యూటీ… కేంద్రపాలిత ప్రాంతం… ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట… అసలు ఏమిటీ దీని కథ..? మజ్లిస్ బాస్ ఎందుకు దీన్ని తెర మీదకు తీసుకొస్తున్నాడు..? ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటి..? ఒవైసీ వ్యాఖ్య చేసిన వెంటనే టీఆర్ఎస్ ఎందుకు అందుకుని, బీజేపీ మీదకు మాటల దాడికి దిగింది..? ఒక సమీకరణాన్ని ఊహించొచ్చు… టీఆర్ఎస్ ఒకప్పుడు ఉద్యమ పార్టీ… ఎప్పుడైతే అది ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిందో యూటీ (ఉద్యమ తెలంగాణ) బ్యాచును పక్కకు తోసేసి బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచు కుర్చీల్ని ఆక్రమించేసింది… ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన నాటి సెంటిమెంటు తెలంగాణ సమాజంలో లేదు… ఆ సెంటిమెంటుతో ఇంకా రాజకీయ లబ్ధి ఆశించే పరిస్థితి లేదు… ఇంకోవైపు బీజేపీ హిందూ వోటు సంఘటన ఎత్తుగడతో టీఆర్ఎస్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది… ఆ మత రాజకీయాన్ని ఎదుర్కొనడానికి మళ్లీ తెలంగాణ బాపతు సెంటిమెంటే ఉపయోగపడాలి… ఎలా..? ఈ యూటీ అస్త్రం అదే… అయ్యో, అయ్యో, హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేసేస్తారు అనే ఓ నిప్పురవ్వను రాజేసే ప్రయత్నం అందుకే…
అసలు హైదరాబాద్‌ను యూటీ చేస్తారు అనే మాట తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రవాదులు పదే పదే వాడుకున్నారు… ‘‘తెలంగాణ ఇచ్చుకొండి, కానీ హైదరాబాదును యూటీ చేయండి…’’ అనే డిమాండ్లు గట్టిగా వినిపించినవే… తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను విడదీస్తే ఇంకేముంది..? ఆత్మ లేని దేహం… ఏ తెలంగాణవాదీ ఒప్పుకోడు… దేశానికి రెండో రాజధానిగా చేయండి, సుప్రీం బెంచ్ పెట్టండి, పార్లమెంటు సమావేశాలు పెట్టండి… కానీ హైదరాబాద్ తెలంగాణలో భాగంగానే ఉండాలనేది తెలంగాణవాసి బలమైన భావన… అదంతే… ఆ హైదరాబాద్‌ను వేరు చేసే ప్రయత్నం చేయబోతున్నారు, బీజేపీ ఈ పని చేయబోతోంది అనే ప్రచారం స్టార్ట్ చేస్తే చాలు, అదే బీజేపీకి నెగెటివ్ అవుతుంది అనేది బహుశా ఒవైసీ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం కావచ్చు… రచ్చ, చర్చ జరిగేకొద్దీ జనంలో సందేహాలు పెరిగే ప్రమాదముందని బీజేపీకి కూడా తెలుసు… అందుకే బండి సంజయ్ కూడా సైలెంటుగా ఉండిపోయాడు…
Ads
అయితే ఇలాంటి సున్నితమైన ప్రచారాలు కొన్నిసార్లు కౌంటర్ ప్రొడక్ట్ అయ్యే ప్రమాదముంది… అందుకే జాగ్రత్తగా హైదరాబాద్ పేరుతోపాటు లక్నో, చెన్నై, బెంగళూరు తదితర మెట్రో నగరాలన్నీ బీజేపీ యూటీలను చేసే ప్రమాదముంది అంటూ ఓ రాయి విసిరాడు… తను అంత అనాలోచితంగా ఏమీ వ్యాఖ్యలు చేయడు, రాజకీయ ఉద్దేశంతోనే చేస్తాడు… ఫీడ్ బ్యాక్ పరిశీలిస్తున్నాడు… తనే కాదు, తన దోస్త్ కేసీయార్ కూడా..! టీఆర్ఎస్ వాళ్లు అక్కడక్కడా యూటీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నా కేసీయార్, ఇతర టాప్ కేడర్ సైలెంటుగానే ఉండి, పరిశీలిస్తున్నారు… కిషన్‌రెడ్డి ఈ ప్రచారాన్ని ఖండించినా సరే, టీఆర్ఎస్లోని ఓ సెక్షన్ దీన్ని అక్కడక్కడా ప్రచారంలోకి తీసుకొస్తోంది… నిజానికి ఒవైసీ మాటలే కన్విన్సింగుగా లేవు… మెట్రోల్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తారనేది ఓ ఊహాత్మక విషయం… బీజేపీ ప్రణాళికల్లో లేదు, ఆలోచనల్లోనూ లేదు… పైగా దానివల్ల బీజేపీకి రాజకీయంగా వచ్చే ఫాయిదా కూడా ఏమీలేదు… ఉదాహరణకు హైదరాబాదే తీసుకుంటే… బీజేపీకి మొత్తం తెలంగాణ మీద పెత్తనం కావాలి, ఒక్క హైదరాబాద్ మీద కాదు… ఒక్క హైదరాబాద్ మీద పెత్తనం కోసం ఎందుకు రాజీపడుతుంది..?
అసలు కేంద్ర పాలిత ప్రాంతం దేనికి..? కాస్త చెప్పుకోవాలి… అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ తదితర ఈశాన్య రాష్ట్రాలు స్వాతంత్య్రానంతరం చాన్నాళ్లకు మన దేశంలో కలిశాయి… ముందుగా కేంద్రమే అక్కడి పాలనను చెప్పుచేతల్లో పెట్టుకుని, తరువాత రాష్ట్ర హోదా ఇచ్చింది… విలీన ప్రక్రియ పద్ధతి అది… ఫ్రెంచ్ ఆధీనంలోని పాండిచ్చేరి, పోర్చుగీస్ పెత్తనం కింద ఉన్న గోవా మొదట కేంద్ర పాలిత ప్రాంతాలు… పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని కాబట్టి చండీగఢ్ యూటీ… భద్రత, రక్షణ, ఆర్థిక, వ్యాపార, రాజకీయ కోణాల్లో కీలకం కాబట్టి అండమాన్, లక్షద్వీప్ యూటీలు… కాశ్మీర్, లడఖ్ కథ వేరు… సో, యూటీ చేయడానికి ఏదేని బలమైన ప్రాతిపదిక కావాలి… ఇన్ని గొడవలు జరుగుతున్నా, తమకు పడని ప్రభుత్వం ఉన్నా సరే ఢిల్లీని తిరిగి యూటీ చేయడం లేదు బీజేపీ… మరి మెట్రోలన్నీ యూటీలుగా ఎలా చేస్తుంది..? ఎందుకు..? అలాంటప్పుడు ఈ యూటీ ప్రచారంతో రాజకీయ లబ్ధిని ఆశిస్తే అది ఫలిస్తుందా..? ఏమో, రాయి విసిరాను, తగిలితే వోకే, తగలకపోతే పోతేపోనీ అంటాడేమో ఒవైసీ…!!
Share this Article