ఈరోజు బెంగళూరు… రేపు ఏ నగరం?
కర్ణాటక రాజధాని బెంగళూరు మహా నగరం నీటికి అలమటిస్తోంది. కోటీ నలభై లక్షల జనాభా ఉన్న నగరానికి కావేరీ నది, పాతాళం అంచుల దాకా వేసిన బోర్లు తప్ప మరో ఆధారం లేదు. కొంచెం ఎండలు ఫెళఫెళలాడగానే బోర్లలో నీళ్లు భగీరథుడికి కూడా దొరకవు. గొంతెండిన కావేరి ఇసుక తిన్నెల మీద కవిత్వం రాసుకోవాల్సిందే కానీ…నీరు దొరకదు. దొరికినా బెంగళూరు అవసరంలో ముప్పయ్ శాతానికి మించి వేసవిలో కావేరి నీటిని ఇవ్వలేదు.
“రెండు నిముషాల్లో హోటల్ నుండి ఇంటికి ఫుడ్ పార్సెల్ డెలివెరి అయ్యే యాప్ ను భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఆవిష్కరించి…లక్ష కోట్ల ఈక్విటీని, ఐ పి ఓ ల్లో జనం పెట్టుబడిని ఆకర్షించగలదు కానీ…ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఆ ఫుడ్ పార్సెల్ ను రెండు గంటలైనా ఆ యాప్ బయటికి తెచ్చుకోలేదు”
అని బెంగళూరు మీద పాపులర్ జోక్. బెంగళూరు ట్రాఫిక్ అంత నరకం. హైదరాబాద్ ట్రాఫిక్ ను విసుక్కునేవారు రెండ్రోజులు బెంగళూరు ట్రాఫిక్ లో తిరిగి వస్తే…హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ జామే కాదని ఒప్పుకుంటారు. ప్రస్తుతం మన చర్చ బెంగళూరు దాహం గురించి కాబట్టి ట్రాఫిక్ నరకాన్ని గాలికొదిలేద్దాం.
Ads
1999లో కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ బెంగళూరును ఐ టీ హబ్ గా మార్చేవరకు ఆ నగరం ఉనికి వేరు. అక్కడినుండి బెంగళూరు తనను తానే గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. వంద కిలోమీటర్ల వరకు నగరం అలా అలా వ్యాపించి…ఇప్పుడు తనకు తానే బరువై… సంతలో తప్పిపోయి…తల్లిదండ్రులకోసం గుక్కపట్టి ఏడ్చే పిల్లాడిలా దిక్కులు చూస్తోంది.
బెంగళూరును ఐ టీ కంపెనీల స్వర్గధామం అన్నారు. స్టార్టప్ కంపెనీల కేరాఫ్ అడ్రస్ అన్నారు. భారత్ సిలికాన్ వ్యాలీ అన్నారు. ఉత్తర భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు బెంగళూరు భూలోక స్వర్గమన్నారు. రాత్రి క్లబ్బులు; పబ్బులు; మందులు; విందులు; చిందులు; పసందులు. వారాంతపు వినోదాలు. ఆకాశమే హద్దుగా భవనాలు.
నలభై, యాభై లక్షల జనాభా ఉన్నప్పుడు ఎంత తీవ్రమైన వేసవిలో అయినా కావేరీ నీళ్లు బెంగళూరుకు సరిపోయేవి. ఇప్పుడు దాదాపు కోటీ నలభై లక్షలు. రాత్రికి రాత్రి బెంగళూరు ఉబ్బినట్లు కావేరీ రాత్రికి రాత్రి ఉబ్బి…తనను తాను అమాంతం పెంచుకుని నీళ్లివ్వలేదు కదా! అదే కావేరి. అలాగే ఉంది.
ఈలోపు బెంగళూరులో చెరువులన్నీ రియల్ ఎస్టేట్ మాఫియా, రాజకీయనాయకుల కబ్జాలతో మాయం. నలభై ఏళ్ల కిందట బెంగళూరు ఊళ్లో, చుట్టు పక్కల 400 చెరువులు ఉండేవి. ఇప్పుడు వంద కూడా మిగల్లేదు. అవి కూడా పేరుకు ఉన్నాయంతే. ఒక పదును వర్షం పడితే నీరింకడానికి చోటే లేకుండా సర్వం కాంక్రీట్ మయం. వర్షాకాలంలో బెంగళూరు అండర్ పాస్ లలో తేలే వాహనాల్లో పోయే ప్రాణాలు రొటీన్ వార్తలు.
బృహత్ బెంగళూరు నగర పాలికె- బిబిఎంపికి ప్రస్తుతం పాలకమండలే లేదు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు. ప్రత్యేధికారి పాలనలో అంత పెద్ద నగరం కుంటుతూ మూలుగుతూ నడవలేక నడుస్తోంది.
మన దగ్గర త్రిబుల్ వన్ జి ఓ ఉన్నట్లు బెంగళూరులో కూడా గ్రీన్ జోన్, రెడ్ జోన్ పేరిట నీటి సహజ ప్రవాహానికి దారులు ఇస్తూ ప్రత్యేక చట్టాలున్నాయి. కానీ అవన్నీ కలవారి చుట్టాలయి…కాగితాలకే పరిమితమయ్యాయి.
ఊళ్లో ఉన్న చెరువుల నామరూపాల్లేవు. పడిన చినుకు ఇంకదు. నీటి ప్రవాహానికి మహానగర నిర్మాణమే అడ్డు. ఎన్ని కావేరులున్నా ఇక చేసేదేముంది?
బెంగళూరు నీటి సమస్య స్వయం కృతాపరాధం. ప్రకృతి అందరికీ అన్నీ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ప్రకృతి మౌలిక ధర్మమది. మనం ప్రకృతిని నమ్ముకోవడం మానేసి…వికృతి వెంటపడ్డాము. ప్రకృతిని నిందించే హక్కు ఏనాడో కోల్పోయాం.
అన్నట్లు-
ఇప్పుడు బెంగళూరు. మేల్కోకపోతే రేపు హైదరాబాద్. ఎల్లుండి చెన్నయ్. ఆవల ఎల్లుండి బాంబే. మరో వేసవిలో కలకత్తా. ఇంకో వేసవిలో ఢిల్లీ. అన్నీ అంతే. సేమ్ టు సేమ్. బెంగళూరుకు కలర్ జెరాక్సులే!
నీటి బెంగతో బెంగళూరు అలా అయ్యింది కానీ…మన మహానగరం ఎందుకలా అవుతుంది? అన్న కోకాపేట ఎకరా వందకోట్ల వందో అంతస్థు బాల్కనీలో మన వికృతి పారవశ్యమే మనల్ను రక్షించాలి!
ఇదొక దేవతా వస్త్రం కథ. అందరికీ అన్నీ తెలుసు. ఎవరికీ ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటారు- అంతే! -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article