అన్నాడీఎంకే, ఇటు కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న డీఎంకే కూటమి హోరాహోరీ పోరు తప్పదు… మధ్యలో శశికళ… బాలాజీ హసన్ ఏం చేస్తున్నాడంటే… ఈ పార్టీల టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకుంటారు కదా… పార్టీలు కూడా దరఖాస్తులు స్వీకరిస్తాయి… అయితే ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జాతకవివరాలు పంపిస్తే, తగిన సొమ్ము కూడా పంపిస్తే… జాతకాన్ని బట్టి ఏ తేదీన దరఖాస్తు సమర్పించాలో తను సూచిస్తాడట… అన్నాడీఎంకే వాళ్లకు 24వ తేదీ నుంచి మార్చి 5 వరకూ చాన్స్… అలాగే డీఎంకే వాళ్లకయితే రేపు 17 నుంచి 24 వరకు చాన్స్… శశికళ పార్టీకి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు కదా, తరువాత వాళ్లకూ టైమిస్తాడు… ‘లాస్ట్ ఎంపీ ఎన్నికల్లో నేను చెప్పినవి 80 శాతం నిజమయ్యాయి తెలుసు కదా’ అంటూ ‘రండి బాబూ రండి’ అంటున్నాడు… ష్, మళ్లీ గట్టిగా ఎక్కడా అనకండి… దేవుడు లేడు, దెయ్యం లేడు, ఈ పూజలు, ఈ జాతకాలు హంబగ్ అని ఈసడించుకునే ద్రవిడ పార్టీలు ఇప్పుడు ఆ భావజాలంలో లేవు… ఏ పుట్టలో ఏ పాముందో అనుకునే సందిగ్ధ హేతువాదులే వాళ్లలో ఎక్కువయ్యారట… ఎక్కువగా ‘‘జై వెంకటేశ్వరా నాస్తిక సమాజం’’ బాపతేనట…! అందుకే బాలాజీ హసన్‌కు కొద్దిరోజులుగా గిరాకీ బాగానే ఉందిట…!
Share this Article