దీపం చుట్టూ పురుగులు… ఫ్యాషన్, మోడల్స్, టీవీ, సినిమా… ఈ రంగుల ప్రపంచంలోకి ప్రవేశించిన మహిళల్లో కొందరు మాత్రమే వెలిగిపోతారు… చాలామంది మాడిపోతారు… అన్నిరకాల దోపిడీలకు గురయ్యారు… చివరకు అనారోగ్యమూ జతకలిస్తే ఇక బతుకు చిందరవందర… కొందరు మధ్యలోనే ఫీల్డ్. మార్చేసి కష్టనష్టాల నుంచి తప్పించుకుంటారు…
ఒక అమ్మాయి… తన తొలి సినిమా ఏకంగా సల్మాన్ ఖాన్‌తో… అంటే అర్థం చేసుకోండి… ఎంతటి బెటర్ స్టార్టింగ్ కెరీరో… కానీ మస్తు ఎదురుదెబ్బలు… వైపల్యాలు… ఆమె పేరు పూజ దడ్వల్… 1995లో సల్మాన్ ఖాన్‌తో వీర్గతి అనే సినిమా వచ్చింది… సినిమా ఫ్లాప్… కానీ తనతోపాటు హీరోయిన్‌గా నటించిన పూజ దడ్వల్‌కు కూడా పేరొచ్చింది… లైమ్ లైట్‌లోకి వచ్చింది… పది మందికీ తెలిసింది ఆమె…
1977లో ముంబైలో పుట్టింది ఆమె… స్కూలింగ్, కాలేజీ అన్నీ అక్కడే… చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం… నటనా రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని తపన… అందుకే చదువుతో పాటు యాక్టింగ్ క్లాసుల్లో కూడా చేరింది… ఒకరోజు యాక్టింగ్ క్లాస్‌లో ఉండగా పూజకు ఓ సినిమా ఆఫర్ వచ్చింది. 17 సంవత్సరాల వయస్సులోనే..,
Ads
సల్మాన్ ఖాన్ ప్రధాన కథానాయకుడి పాత్ర… పూజ ఎగిరి గంతేసింది… కానీ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె కెరీర్‌కు అది పెద్దగా బూస్టప్ కాలేదు… ఆ సినిమా తరువాత కొన్ని అవకాశాలు వచ్చాయి, చేసింది… కానీ ఆశించినంత ఫేమ్ రాలేదు, డబ్బు రాలేదు… కెరీర్ కూడా జోరందుకోలేదు… క్రమేపీ ఆమెను ఇండస్ట్రీ పట్టించుకోవడం మానేసింది…
ఏం చేయాలి..? పోనీ, టీవీల్లో నటిద్దాం, అలా చేస్తే, టీవీల్లో క్లిక్కయితే మళ్లీ సినిమాల్లో చాన్సులు రావచ్చునని ఆశ… టీవీల్లో కొన్ని చాన్సులు వచ్చాయి… 1999లో ఆషికి, 2001లో ఘరానా అనే టీవీ సిరీస్‌లో కనిపించింది… టీవీల్లో మంచి పేరే వచ్చింది, కానీ సినిమా అవకాశాలు ఏమీ వెతుక్కుంటూ రాలేదు… ఇక ఈ నటనకు, ఈ ఫీల్డ్‌కు స్వస్తి చెప్పి, పెళ్లి చేసుకుని, లైఫ్‌లో సెటిల్ కావాలని అనుకుంది…
పూజ పెళ్లి చేసుకుంది… తన భర్తతో కలిసి గోవాకు షిఫ్ట్ అయింది,.. అక్కడ అతని క్యాసినో నిర్వహణలో ఆమె సహాయం చేసింది… అయితే, 2018లో, పూజ అనారోగ్యం పాలైంది… వైద్యులను సందర్శించినప్పుడు ఆమెకు క్షయ అని తేల్చారు… అది తీవ్రమైన అనారోగ్యమే… అసలే అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను అత్తామామలు, భర్త ఆమెతో బంధాన్ని కట్ చేసుకుని, ముంబైలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లిపోయారు…
(pooja in 2020 at golden temple)
ఇప్పుడు పూజకు చుట్టూ ఓ దురదృష్ట వాతావరణం… ఆరోగ్యం లేదు, తనకంటూ ఓ కుటుంబం లేదు, ఉపాధి లేదు, డబ్బు లేదు… భవిష్యత్తు ఏమిటో తెలియదు… నటుడు రాజేంద్ర సింగ్ ఆమె సహాయం చేయడానికి ముందుకొచ్చింది… ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చింది… ఒకప్పటి అందమైన పూజ అనారోగ్యంతో బాగా చిక్కిపోయింది… మంచి ఆహారం కావాలి క్షయ నుంచి కోలుకోవడానికి… ఎవరైనా కనిపెట్టుకుని ఉండాలి… ఎవరు సాయం చేస్తారో ఆలోచించసాగింది…
ఆమెకు తన తొలి హీరో సల్మాన్ ఖాన్ గుర్తొచ్చాడు… ఓ వీడియో సందేశాన్ని యూట్యూబులో పోస్టు చేసింది… ఏమైనా సాయం చేయగలవా అనడిగింది… అది సల్మాన్‌ను చేరింది… వెంటనే సహాయ హస్తం అందించాడు… ఆమె తదుపరి ఆరు నెలల వైద్యం ఖర్చులు, ఇతరత్రా సాయం తనే చేశాడు… కొద్దిగా కోలుకున్న తరువాత ముంబైలోని ఓ చిన్న అపార్ట్‌మెంటులోకి మారింది… ఏవో కొన్ని ఉద్యోగాలు చేసేది, కానీ ఆదాయం సరిపోయేది కాదు… కొన్నిసార్లు రోజుకు వంద దొరకడం కూడా కష్టమయ్యేది…
ఇతరత్రా ఆదాయ మార్గాలు కనిపించడం లేదు… పాత పరిచయాలతో పదే పదే ప్రయత్నించగా 2020లో ఓ పంజాబీ చిత్రంలో చాన్స్ దొరికింది, పేరు శుక్రనా, గురునానక్ దేవ్‌జీ… ఆ సినిమాపై బాగా ఆశలు పెట్టుకుంటే అదీ ఆమెను నిరాశలోకి పడేసింది… కథ మొదటికొచ్చింది… మళ్లీ ఆమెకు ఆ రాజేంద్రసింగే అండగా వచ్చాడు… ఓ టిఫిన్ సర్వీస్ పెట్టుకొమ్మన్నాడు… దానికోసం ఓ చిన్న స్థలం వెతికి పెట్టాడు, అవసరమైన సామగ్రి కొనిచ్చాడు… ఇప్పుడామె అదే చిన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ, ఆ టిఫిన్ సర్వీస్‌తోనే బతుకు నెట్టుకొస్తోంది… (మార్చి 24, వరల్డ్ టీబీ డే… ఈ స్టోరీ, ఫోటో డీఎన్ఏ మీడియా సౌజన్యం… ఆమె యమలీల సినిమాలో కృష్ణ సరసన 1994లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది… తన కెరీర్ తొలిదినాలు…)
Share this Article