ఫోన్ ట్యాపింగ్ పుణ్యమా అని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు…. ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా విశ్లేషణ…
నిజం కాదు… కేసీయార్ చేసిన అక్రమాలతో మొత్తం వెలమ కులానికే నష్టం వాటిల్లిందనే ముద్ర ఏమాత్రం సరికాదు… ఎస్, కేసీయార్ కులాభిమానంతో చేరదీసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా అక్రమాలకు పాల్పడి, విపరీతంగా లాభపడి ఉండొచ్చుగాక… ఐనంత మాత్రాన కులమెందుకు చెడిపోయినట్టు..?
వెలమ కులంలోనూ కేసీయార్ వ్యక్తిగత వ్యవహార ధోరణిని ఇష్టపడని వారు ఉంటారు కదా… ఐనా వెలమ కులానికి కేసీయార్ ఒక ఐకన్ ఎలా అవుతాడు..? ఐతే గియితే విపరీతమైన ఆర్జనకు, నియంతృత్వానికి ఐకన్ అవుతాడేమో..! కేసీయార్ భ్రష్టుపడితే మొత్తం వెలమ కులానికి ఆపాదించడం కరెక్టు కాదు…
Ads
ఇదే ఆంధ్రజ్యోతి వైఎస్‌ను విపరీతంగా ద్వేషించింది… జగన్‌ను ఈరోజుకూ ద్వేషిస్తుంది… మహా మేత, సొంత మేళ్లు వంటి పదాలను వైఎస్‌కు తగిలించింది… సరే, వైఎస్, జగన్ అవినీతి వ్యవహారాలన్నీ నిజమే అనుకుందాం, కానీ రెడ్డి కులం మొత్తానికి ఆ చెడు ముద్రను ఆపాదించలేరు కదా… అంతెందుకు, రాజకీయాల్లో అవినీతిని ఓ రేంజ్‌కు తీసుకుపోయిన ఘనత చంద్రబాబుదే కదా… ఆ చంద్రబాబు క్యాంపే కదా ఈ ఆంధ్రజ్యోతి… అప్పుడెప్పుడో ఐఎంజీ భరత్‌కు అప్పగంగా భూములు, స్టేడియాలు రాసిచ్చిన స్కాంను కోర్టు కూడా తూర్పారబట్టింది కదా… ఒక్క చంద్రబాబు అవినీతిని మొత్తం కమ్మకులానికి ఆపాదించగలమా..?
వ్యక్తి వేరు, కులం వేరు… ఓ కులానికి చెందిన వ్యక్తి తన స్వార్థం కోసం కులాన్ని వాడుకుంటాడు, ఉసిగొల్పుతాడు, ఆ కులస్తుల్లో కులాభిమానాన్ని ప్రజ్వరిల్లజేస్తాడు, కొందరిని వాడుకుంటాడు… తనొక్కడే లాభపడతాడు… అంతేతప్ప ఆ కులంలోని ఓ సగటు వ్యక్తికి దక్కే ఫాయిదా ఏముంది..? ఇది రెడ్డి, కమ్మ, వెలమ కులస్తులకే కాదు, అన్ని కులాలకూ వర్తిస్తుంది… రాజకీయ నాయకులు తమ కోసం కులాన్ని వాడుకుంటుంటే ఆయా కులాల్లో విద్యాధికులే కాదు, మీడియా కూడా అదే మాయలో పడి కొట్టుకుపోవడం అసలైన ట్రాజెడీ…
ఫోన్ ట్యాపింగులో కీలకంగా వ్యవహరించింది ఆ వెలమ పోలీసులే కావచ్చుగాక… కేసీయార్ కోసం ఉద్దేశించిన ఆ అరాచకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని అడ్డగోలుగా దండుకోవచ్చుగాక… ఐనా సరే, దాన్ని కొందరు వ్యక్తుల సమూహం చేసిన అక్రమాలుగానే పరిగణించాలి తప్ప మొత్తం వెలమ కులం తెలంగాణకు చేసిన ద్రోహంగా ఎలా ముద్ర వేస్తారు..?
ఇదే కేసీయార్- వెలమ అంశానికొద్దాం… తను నీడను కూడా నమ్మలేదు కదా… హరీష్, ఈటల మాత్రమే కాదు, చివరకు తనకు గోలీలిస్తూ తన వెంటే తిరిగే సంతోష్ భార్య ఫోన్‌ను, బిడ్డ కవిత భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేయించాడని వార్తలొస్తున్నాయి… మరిక తను వదిలింది ఎవరిని..? సొంత బిడ్డల్నే నమ్మని వ్యక్తి కులానికి స్థూలంగా ఏం చేసినట్టు..? అఫ్‌కోర్స్, కొందరు కులస్తులు మాత్రం లాభపడి ఉండొచ్చుగాక… (గతంలో నక్సలైట్ల విజృంభణతో పల్లెలు వదిలి పారిపోయిన కొందరు దొరలకు కేసీయార్ ధరణితో మేలు చేశాడనే ఆరోపణయితే ఉంది, కానీ ఓ పేద, ఓ మధ్యతరగతి వెలమ కులస్తుడికి ఒరిగిందేమిటి..?
రాజకీయాల్లో కామ్రేడ్ అంటే కమ్మ, రెడ్డి అనీ… వెల్కమ్ అంటే వెలమ, కమ్మ అనీ రకరకాల బాష్యాలను కొత్తగా ప్రచారంలోకి తీసుకొస్తారు… ఎస్, కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు, టీడీపీలో కమ్మలకు, బీఆర్ఎస్‌లో వెలమలకు, జనసేనలో కాపులకు ఎక్కువ ప్రాధాన్యం దక్కొచ్చుగాక, ఎక్కువ టికెట్లు దక్కొచ్చుగాక… కానీ గెలిచినవాళ్లు సొంతంగా అందలాలెక్కుతారు, విపరీతంగా ఆర్జిస్తారు తప్ప సాటి కులస్తులకు చేసే మేలు ఏముంటుంది..?
కొన్ని నామినేటెడ్ పోస్టులు అదనం, తమ కులస్తుల్లో అధికారులకు ప్రమోషన్లు, కీలక పోస్టులు, అమిత ప్రాధాన్యం… బట్, వాటిని బట్టి కేసీయార్ కారణంగ మొత్తం ఆ కులమే నష్టపోయింది, బదనాం అయిపోయింది అనే ముద్రలు వేయడం సమంజసమేనా..? అవునూ, మరి మిగతా కులాల మాటేమిటి హానరబుల్ రాధాకృష్ణ గారూ…!
Share this Article