మా చంద్రబాబు మోడీ ఎదుట ఎందుకు మోకరిల్లాల్సి వచ్చిందీ అనే వివరణ ఇచ్చుకోవడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ సుదీర్ఘమైన ‘కొత్త పలుకు’ రాయాల్సి వచ్చింది… రాజీపడకపోతే ప్రాంతీయ పార్టీల నేతలందరూ దెబ్బతినిపోతున్నారు అని బోలెడు ఉదాహరణలూ ఇచ్చి, మోడీ రాజసూయ యాగం చేస్తున్నాడు అని ముక్తాయించాడు… సో, చంద్రబాబుకు తప్పలేదు అని తేల్చేశాడు…
అంతేకాదు, మోడీ వ్యక్తిపూజ దేశంలో, బీజేపీలో ఎక్కువైందీ, గతంలో ఇందిరాగాంధీ కూడా ఇలాగే వ్యవహరించి దెబ్బతినిపోయింది అంటూ చురకలు కూడా వేశాడు… సరే, రాధాకృష్ణ వ్యాసపు ఉద్దేశం ఏమైనా సరే, చాలావరకూ నిజాలే ఉన్నయ్… ఏ రాజకీయ నాయకుడైనా సరే తనకు ఎదురు ఉండకూడదనే భావిస్తాడు, ప్రయత్నిస్తాడు… సొంత పార్టీలోనైనా, అది ఎదుటి పార్టీల నుంచైనా… మోడీ కూడా రాజకీయ నాయకుడే కదా మరి… రాజసూయ యాగం సహజం… దానికి అవకాశమిస్తున్నది విపరీతమైన అవినీతి వ్యవహారాలో ప్రాంతీయ నేతలే కదా మరి…
ఎవరు మినహాయింపు..? ఒక్క ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను వదిలేస్తే… (తన పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బోలెడు నిధులు దక్కాయి… రాధాకృష్ణ చెప్పినట్టు విరాళాలు లేకుండా ఏ పార్టీ నడుస్తుంది..?) మిగతా ప్రాంతీయ పార్టీల నేతలు ఒక్కొక్కరే దెబ్బతింటున్నారు, రాజీపడుతున్నారు… కాదు, మోకరిల్లుతున్నారు… మోడీ ఏనాటి నుంచో చెబుతున్నాడు… దేశాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తానని, అవినీతి కంపులో కూరుకుపోయిన కుటుంబ పార్టీలనూ తుడిచిపెట్టే పని ఎప్పుడో మొదలుపెట్టాడు… అంతిమంగా బీజేపీని ఓ బలమైన శక్తిగా నిలబెట్టి నిష్క్రమిస్తాడు… అదే తన లక్ష్యం, దాన్నే రాజసూయ యాగం అంటే… తప్పేమీ లేదు… అబ్బే, అదేమీ లేదని మోడీ తప్పించుకోవడానికి కూడా ఏమీ లేదు… అవున్నిజమే అని చిద్విలాసంగా నవ్వడం తప్ప..!!
Ads
కొన్ని ఉదాహరణలు… మొన్నటిదాకా ఎగిరిన మమత సైలెంట్… ఆమె మేనల్లుడి యవ్వారాలు బాగా ఉన్నయ్, బయటపడుతున్నయ్… నవీన్ పట్నాయక్ బీజేపీతో తలపడటంకన్నా స్నేహం మేలు అనుకుంటున్నాడు, కాకపోతే సంధి వ్యవహారం ఇంకా సెటిల్ కాలేదు… శివసేన చీలిపోయి బీజేపీ అనుకూల షిండే చేతుల్లో పడింది… శరద్ పవార్ పార్టీ చీలిపోయి, బీజేపీ అనుకూల అజిత్ పవార్ చేతుల్లో పడింది… చంద్రబాబు మోకరిల్లాడు… జగన్ ఏనాటి నుంచో దాసోహం… కేసీయార్ ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే, మోడీయే వద్దంటున్నాడు, రాబోయే రోజుల్లో తొక్కే ప్రయత్నాలు సాగుతాయంటున్నారు… (అసలే డబ్బు బలంతో మొత్తం ప్రతిపక్షాల ప్రచారవ్యయాన్ని భరించే రేంజుకు చేరాడు కదా)…
మాయావతి ఇప్పుడు బలమైన శక్తి కాదు… లెఫ్ట్ పార్టీలు అసలే కాదు… నితిశ్ కూడా ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని కంప్రమైజ్ అయిపోయాడు… ఇక మిగిలింది అఖిలేష్ పార్టీ, లాలూ కుటుంబ పార్టీ ప్లస్ డీఎంకే స్టాలిన్, కాంగ్రెస్… కేజ్రీవాల్ కూడా దెబ్బతినిపోయినట్టే… కేసీయార్, మమత, కేజ్రీవాల్, శరద్ పవార్, నితిశ్ ఎట్సెట్రా నాయకులందరికీ జాతీయ నాయకత్వంపై, ప్రధాని పోస్టుపై ఆశలుండేవి… కాంగ్రెస్ ఐటీ ఖాతాలు కూడా స్తంభింపజేసి వరుసగా దెబ్బలు కొడుతూనే ఉన్నాడు…
కనిమొళి, రాజా కేసు పునరుద్ధరణతో డీఎంకేను ఒత్తడం స్టార్టయింది… వెరసి మోడీ రాజసూయం సాగుతూనే ఉంది… తమిళనాడులో కొత్త పొత్తులు బీజేపీ ఓట్ల శాతం పెంచుతాయి, కేరళలో కూడా ఒకటోరెండో సీట్లు రావచ్చు… అయిపోలేదు… ఎన్నికల ఫలితాల తరువాత మూడింట రెండొంతుల మెజారిటీ గనుక వస్తే… రాజ్యసభలోనూ ఎన్‌డీఏకు మెజారిటీ వస్తే… (సొంతంగా 370 కావాలనేది ఈ రెండొంతుల కోసమే…) రాజసూయ యాగం అసలైన దశకు చేరుకుంటుంది… మోడీది ఇప్పుడు శుక్రమహర్దశ..!! సొంత పార్టీ నేతలు అంటారా..? మోడీషా ద్వయానికి ఎదురుమాట్లాడే గొంతే లేదు ప్రస్తుతానికి..!!
Share this Article