ఇది మరీ పాత మోడల్ అంబాసిడర్ బండి లెక్క సాలిడ్‌గా ఉంది… కాదు, కాదు, పాత బుల్లెట్ బండి ఇది, ఆ చప్పుడే డిఫరెంట్ కొడ్తంది…. ఇదెక్కడి బండిరా బాబోయ్, ఊహించని డ్యాష్లిస్తోంది…….. ఓ డివిజన్‌కు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఓ నాయకుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి చేసిన సరదా కామెంట్ ఇది… తన ఇంటి పేరు బండి కదా… నిజంగానే బండి సంజయ్ ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఓ డిబేటబుల్ కేరక్టర్ అయ్యాడు… ఎందుకంటే..?
వరదసాయం ఆపాలని బీజేపీ లేఖ రాసినట్టుగా టీఆర్ఎస్ ప్రచారం చేయగానే… దా, నిరూపించు, లేదంటే ఈ అమ్మవారి మీద ప్రమాణం చేయి కేసీయార్ అంటూ గబగబా వెళ్లి చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి దగ్గర బైఠాయించాడు… అరెస్టు చేస్తరా, చేయండి, మీ సీఎం సారు కమస్కం మక్కా మసీదు కోసమైనా రావచ్చుగా అని వెక్కిరించాడు పోలీసులను… ఏదో కొత్త సెగ పుట్టించాలి అనుకున్నాడు… అది చల్లబడ్డదో లేదో మరొకటి అందుకున్నడు…
Ads
రోహింగ్యాలు, పాకిస్థానీలు బొచ్చెడు మంది పాతబస్తీలో ఉన్నరు, సర్జికల్ స్ట్రయిక్స్ చేసి తరిమేస్తాం… అని వ్యాఖ్యలు చేసి ఇంకోవైపు అగ్గిపెట్టిండు… దాన్ని ఆర్పడానికి టీఆర్ఎస్, మజ్లిస్ నానా తిప్పలూ పడుతుండగానే… ఈసారి మజ్లిస్ వాళ్లే మరో చాన్స్ ఇచ్చాడు బండికి… ఈ పీవీ ఘాట్ క్యాహై, ఎన్టీయార్ ఘాట్ క్యాహై, కూల్చేయాలి అని మజ్లిస్ అక్బర్ అన్నడు… దాన్ని పట్టేసుకున్నాడు బండి…
ఛలో, కూల్చేస్తారా రండి, నేను అక్కడే కూర్చుంటాను, ఎవరొస్తారో రండి, అవి కూల్చేస్తే మేం రెండు గంటల్లో దారుస్సలాం కూల్చలేమా…? అని ఈరోజు ఆ సమాధుల దగ్గర ఓ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసేశాడు… ఉద్రిక్తతలు పెరగొద్దని మళ్లీ అరెస్టు అంటారు, కేసులు అంటారు… అవి జరగాలనే కదా మరి బండి చేసే చప్పుడు…
ఈ బీజేపోళ్లు కావాలని ఎక్కడైనా మతకలహాలు క్రియేట్ చేసే, సిటీలోనూ అశాంతి రేపే ప్రమాదముంది, ఈమేరకు మనకు సమాచారం ఉంది, మీరందరూ జాగ్రత్త, ఎవరినీ వదలొద్దు అని సీఎం పోలీసు అధికారులతో మీటింగు పెట్టి చెప్పాడని వార్తలొచ్చాయి… అవును, భయపడుతున్నాడు, శాంతిభద్రతల సాకుతో ఎన్నికల వాయిదాకు ట్రై చేస్తున్నాడు… అప్పుడే ఓటమి భయం పట్టుకుందా అని కౌంటర్ వేశాడు బండి… ఏ చాన్స్‌నూ వదలడం లేదు సంజయ్…
నిజానికి ఈసారి కేసీయార్ గ్రేటర్ ఎన్నికల తెర మీదకు రావొద్దనే అనుకున్నాడు… మొత్తం కేటీయార్ మీద వదిలేయాలనీ అనుకున్నాడు… కానీ తప్పడం లేదు… అసలు దుబ్బాక సెగ తాకింది కాస్త… ఇక మేనిఫెస్టో రిలీజ్ పేరిట రానే వచ్చాడు… చాలా విషయాలు మీడియాకు చెప్పాడు… ఎన్నికల ఎత్తుగడల్లో తనే సీరియస్‌గా తలమునకలు కావల్సి వస్తోంది,.. ఒక మీటింగ్ lb stadium లో పెడతారని ఒక వార్త… అనివార్యం…
ఇదెక్కడి బండిరా బాబోయ్, రోజుకొకటి సెలుపుతున్నడు, కెలుకుతున్నడు, మంటపెడుతున్నడు అనుకుంటున్నారో లేదో… ఇప్పుడు యూపీ సీఎం యోగిని, బీజేపీ పెద్ద బాస్ జేపీ నడ్డా, అమిత్ షాలనే కాదు, వీలయితే ప్రధాని మోడీనే ప్రచారబరిలోకి రప్పిస్తున్నట్టుగా ప్రచారం ప్రారంభించింది బీజేపీ… వాళ్లు వస్తారా లేదా, ఏ తేదీల్లో ఎవరొస్తారు, ఎవరు రారు అనేది వేరే విషయం… కానీ ఈ ఎన్నికల్ని తామెంత సీరియస్‌గా తీసుకున్నామో నగర ప్రజానీకానికి, తెలంగాణ జనానికీ ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం…
గ్రేటర్ ఎన్నికల్లో ఎవరికేం ఫలితాలు వస్తాయనేది వదిలేయండి కాసేపు… ఇంతకుముందులాగా లేదు సీన్… అనేకచోట్ల మజ్లిస్, టీఆర్ఎస్ నాయకులకు జనం నుంచి నిరసనల వేడి తాకుతోంది… దీనికితోడు అక్కడక్కడా కొందరు నాయకులు ప్లస్ స్వామి గౌడ్ బీజేపీలో చేరడం టీఆర్ఎస్కు ఎంతో కొంత మైనస్… విజయశాంతి చేరిక ఇంపాక్ట్ ఏమీ ఉండకపోవచ్చు గానీ… ఈ ఎన్నికలను మజ్లిస్-టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటీగా మార్చేయగలిగింది బీజేపీ… కాంగ్రెస్ కథ దెబ్బ తిన్నది… అన్నింటికీ మించి తెలంగాణ కాషాయరథాన్ని బండి సంజయ్ నడిపించగలడా అనే సందేహాలకు తనే స్వయంగా సమాధానం ఇస్తున్నాడు… ఈ బండి ఇంజన్‌కు చప్పుడు ఎక్కువ… స్పీడ్, పికప్ కూడా ఎక్కువే…!!
అబ్బే, అసలు సత్తా ఫలితాల్లో కదా తేలేది అంటారా..? గతంలో వచ్చిన 99 సీట్లకు ఒక్కటి తగ్గినా టీఆర్ఎస్కే నామర్దా… 44 సీట్లకు ఏం తగ్గినా మజ్లిస్‌కు నామోషీ… కానీ తమ పాత నాలుగు సీట్లకన్నా ఎన్ని ఎక్కువొచ్చినా బీజేపీ కాలర్ ఎగరేసినట్టే… అదీ గుర్తుంచుకోవాల్సిన అంశం ఈ ఎన్నికల్లో…!
Share this Article